బిహార్ సీఎం నితీశ్ వింత ప్రవర్తన
పట్నా: ఆయుష్ డాక్టర్లకు నియామక పత్రాలను పంపిణీ చేసిన సీఎం నితిశ్ కుమార్(75)..ఓ వైద్యురాలి హిజాబ్‌ను ఎత్తి ముఖంలోకి చూడటం వివాదాస్పదమైంది. సోమవారం రాష్ట్ర సెక్రటేరియట్ ‘సంవాద్’లో ఆయుష్ డాక్టర్లకు నియామక పత్రాలను సీఎం నితీశ్ అందజేశారు. ఎత్తయిన వేదికపై ఉన్న నితీశ్.. నుస్రత్ పర్విన్ అనే వైద్యురాలు అపాయింట్‌మెంట్ లెటర్ తీసుకునేందుకు ముందుకు వచ్చారు.
సీఎం నితీశ్ ఆమె ధరించిన హిజాబ్‌ను చేతితో పైకెత్తి ముఖంలోకి చూశారు. ముఖం చిట్లించి..ఇదేమిటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ అనూహ్య చర్యతో షాకై చూస్తున్న డాక్టర్ నుస్రత్‌ను అక్కడే ఉన్న ఓ అధికారి పక్కకు లాగారు. కాగా, ఆ సమయంలో సీఎం నితీశ్ పక్కనే ఉన్న డిప్యూటీ సీం సమ్రాట్ చౌదరి వెంటనే అలెర్టయ్యారు. హిజాబ్‌ను ఎత్తి ముఖంలోకి చూస్తున్న నితీశ్ చొక్కా పట్టుకుని లాగి, వద్దంటూ వారించే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.


