
కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ (Dr. Rajkumar) జీవితంలోని కీలక అంశమైన కిడ్నాప్ నేపథ్యంలో ఓ సినిమా రానుంది. రాజ్‌కుమార్‌ని వీరప్పన్ (Veerappan) కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే! అశోక్, ముని, నాగేశ్ ప్రధాన పాత్రధారులుగా కట్టా శ్రీకర్ ప్రసాద్ దర్శకత్వంలో వి.లీలా మనోహర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అక్టోబరులో షూటింగ్ ప్రారంభం కానుంది.
శ్రీకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘రాజ్‌కుమార్‌గారిని వీరప్పన్ కిడ్నాప్ చేయడం అందర్నీ షాక్‌కి గురి చేసింది. అప్పటి కిడ్నాప్ కోణంలో పలు అంశాలను ఈ చిత్రంలో చర్చించబోతున్నాం. ఈ చిత్రానికి ప్రతిభగల టెక్నీషియన్లు పని చేయనున్నారు. పూర్తి వివరాలు దసరా తర్వాత వెల్లడిస్తాం’’ అని చెప్పారు.
అసలేం జరిగింది?
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ తండ్రి రాజ్‌కుమార్‌ను 2000వ సంవత్సరం జూలై 30న వీరప్పన్ కిడ్నాప్ చేశాడు. రాజ్‌కుమార్‌తో పాటు ఆయన అల్లుడు గోవింద్‌రాజ్, బంధువు నగేష్, అసిస్టెంట్ దర్శకుడు నాగప్పను కూడా కిడ్నాప్ చేశాడు. ఆ సమయంలో తమిళనాడులో కరుణానిధి అధికారంలో ఉన్నారు. వీరప్పన్.. రాజ్‌కుమార్‌ను టార్గెట్ చేశాడని 1999లోనే సిట్ (వీరప్పన్‌ను పట్టుకోవడం కోసం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం) ప్రభుత్వాన్ని హెచ్చరిచింది.
అయినా నటుడికి భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం వీరప్పన్‌తో పలుమార్లు చర్చలు జరిపింది. అలా 108 రోజులపాటు రాజ్‌కుమార్‌ను బంధించిన వీరప్పన్ 2000 సంవత్సరం నవంబర్ 15న ఆయన్ను వదిలేశాడు. చర్చలు జరిపినా వినని వీరప్పన్.. సడన్‌గా రాజ్‌కుమార్‌ను విడుదల చేయడం మిస్టరీగానే మిగిలిపోయింది. 2004లో సిట్ బృందం చేతిలో వీరప్పన్ మృతి చెందగా, 2006 ఏప్రిల్ 12న రాజ్‌కుమార్ తుదిశ్వాస వదిలారు.
చదవండి: బిగ్‌బాస్: 5 నెలల పాప.. అయితే గుడ్డు దొంగిలించడానికి సిగ్గు లేదా?