హీరోయిన్ భావన స్వతహాగా మలయాళీ. కానీ తెలుగులోనూ ఒంటరి, మహాత్మ తదితర సినిమాలు చేసింది. అయితే ఈమెపై 2017లో దారుణం జరిగింది. రాత్రిపూట ఈమెని కిడ్నాప్ చేసి, రెండు గంటల పాటు లైంగిక వేధింపులకు గురిచేశారు. తొలుత పదిమందిని అనుమానితులుగా చేర్చరు. తర్వాత హీరో దిలీప్‌ని కూడా అనుమానితుడిగా చేర్చారు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు సాగిన ఈ కేసులో రీసెంట్‌గానే తుదితీర్పు వచ్చింది. ఆరుగురుని దోషులుగా తేల్చారు. హీరో దిలీప్‌ని మాత్రం నిర్దోషిగా ప్రకటించారు.
అయితే ఈ తీర్పు విషయమై హీరోయిన్ భావన అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు ఈ మాత్రం న్యాయమైనా జరిగింది అని ఆనందపడింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సుధీర్ఘమైన పోస్ట్ పెట్టింది. ట్రయల్ కోర్టుపై తను నమ్మకం కోల్పోవడానికి కారణాలు బయటపెట్టింది. అలానే ఈ దేశంలో న్యాయవ్యవస్థ ముందు అందరికీ ఒకేలాంటి న్యాయం దొరకదని కూడా చెప్పుకొచ్చింది.
'8 సంవత్సరాల 9 నెలల 23 రోజుల తర్వాత ఈ బాధాకరమైన ప్రయాణంలో చిన్నపాటి ఆశ కనిపించింది. ఆరుగురు నిందితులకు శిక్ష ఖరారైంది. నా బాధ అబద్ధం, ఇదంతా కట్టుకథ అనుకునే వాళ్లకు ఈ తీర్పు అంకితం. మీకు ఇప్పుడు మనశ్శాంతి దొరికిందని అనుకుంటున్నా'
'అందరూ అనుకుంటున్నట్లు మొదటి అనుమానితుడు నా డ్రైవర్ కాదు, అదంతా అబద్ధం. నేను చేస్తున్న ఓ సినిమా కోసం ప్రొడక్షన్ కేటాయించిన డ్రైవర్ అతడు. సంఘటన జరిగిన రోజు తప్పితే అంతకు ముందు ఒకటి రెండుసార్లు మాత్రమే చూశా. కాబట్టి అసత్య ప్రచారాలు ఆపండి. ఈ తీర్పు చాలామందికి ఆశ్చర్యపరిచి ఉండొచ్చు కానీ నాకు కాదు. ఎందుకంటే 2020 ప్రారంభంలోనే ఈ కేసులో ఏదో పొరపాటు జరుగుతుందనిపించింది. ప్రొసిక్యూషన్ కూడా కేసులో తేడా గుర్తించింది. మరీ ముఖ్యంగా ఓ అనుమానితుడు విషయంలో'
'ఇన్నేళ్లలో హైకోర్టు, సుప్రీంకోర్టుకి నేను పలుమార్లు వెళ్లాను. ట్రయిల్ కోర్టుపై నాకు నమ్మకం లేదని పేర్కొన్నాను. కానీ నా ప్రతి రిక్వెస్ట్‌ని తోసిపుచ్చారు. ఇన్నేళ్ల బాధ, కన్నీళ్లు, ఎమోషనల్ స్ట్రగుల్ తర్వాత.. 'దేశంలోని అందరికీ కోర్టులో ఒకేలాంటి ట్రీట్‌మెంట్ దొరకదు' అనే విషయం నాకు అర్థమైంది. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఇప్పటికీ నన్ను తిట్టే వాళ్లకు చెబుతున్నాను. మీరు అలానే అనుకోండి నాకేం అభ్యంతరం లేదు' అని భావన సుధీర్ఘ పోస్ట్ పెట్టింది.
ట్రయల్ కోర్టుపై నమ్మకం కోల్పోవడానికి కారణాలు ఇవే అని భావన కొన్నింటిని ప్రస్తావించింది.
నా ప్రాథమిక హక్కులకు రక్షణ దొరకలేదు. ఈ కేసులో కీలక సాక్ష‍్యమైన మెమొరీ కార్డ్‌ని మూడుసార్లు ట్యాంపర్ చేశారు. అది కూడా కోర్టు కస్టడీలో ఉండగానే.
వాదనలు సాగుతున్నప్పుడే ఇద్దరు పబ్లిక్ ప్రొసిక్యూటర్స్ రాజీనామా చేశారు. ఈ కేసులో న్యాయం జరుగుతుందని ఆశపడొద్దని, కోర్టు వాతావరణం అస్సలు సరిగా లేదని నాతో చెప్పారు.
మెమొరీ కార్డ్ ట్యాంపరింగ్ విషయంలో పక్కా దర్యాప్తు చేయమని ఎన్నోసార్లు అడిగా కానీ అది జరగలేదు. మళ్లీ మళ్లీ అడిగేంతవరకు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కూడా నాకు ఇవ్వలేదు.
ఈ కేసు విషయమై న్యాయం జరగట్లేదని గౌరవనీయ రాష్ట్రపతి, ప్రధానమంత్రికి కూడా స్వయంగా నేను లేఖ రాశాను.
ఓపెన్ కోర్టులో ఈ కేసు విచారించాలని నేను అడిగాను. తద్వారా మీడియా, ప్రజలకు ఏం జరిగిందో తెలుస్తుందని అన్నాను. కానీ నేను అడిగిన విషయాన్ని అస్సలు పట్టించుకోలేదు.
ఈ సంఘటనకు కారణమేంటి?
హీరో దిలీప్ తొలుత హీరోయిన్ మంజు వారియన్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఈమెతో బంధంలో ఉన్నప్పటికీ హీరోయిన్ కావ్య మాధవన్‌తో రిలేషన్ మెంటైన్ చేశాడు. కొన్నాళ్లకు మంజు విడాకులు ఇవ్వడంతో దిలీప్.. కావ్యని వివాహం చేసుకున్నాడు. అయితే కావ్య గురించి భావననే మంజుకి చెప్పిందని దిలీప్ అనుమానించాడు. ఈ క్రమంలోనే సుఫారీ ఇచ్చి భావనపై దారుణానికి ఒడిగట్టాడనేది ఆరోపణ.


