తెలుగు సినీ నటి ప్రత్యూష మృతి కేసు 2002లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి శిక్ష అనుభవిస్తున్నాడు. హైకోర్టు విధించిన జైలుశిక్షను సవాల్ చేస్తూ.. అతనికి విధించిన శిక్షను పెంచాలంటూ ఆమె తల్లి సరోజినీదేవి కోర్టును ఆశ్రయించింది. అయితే, సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. అయితే, ప్రత్యూష బయోపిక్ త్వరలో తెరకెక్కించనున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఆమె కథన రష్మిక ఇప్పటికే విన్నారని, త్వరలో గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ఫిల్మ్ నగర్ టాక్.(Actress Pratyusha Biopic)
ప్రత్యూష ఉదంతం 2002, ఫిబ్రవరిలో జరిగింది. సుమారు 23ఏళ్లు అవుతున్నా సరే ఇప్పటికీ తీర్పు రాలేదు. న్యాయం కోసం ఆమె తల్లి పోరాటం చేస్తూనే ఉంది. న్యాయం ఎప్పటికి వస్తుందో తెలియదు. నిందితుడు సిద్ధార్థ రెడ్డి తరఫు న్యాయవాది మరణించడంతో మరికొంత జాప్యం చోటు చేసుకుంది. న్యాయపరంగా ఇది లాంగ్-రన్నింగ్ కేసు, 23 ఏళ్ల తర్వాత కూడా తీర్పు రాకపోవడం న్యాయవ్యవస్థలో ఆలస్యాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రత్యూష మరణం ఆత్మహత్యగా పరిగణించబడినా, సిద్ధార్థరెడ్డి పాత్రపై వివాదం కొనసాగుతోంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడితే గానీ పూర్తి విషయాలు వెలుగులో వస్తాయి.

ప్రత్యూష కేసులో సీబీఐ నివేదిక
ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి ఇద్దరూ ఇంటర్ చదువుతున్నప్పుడే ప్రేమలో పడ్డారు. హైదరాబాద్‌లోనే వారిద్దరూ ఇంటర్ పూర్తి చేశారు. అయితే, చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టిన ప్రత్యూష సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ, సిద్ధార్థరెడ్డి మాత్రం ఇంజినీరింగ్‌లో చేరాడు. కొంత కాలం పాటు బాగానే ఉన్నారు. అయితే, ఇద్దరి మధ్య విభేదాలు రావడతో 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఇద్దరూ విషం తాగారు.
చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అయితే, ప్రత్యూష మరుసటి రోజే చనిపోయింది. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థరెడ్డి డిశ్చార్జి అయ్యాడు. కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి తీసుకోవడం వల్లే ఈ ఘటన జరిగిందన గుర్తించారు. మరణానికి ముందు ప్రత్యూషపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ప్రభుత్వం నియమించిన ముగ్గురు వైద్యుల టీమ్ ఒక నివేదిక ఇచ్చింది. ప్రత్యూష ఆత్మహత్యకు నిందితుడు సిద్ధార్థరెడ్డి పురికొల్పారని సీబీఐ నివేదిక ఇచ్చింది.
నిందితుడు సిద్ధార్థరెడ్డి ఎక్కడ ఉన్నాడు..?
ప్రత్యూష హత్య కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు. హైకోర్టు ఆయనకు శిక్ష విధించినప్పటికీ, అప్పీల్ కారణంగా ఆయన జైలు శిక్షను తప్పించుకుని బయట ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉండటంతో తుది నిర్ణయం ఇంకా వెలువడలేదు. ఈ కారణంతోనే ప్రత్యూష తల్లి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది నవంబర్ 20 సుప్రీంకోర్టు ఇరుపక్షాల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడిన తర్వాతే ఆయన భవిష్యత్తు స్పష్టమవుతుంది.
ఆ రోజు ఏం జరిగింది.. ప్రత్యూష తల్లి చెప్పిన మాటలు ఇవే
అది 2002, ఫిబ్రవరి 23 సాయంత్రం. తెల్లవారి బెంగళూరుకి బయలుదేరాలి. అది కన్నడ సినిమాలో తొలి అవకాశం. ఫేషియల్, వ్యాక్సింగ్ చేయించుకోవడానికి కజిన్ శిరితో కలసి బ్యూటీపార్లర్‌కెళ్లింది. తనకిష్టమైన కెనెటిక్ హోండా మీదనే వెళ్లారిద్దరూ. పింకీ పార్లర్‌లో ఉన్నప్పుడు సిద్ధార్థ వచ్చాట్ట. ఫేషియల్ పూర్తయ్యే వరకు వెయిట్ చేశాట్ట. ఆ తర్వాత సిద్ధార్థతో ఓ పదిహేను నిమిషాలు రైడ్‌కెళ్లి వస్తానని శిరిని వెయిట్ చేయమని చెప్పింది.
సిద్ధార్థ తన కారులో తీసుకెళ్లాడు. కొంత సేపటికి నాకు ఫోన్... ‘జయం సినిమాలో హీరోయిన్‌గా కన్‌ఫర్మ్ చేసినట్లు తేజ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, జయం ఆఫీస్‌కెళ్లి వస్తాను’ అని చెప్పింది. అదే చివరి మాట. కానీ వాళ్లు మాత్రం జయం ఆఫీస్‌కు వెళ్లనే లేదు. బ్యూటీపార్లర్‌లో ఉన్న శిరి ఫోన్ చేస్తే పది నిమిషాల్లో వస్తానన్నదట. ఆ తర్వాత ఫోన్ తియ్యలేదట. అప్పటి వరకు ప్రతి వివరమూ సరిగ్గా సరిపోలుతూనే ఉంది. ఆ తర్వాత అంతా మిస్టరీనే. (Actress Pratyusha Death Mystery)
కేర్ నుంచి నిమ్స్‌కి
పోస్ట్‌మార్టమ్ నిమ్స్‌లో. సాయంత్రం ఐదు దాటిందని అప్పుడు పోస్ట్‌మార్టమ్ చేయలేదు. మర్నాడు ఉదయం పదకొండుకి అమ్మాయినిచ్చారు. గొంతు నొక్కినట్లు కమిలిన గుర్తులున్నాయి. ఒక వైపు నాలుగు, ఒక వైపు ఒక వేలి గుర్తు స్పష్టంగా తెలుస్తున్నాయి. బలవంతంగా గొంతు నొక్కి నోరు తెరిపించి పాయిజన్ పోశారని నాకనిపించింది. హాస్పిటల్ వాళ్లు మాత్రం ‘ట్రీట్‌మెంట్ సమయంలో పాయిజన్ వామిట్ చేయించేటప్పుడు పడిన గుర్తులవి’ అన్నారు.

పొరపాటు చేశాం.. ఖననం చేసి ఉంటే..!
ప్రత్యూష మరణం గురించి ఆమె తల్లి ఇలా చెప్పారు. ప్రత్యూషను మా సంప్రదాయం ప్రకారం దహనం చేశాం. కానీ ఖననం చేసి ఉంటే బావుండేదని ఇప్పటికీ బాధపడుతున్నాను. రీ పోస్ట్‌మార్టమ్ చేస్తే నిజాలు బయటపడేవి. మా అమ్మాయి పాయిజన్ ఎందుకు తీసుకుంది... అనే ప్రశ్న నన్ను తొలిచింది తప్ప, అత్యాచారం అనే ఊహే రాలేదు నాకు. మా ఊరికి తీసుకెళ్లి దహనం అయిన తర్వాత టీవీల్లో వార్తలు చూసే వరకు నాకు ఆ ఆలోచనే రాలేదు. అప్పట్లో ఇప్పటిలా మీడియా విస్తృతంగా లేదు. ఇన్ని చానళ్లు ఉండి ఉంటే వెంటనే విషయం బయటకు పొక్కి ఉండేది. వార్తలు చూసిన వెంటనే, కర్మకాండలు కూడా జరగకముందే హైదరాబాద్ వచ్చేశాను. అప్పటి నుంచి మొదలైన నా న్యాయపోరాటం ఇంకా సాగుతూనే ఉంది.
ప్రత్యూష సినిమా విశేషాలు
సినీ నటి ప్రత్యూష సుమారు 12 సినిమాల్లో నటించింది. 1998–2002 మధ్యకాలంలో తెలుగు, తమిళ సినిమాల్లో మెప్పించింది. ఆమె ముఖ్యంగా రాయుడు, శ్రీరాములయ్య, సముద్రం, కలుసుకోవాలని వంటి తెలుగు చిత్రాల్లో గుర్తింపు పొందింది. ప్రత్యూష కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే ఆమె మరణం జరగడం సినీ రంగానికి పెద్ద షాక్.


