ఇండస్ట్రీలో హీరోగా చేసి హిట్ కొట్టడం గొప్పకాదు. వచ్చిన గుర్తింపుని నిలబెట్టుకోవడం గొప్ప. అలా చేయలేకే చాలామంది హీరోలు కనుమరుగవుతున్నారు. అలాంటి ఓ హీరోనే ఇతడు. 'రాజాసాబ్' డైరెక్టర్ మారుతి తీసిన తొలి మూవీ హీరో ఇతడే. కానీ గత తొమ్మిదేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. ఇంతకీ ఇతడెవరు? ఇప్పుడేం చేస్తున్నాడు?
(ఇదీ చదవండి: 'అఖండ 2'లో బాలకృష్ణ కూతురిగా.. ఎవరీ అమ్మాయి?)
పైన ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు మంగం శ్రీనివాస్. ఇలా చెబితే మీకు గుర్తురాకపోవచ్చు. 'ఈ రోజుల్లో' హీరో శ్రీ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. 2012లో ఈ సినిమా రిలీజైంది. అందరూ కొత్త నటీనటులతో తీసిన ఈ చిత్రం ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టించింది. దర్శకుడు మారుతికి మంచి గుర్తింపు తెచ్చింది. అలానే హీరోగా చేసిన శ్రీ కూడా చాలానే అవకాశాలు సొంతం చేసుకున్నాడు. కాకపోతే సరైన ప్లానింగ్, గైడెన్స్ లేకపోవడం వల్ల కేవలం మూడు నాలుగేళ్లకే ఇండస్ట్రీకి దూరమైపోయాడు.

'ఈ రోజుల్లో' సినిమా తర్వాత శ్రీ.. రయ్ రయ్, అరవింద్ 2, తమాషా, పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్, గలాటా, సాహసం చేయరా డింభకా, లవ్ సైకిల్.. ఇలా మూడునాలుగేళ్లలో 12 వరకు మూవీస్ చేశాడు. కానీ అన్నీ ఫ్లాప్ అయ్యాయి. శ్రీ కూడా తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో అదే విషయాన్ని చెప్పాడు. హీరోగా చేస్తున్న టైంలో తాహతుకు మించిన పనులు చేశానని, తన చిత్రాలు రిలీజ్, షూటింగ్ విషయంలో ఇబ్బందుల్లో ఉంటే సొంత డబ్బులు ఇచ్చానని.. అలా ఒక్క రూపాయి కూడా దాచుకోలేకపోయానని చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం సొంతూరు విజయవాడలో వ్యవసాయ సంబంధిత మెషీన్స్ తయారు చేసే ఓ కంపెనీ నడుపుతున్నాడు. ఇది శ్రీ కుటుంబ బిజినెస్. తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి ఇతడికి వచ్చింది. 2020లో కొవిడ్ కారణంగా నాన్న చనిపోవడంతో ఈ బిజినెస్‌లోకి వచ్చానని శ్రీ చెప్పాడు. దీనితో పాటు హైదరాబాద్‌లో వారాహి స్టూడియోస్ అని ఓ డబ్బింగ్ స్టూడియో ఉందని అన్నాడు. పెద్దల కుదిర్చిన సంబంధం చేసుకున్నానని, భార్య కూడా సినిమాల్లోకి వెళ్లమని ప్రోత్సాహిస్తుందని కానీ తనకే సరైన అవకాశాలు రాక ఇలా ఉండిపోయానని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా తొలి సినిమాతో పోలిస్తే గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించాడు ఈ హీరో.
(ఇదీ చదవండి: రొమాంటిక్ కామెడీ ఫీల్ గుడ్ సినిమా.. 'అరోమలే' ఓటీటీ రివ్యూ)


