రీసెంట్‌గా రిలీజైన 'అఖండ 2' సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. బాలకృష్ణ అభిమానులకు ఇది నచ్చేస్తుండగా.. సాధారణ ప్రేక్షకుడికి మాత్రం ఓకే ఓకే అనిపిస్తోంది. ఏదైతేనేం సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి డిస్కషన్ అయితే నడుస్తోంది. ఇందులో బాలయ్య కూతురిగా నటించిన అమ్మాయి సీన్స్ కూడా కొన్ని వైరల్ అవుతున్నాయి. ఐక్యూ 226, 17 ఏళ్లకే డీఆర్‌డీఓలో సైంటిస్ట్ అనే సన్నివేశాలపై మీమ్స్ కూడా వస్తున్నాయి. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
ఈ సినిమాలో అఖండ కూతురి పాత్రలో కనిపించిన నటి పేరు హర్షాలీ మల్హోత్రా. పంజాబీ హిందు కుటుంబానికి చెందిన ఈమె ముంబైలో పుట్టి పెరిగింది. ఏడేళ్ల వయసులోనే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 'భజరంగీ భాయిజాన్' మూవీలో నటించింది. మున్నీ పాత్రలో మాటలు రానీ అమ్మాయిగా ఆకట్టుకుంది. ఈ మూవీ కంటే ముందే 2012లోనే అంటే నాలుగేళ్ల వయసులోనే 'ఖబూల్ హై', లాత్ ఆవో త్రిష, సావధాన్ ఇండియా సీరియల్స్‌లో నటించింది. 2017లో సబ్ సే బడా కళాకార్ అనే సీరియల్ కూడా చేసింది. దీని తర్వాత దాదాపు ఎనిమిదేళ్ల పాటు నటనకు గ్యాప్ ఇచ్చింది.
మళ్లీ ఇన్నాళ్లకు తెలుగు సినిమా 'అఖండ 2'తో నటిగా రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో హర్షాలీ యాక్టింగ్‌కి ఓ మాదిరి ప్రశంసలు దక్కుతున్నాయి తప్పితే మరీ సూపర్‌గా చేసిందని ఎవరూ అనట్లేదు. కాకపోతే ఈమె క్యారెక్టర్‌కి సంబంధించిన సీన్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలా హర్షాలీ చాన్నాళ్ల తర్వాత ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.


