తొలి సినిమాతోనే సూపర్ హిట్ దక్కడం సినీతారలకు ఓ వరం లాంటింది. ఆ ఒక్క సినిమా చాలు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి. వరుస అవకాశాలు వస్తాయి. స్టార్ హీరోలతో నటించే చాన్స్ వస్తుంది. అయితే ఇదంతా ఒకటి, రెండు చిత్రాలకే పనికొస్తుంది. ఆ తర్వాత కూడా హిట్ రాకపోతే..అంతే సంగతి. హీరోలలాగా హిట్ లేకపోయినా..ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండలేదు. వయసు పెరిగేకొద్ది చాన్స్‌లు తగ్గిపోతుంటాయి. పైగా టాలీవుడ్‌లో అందాలకు కొదవేలేదు. ప్రతి ఏడాది పదుల సంఖ్యలో కొత్త హీరోయిన్లు పుటుకొస్తున్నారు. అందుకే హీరోయిన్ల హిట్ చాలా అవసరం. ఇప్పుడు హిట్ కోసం ఎదురుచూస్తున్న బ్యూటీ కృతిశెట్టి.

తొలి సినిమా ఉప్పెనతో టాలీవుడ్‌లో ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగింది. తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి హిట్లు పడడంతో తనకిక ఎదురులేదనుకున్నారు. కానీ ఎంత వేగంగా ఎదిగిందో అంతే వేగంగా కిందకు పడిపోయింది ఈ బ్యూటీ. ఆమె హీరోయిన్‌గా నటించిన ‘మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, కస్టడీ, మనమే లాంటి చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో టాలీవుడ్ ఆమెను పక్కకి పెట్టింది. ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో.. మాలీవుడ్‌కి షిఫ్ట్ అయింది. అక్కడ కూడా కలిసి రాలేదు. ఆమె నటించిన 'ఆర్మ్' అనే సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో కోలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు తమిళ సినిమాలు ఉన్నాయి.

కార్తి 'వా వాథియార్'(అన్నగారు వస్తున్నారు), ప్రదీప్ రంగనాథన్ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ', రవి మోహన్ 'జీని' చిత్రాల్లో నటించింది. అయితే వీటిల్లో ఒక్కటి హిట్ అయినా చాలు.. కొన్నాళ్ల పాటు ఆమెకు ఢోకా ఉండదు. కానీ హిట్ సంగతి పక్కకుపెట్టు..కనీసం విడుదలకు కూడా నోచుకోవడం లేదు. ఆమె నటించిన సినిమాన్నీ వాయిదాలు పడుతున్నాయి. ఈ నెల 12న అన్నగారు వస్తున్నారు రిలీజ్ అవ్వాల్సింది. భారీ పబ్లిసిటీ కూడా చేశారు. కానీ హఠాత్తుగా ఇప్పుడా సినిమాను వాయిదా వేసినట్టు ప్రకటించారు.

ఇప్పటికే రావాల్సిన మరో తమిళ సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' కూడా కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తోంది. డిసెంబర్ 18న దానిని రిలీజ్ చేస్తామని ఆ మధ్య చెప్పారు. ఆ తర్వాత ఇది కూడా వాయిదా పడినట్లు ప్రకటించారు. అలానే ఆ మధ్య 'జయం' రవి నటించిన 'జీనీ' సినిమా ప్రమోషన్స్ ను మొదలు పెట్టారు. అదీ త్వరలోనే విడుదల అవుతుందని అన్నారు. కానీ డేట్ ప్రకటించలేదు.

ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కువ టెన్షన్ పడుతుంది కృతి శెట్టి మాత్రమే. అసలే హిట్ లేక చాలా కాలం అవుతుంది. వరుస సినిమా రిలీజ్ అయితే..ప్రేక్షకులు తనను మర్చిపోకుండా ఉంటారకుంది. అందుకే ఎంతో హుషారుగా ప్రమోషన్స్ చేసింది. అన్నగారు వస్తున్నారు సినిమాతో హిట్ పడుతుందని.. అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ మళ్లీ అవకాశాలు వస్తాయని ఆశలు పెట్టుకుంది. కానీ చివరికి వాయిదా పడడంతో బ్యాడ్‌లక్ అనుకొని సైలెంట్ అయిపోయింది. త్వరలోనే ఈ సినిమాలన్నీ రిలీజై..ఒక్కటి హిట్ అయినా కృతికి మరిన్ని ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. ఇవి కూడా ఫ్లాప్ అయితే మాత్రం.. కోలీవుడ్‌లో కూడా కృతికి అవకాశాలు రావు. ఓవరాల్‌గా ఆమె సినీ కెరీరే ఇప్పుడు డేంజర్ జోన్‌లో ఉంది.


