మాస్ మ్యూజిక్ ఇవ్వడంలో తమన్ దిట్ట. కిక్ నుంచి మొదలుపెడితే అఖండ 2 వరకు ఎన్నో సినిమాలకు బ్లాక్‌బస్టర్ సంగీతం అందించాడు. మాస్‌కే పరిమితం కాకుండా క్లాస్, లవ్ ఎంటర్‌టైనర్ సినిమాలకు సైతం మంచి మ్యూజిక్ కొట్టాడు. అప్పుడప్పుడూ తమిళ సినిమాలు కూడా చేస్తున్నాడు. అయితే తమిళంలో తనకు అంతగా అవకాశాలివ్వడం లేదంటున్నాడు తమన్.
ఇండస్ట్రీ కలుషితం
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీ కలుషితమైపోయింది. ఇక్కడ వెన్నుపోట్లే ఎక్కువయ్యాయి. మన ఇండస్ట్రీలో ఉన్నంత మ్యూజిక్ డైరెక్టర్లు ఏ ఇండస్ట్రీలోనూ లేరు. అనిరుధ్‌కు తెలుగులో సినిమా ఛాన్స్ రావడం చాలా ఈజీ. కానీ నాకు తమిళంలో అవకాశం రావడం చాలా కష్టం. అక్కడ నాకు అవకాశాలివ్వరు.
ప్రాంతీయభావం ఎక్కువ
తమిళనాడులో ప్రాంతీయభావం ఎక్కువ. వేరేవాళ్లను తీసుకునేందుకు ఆసక్తి చూపరు. కానీ, ఇక్కడ ఆ ఐక్యత లేదు. దేశంలో ఎక్కడినుంచి వచ్చినా మనవాళ్లు యాక్సెప్ట్ చేస్తారు. పోటీని నేను తప్పుపట్టను. అది మంచిదే! దర్శకులు వేరేవాళ్లను రిఫర్ చేస్తున్నారంటే వాళ్లేం కోరుకుంటున్నారో అది నేర్చుకునేందుకు ప్రయత్నిస్తాను. తమిళ, కన్నడ, మలయాళ మ్యూజిక్ డైరెక్టర్లందరూ తెలుగులో పని చేస్తున్నారు.
పీఆర్‌తో పని
వాళ్లందరూ పీఆర్ టీమ్‌ను పెట్టుకుని బాగా పని చేసుకుంటున్నారు. వారి వారి ఇండస్ట్రీలలో లక్షలు కూడా ఇవ్వరు, కానీ మనం వాళ్లను పిలిచి మరీ కోట్లు ఇస్తాం. వాళ్లేదో తెలుగు సినిమా అని కసితో చేయరు. ఇక్కడ డబ్బులు ఎక్కువిస్తారని పని చేస్తారంతే! మనం అలా ఫేక్‌గా బతకలేం. అభిమానులకు ఏం కావాలో అందుకు తగ్గట్లు కష్టపడతాం అని తమన్ చెప్పుకొచ్చాడు.


