
ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా డాక్టర్ జి.చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం ప్రమాణం చేశారు. మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీ కుముదిని, విజిలెన్స్ కమిషనర్ ఎంజీ గోపాల్, సీఎంవో అధికారులు శేషాద్రి, శ్రీనివాస రాజు, మాణిక్ రాజ్, శ్రీనివాసులు, రాజ్ భవన్ కార్యదర్శి దానకిషోర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీనియర్ ఐఏఎస్ అధికారులు మహేశ్ దత్ ఎక్కా, రఘునందన్ రావు, బుద్ధ ప్రకాశ్, వినయ్ కృష్ణారెడ్డి, ఐపీఎస్ అధికారి మహేశ్ భగవత్ తదితరులు హాజరయ్యారు.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బోరేగావ్‌కు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి ఉస్మానియా వర్సిటీ నుంచి బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. ఢిల్లీలో జేఎన్‌టీయూ నుంచి లైఫ్ సైన్సెస్‌లో మాస్టర్స్ చదివారు. 1991లో ఇండియన్ ఫారెస్టు సర్విస్‌లో చేశారు. ఆయన పలు ప్రభుత్వ సర్వీసుల్లో సుదీర్ఘ కాలం విధులు నిర్వహించారు. సీఎం కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఐఎఫ్‌ఎస్ అధికారి చంద్రశేఖర్‌రెడ్డిని సీఐసీగా నియమిస్తూ నాలుగు రోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా, కమిషనర్లుగా బోరెడ్డి అయోధ్యరెడ్డి, పీవీ శ్రీనివాసరావు, కప్పర హరిప్రసాద్, కేఎల్‌ఎన్ ప్రసాద్, రాములు, వైష్ణవి, పర్విన్ మొహిసిన్‌లను ప్రభుత్వం ప్రతిపాదించగా, వివిధ ఆరోపణల కారణంగా ఈ అంశం గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది.