గుర్రపుడెక్క (వాటర్ హైసింత్)... నదీ ప్రవాహాలు, చెరువులు, కుంటల్లో సహజంగా పెరిగే కలుపు మొక్క. నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించడం, నీటి కాలుష్యానికి కారకమవుతుండడంతో వీటి పెరుగుదలను నివారించేందుకు స్థానిక సంస్థలు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇదే సమస్య గోదావరి జిల్లాలు, ముఖ్యంగా నది పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. కానీ అస్సాం సరికొత్త ఆలోచనతో చూపిన పరిష్కార మార్గం అన్ని రాష్ట్రాలకు ఉపయోగపడటమే గాక నదులు, చురువులు పరిశుభ్రంగా ఉంటాయి కూడా. మరి అస్సాం ఎలా ఈ గుర్రపుడెక్క సమస్యకు అర్థవంతంగా పరిష్కారం మార్గం చూపిందో తెలుసుకుందామా..!
ఎన్నో అనర్థాలకు దారితీసే ఈ కలుపు మొక్కను అర్థవంతంగా మార్చి మహిళలకు పని కల్పిస్తూ దాని ద్వారా వారి ఆర్థిక చేయూతకు బాటలు వేసింది అస్సాం స్టేట్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ (ఏఎస్‌ఆర్‌ఎల్‌ఎం). ఈ గుర్రపు డెక్కను పెకిలించి వాటిని ప్రాసెస్ చేస్తూ ఎన్నో కళాకృతులను తయారు చేసేందుకు పెద్ద కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.
అస్సాం రాష్ట్రం మాజూలీ ద్వీపంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఏఎస్‌ఆర్‌ఎల్‌ఎం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తూ వారికి కళా ఉత్పత్తుల తయారీలో మెరికలుగా తీర్చిదిద్దుతోంది. ఈ ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండడంతో వ్యాపారాన్ని విస్తృతం చేసేందుకు వ్యూహాత్మక కార్యాచరణకు సిద్ధమవుతోంది.
బ్రహ్మపుత్రలో విరివిగా...
ప్రపంచంలోని ఐదు అతిపెద్ద నదుల్లో బ్రహ్మపుత్ర ఒకటి. ఊహకందని వేగం, ప్రవాహం దాని సొంతం. దాదాపు ఏడాది పొడవునా ఈ నది ప్రవహిస్తూనే ఉంటుంది. అస్సాం రాష్ట్రంలోని మెజార్టీ ప్రాంతంలో ఈ నది ప్రవహిస్తుండగా... మాజూలీ ద్వీపం చుట్టూ విస్తరించి ఉండడం... నీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడంతో వాటర్ హైసింత్ కూడా ఇక్కడ దట్టంగా అల్లుకుని ఉంటుంది. ఈ పరిస్థితే ఇక్కడి మహిళా సంఘాలకు ఒక అవకాశంగా పరిణమించింది. అస్సాం గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన ప్రత్యేక వ్యూహంతో కళా ఉత్పత్తుల తయారీకి కీలక మలుపుగా మారింది.
మూడు దశల్లో ప్రక్రియ...
వాటర్ హైసింత్ నుంచి కళా ఉత్పత్తుల తయారీ నాలుగు దశల్లో ఉంటుంది. ముందుగా నది నుంచి వాటర్ హైసింత్ సేకరణ మొదటి దశలో చేపడుతుండగా... రెండోదశలో వాటి ఆకులను కత్తిరించి ఆరబెట్టడం... పొడిగా మారిన తర్వాత అల్లికకు అనువుగా మార్చేలా ప్రాసెస్ చేయడం... ఆ తర్వాత వాటిని మహిళలకు అందించే కళాత్మక పనులను కొనసాగించడం... తయారైన వస్తువులను మార్కెటింగ్ చేయడం లాంటి ప్రక్రియను మహిళా సంఘాల ద్వారా నిర్వహిస్తారు. అల్లికల ద్వారా పర్సులు, బుట్టలు, టేబుల్ మాట్స్, హ్యాండ్ బ్యాగులు, ల్యాప్‌టాప్ బ్యాగులు, బాటిల్ కేరియర్లు, హోమ్ డెకర్ ఐటమ్స్‌ను తయారు చేస్తున్నారు.
తయారైన తర్వాత వాటికి పాలిషింగ్ చేయడంతో ఎంతో ఇంపుగా కనిపిస్తాయి. ఇవి పూర్తిగా పర్యావరణ హితమైనవి కావడంతో మార్కెట్‌లో వీటికి క్రేజ్ ఉంది. అయితే ఈ తయారీ ప్రక్రియంతా ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల పర్యవేక్షణలోనే జరుగుతుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ ప్రారంభ దశలో ఉన్నప్పటికీ... ఉత్పత్తి సామర్థ్యం పెరిగిన తర్వాత ఇతర ప్రాంతాలకు సైతం ఎగుమతి చేసేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అస్సాంలోని మాజూలీ నుంచి
– చిలుకూరి అయ్యప్ప, సాక్షి
(చదవండి: ఆ కారు కొన్నప్పుడు బాధపడ్డా..కానీ అదే నా బిడ్డ ఆరోగ్యానికి శ్రీరామరక్ష..!)


