
ఆ చిన్నారి వయసు ఐదేళ్లు.. అయితేనేం పనికిరాని వ్యర్థాలతో అద్భుతాలు సృష్టించింది.. బుజ్జి మెదడుకు పదునుపెట్టి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.. తల్లిదండ్రుల నుంచి వచ్చిన సేవాతత్పరత, సామాజిక బాధ్యతను ఒంటబట్టించుకుంది. అనాథ పిల్లల కోసం వారు చేస్తున్న సేవలో తన పాత్రను గుర్తించి వ్యర్థాలతో చిన్నారులకు బట్టలు తయారుచేసింది. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.
కాప్రా సాకేత్‌కు చెందిన పొట్టపాటి ప్రవీణ్‌కుమార్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. భార్య తేజస్విని సోషల్ వర్కర్‌గా పనిచేస్తున్నారు. వీరి ఐదేళ్ల కుమార్తె అవినా పొట్టపాటి బిల్లబాంగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో యూకేజీ చదువుతోంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే తల్లిదండ్రులతో పాటుగా అవినా కూడ తరచూ వారితో కలిసి వెళ్లేది.
ఈ క్రమంలో తన వయసున్న తోటి పిల్లలకు సరైన దుస్తులు లేకపోవడం, చెప్పులు లేకపోవడం గమనించింది. వారికి తనవంతుగా ఎమైనా సాయం చేయాలనే తలంపుతో వ్యర్థాలతో దుస్తులు తయారు చేయడం మొదలుపెట్టింది. మూడేళ్ల వయసు నుంచే ఇంట్లో ఫ్లాసిక్ బ్యాగులు, ఫ్లాస్టిక్ కవర్లు, పేపర్ బ్యాగులతో దుస్తులు, చెప్పులు వంటి వస్తువులను తయారు చేయడం ప్రారంభించింది.
కుమార్తె ఆసక్తిని గమనించి..
చిన్నారి ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు అవినాను ప్రోత్సహించారు. ఆమె మేధస్సుకు పదును పెట్టి ఫ్లాస్టిక్ వ్యర్థాలతో పలు రకాల దుస్తులను తయారు చేసింది. తమ కూతురు ప్రతిభకు గుర్తింపు ఇవ్వాలనే కోరిక వ్యర్థాలతో తయారు చేసిన దుస్తులను ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కి పంపించారు.
పలుమార్లు చేసిన ప్రయత్నం ఫలించి ఎట్టకేలకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ఆహా్వనం పొందారు. చిన్నారి అవినా అందరి సమక్షంలో ఫ్లాస్టిక్, పేపర్ వ్యర్థాలతో 7 రకాల అందమైన దుస్తులను తయారు ఆశ్చర్యపరించింది. అవినా సృజనను ప్రశంసిస్తూ ఆమెకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కల్పించారు.
చాలా గర్వంగా ఉంది..
అతి చిన్న వయసులో మా కుమార్తె ఇలాంటి రికార్డు దక్కించుకోవడం సంతోషంగా ఉంది. మూడేళ్ల వయసు నుంచే వ్యర్థాలతో ఏదో ఒకటి తయారు చేస్తూ ఉండేది. ఆ ఆసక్తిని గమనించి ప్రోత్సహించాం. తన ప్రతిభను గుర్తించి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం కల్పించారు. అవినా ప్రతిభ పర్యావరణ పరిరక్షణకు దోహదం చేయడం సంతోషం కలిగించింది.
– పొట్టపాటి ప్రవీణ్‌కుమార్, తేజస్విని దంపతులు (తల్లిదండ్రులు)