కాలు మీద కాలు దర్జా కాదు ... అమర్యాద...అనారోగ్యకరం కూడానా? | Health Tips: Is it unhealthy to sit with crossed legs | Sakshi
Sakshi News home page

కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం... అమర్యాద...అనారోగ్యకరం కూడానా?

Nov 9 2025 3:59 PM | Updated on Nov 9 2025 5:43 PM

Health Tips: Is it unhealthy to sit with crossed legs

‘‘ఇది నా కాలు ఈ కాలు కూడా నాదే. నా కాలు మీద నా కాలు వేసుకుంటే నీకేంటి?’’అని అడుగుతాడు పుష్ప సినిమాలో హీరో. ఈ డైలాగ్‌ ఎంత పాప్యులరో.. కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం అనే అంశం కూడా ఇప్పుడు అంతకు మించి పాప్యులర్‌గా మారింది. ఆ మధ్య టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ దగ్గర నుంచి తాజాగా ప్రధానితో మహిళా క్రికెటర్ల సమావేశం దాకా...అనేక సందర్భాల్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం అనేది చర్చనీయాంశంగా మారుతోంది. 

మన సంప్రదాయాల ప్రకారం... ఎవరి ముందైనా మనం కాళ్ల మీద కాలు వేసుకుని కూర్చోవడం అంటే అవతలి వ్యక్తికి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదని మనం భావిస్తున్నట్టు. తరాల నుంచీ కొనసాగుతున్న ఈ నమ్మకమే ఆధునిక సమాజంలో తరచుగా వివాదస్పదం అవుతోంది.  

ఆ వివాదాలు అలా ఉంచితే... అసలు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం అనేది అనారోగ్యకరం కూడా అంటున్నాయి అధ్యయనాలు కొన్ని అభిప్రాయాలు. చాలా మందికి ఒక కాలు మీద మరొక కాలు వేసుకుని కూర్చోవడం చాలా సౌకర్యంగా ఉంటుంది. పాదం అప్పుడప్పుడు తిమ్మిరిగా అనిపించడం ఉన్నా అది సౌకర్యవంతంగా ఉంటుంది అని అదే ఫాలో అవుతారు. కానీ అది మీకు మంచి చేస్తుందా? హాని చేస్తుందా? చేస్తే ఎవరికి? ఎలా? ఎందుకు?

గర్భిణీలకు...
గర్భధారణ సమయంలో, శరీరం వివిధ రకాల  మార్పులకు లోనవుతుంది.  గర్భాశయం విస్తరించినప్పుడు, గురుత్వాకర్షణ కేంద్రం ముందుకు మారుతుంది. తద్వారా సాధారణానికి భిన్నంగా నడుస్తున్నట్లు, నిలబడి, కూర్చోవడం జరుగుతుంది. గర్భధారణ సమయంలో కండరాల ఒత్తిడి, వెన్నునొప్పి  తిమ్మిర్లు అన్నీ సాధారణం. కాళ్ళు క్రాస్‌ చేసి కూర్చోవడం వల్ల  బిడ్డకు ఎటువంటి హాని జరగకున్నా గర్భిణికి చీలమండ వాపు లేదా కాళ్ళ తిమ్మిరి కలిగేందుకు ఇది దోహదం చేస్తుంది.

రక్తపోటు...
ఎవరికైనా రక్తపోటును పరీక్షించే సమయంలో సాధారణంగా రెండు పాదాలను నేలపై ఉంచమని అడుగుతారు. ఎందుకంటే కాళ్లు ఒకదానిపై మరొకటి వేయడం వల్ల రక్తపోటు పెరుగుతుంది కాబట్టి. జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ నర్సింగ్‌ ట్రస్టెడ్‌ సోర్స్‌లో ప్రచురించిన ఒక అధ్యయనంలో  కాళ్లను ఒకదానిపై ఒకటి వేసి కూర్చోవడం వల్ల రక్తపోటులో కలిగే మార్పులను స్పష్టంగా గమనించారు. అదే విధంగా జర్నల్‌ ఆఫ్‌ హైపర్‌టెన్షన్ లో ప్రచురించిన మరొక అధ్యయనంలో, తమ చీలమండను మోకాలిపై ఉంచడం ద్వారా రక్తపోటు పెరిగినట్లు కనుగొన్నారు.

వెరికోస్‌వెయిన్స్‌...
కాళ్ళ నుంచి బయటకు వచ్చే ఉబ్బిన, మెలితిరిగిన, త్రాడు లాంటి సిరలు యవెరికోస్‌ వెయిన్్స. సాధారణంగా తొడల వెనుక  లోపలి కాలుపై  ఎక్కువగా కనిపిస్తాయి.  సిరల్లోని కవాటాల సమస్య కారణంగా వెరికోస్‌ వెయిన్ ్స ఏర్పడతాయి, ఇవి గుండె వైపు రక్తాన్ని పంప్‌ చేయడానికి చాలా కష్టపడి పనిచేస్తాయి. రక్తం పైకి కదులుతున్నప్పుడు, వన్‌–వే వాల్వ్‌లు తెరుచుకుంటాయి, మూసుకుపోతాయి, రక్తం తిరిగి క్రిందికి లీక్‌ అవ్వకుండా నిరోధిస్తాయి. అయితే, ఈ కవాటాలు బలహీనమైనప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు, గురుత్వాకర్షణ శక్తి రక్తాన్ని వెనక్కి లాగుతుంది. 

దీనిని సిరల లోపం అంటారు. ఆ రక్తం వెనక్కి వచ్చి, సేకరించి, ఉబ్బినప్పుడు సిరలు వెరికోస్‌ వెయిన్స్‌గా మారతాయి. చాలా సేపు నిలబడటం  కూర్చోవడం వల్ల వెరికోస్‌ వెయిన్ ్స ప్రమాదం పెరుగుతుంది,అయితే కాలు మీద కాలు వేసుకోవడం  వల్ల ఈ ప్రభావం ఉంటుందని ఒక అభిప్రాయం ఉన్నప్పటికీ శాస్త్రీయంగా నిర్ధారించే ఆధారాలు లేవు.

భంగిమలో మార్పు...
కాలు మోకాలిపై ఎక్కువసేపు ఉంచడం వల్ల కటి తిప్పడానికి వంగడానికి కారణమవుతుంది. ఇది దిగువ వీపులో నొప్పిని కలిగిస్తుంది. ఇది కాలక్రమేణా  వెన్నెముక తప్పు అమరికకు  కూడా దారితీస్తుంది. కూర్చోవడంలో సరైన భంగిమ లేనప్పుడు, ఆ పరిస్థితిని కండరాలు సరి చేయవలసి వస్తుంది. 

దీని అర్థం అవి అవసరమైన దానికంటే ఎక్కువగా పనిచేస్తాయి, ఇది నొప్పికి దారితీస్తుంది. అయితే కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం అనేది పూర్తిగా మానేయాలని దీని అర్థం కాదు. కొన్ని సమస్యలైతే ఉన్నాయి.. కాబట్టి వీలైనంత వరకూ ఎక్కువసేపు అదే భంగిమలో కూర్చోవడాన్ని నివారించడం మంచిది.

(చదవండి: భారతీయుల వివాహ వేడుకను చూసి..కొరియన్‌ కోడియా ఫిదా!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement