మన దేశానికి వచ్చిన విదేశీయులను మన వివాహ వేడుకలు ఆశ్చర్యానందాలలో ముంచెత్తుతాయి అనడంలో సందేహం లేదు. దీనికి తాజా ఉదాహరణ జేక్ కోడియా అనే కొరియన్. గురుగ్రామ్‌లోని కాస్మెటిక్ రిసెర్చ్ కంపెనీలో పనిచేస్తున్న కోడియా తొలిసారిగా ఒక భారతీయ వివాహ వేడుకకు హాజరయ్యాడు.
ఆ వేడుకలోని వైభోగం, అతిథి మర్యాదలలోని ఆత్మీయతను చూసి అతడికి వేరే లోకంలోకి వచ్చినట్లు అనిపించింది. విందులోని రుచుల సంగతి సరే సరి. పానీపూరి అతడికి తెగ నచ్చేసింది. వధువు ఎంట్రీ నుంచి పెళ్లి పూర్తయ్యే వరకు ప్రతి కార్యక్రమంలోనూ ఉత్సాహంగా పాల్గొన్నాడు. పెళ్లివారితో కలిసి డ్యాన్స్ చేశాడు.
‘కొరియన్ విజిట్స్ ఇండియన్ వెడ్డింగ్స్’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో నెటిజనుల మనసును హోల్‌సేల్‌గా దోచేసుకుంది. ఒక ఫారినీయుడు ఇలా స్పందించాడు... ‘తాజ్‌మహల్ చూడడానికి ఇండియాకు వెళ్లాలనుకునేవాడిని. ఇప్పుడు పెళ్లి వేడుకలు చూడడానికే ఇండియాకు వెళ్లాలనిపిస్తోంది’.
(చదవండి: ఎక్కడైనా సీక్రెట్ కెమెరా దాగి ఉంటే ఇలా పట్టేయండి..!)


