మంగళూరు: ఫ్రిడ్జ్, ఏసీ, ఆపిల్ ఐఫోన్, ల్యాప్‌టాప్, కారు, బైక్, వాషింగ్ మెషీన్, ఫర్నీచర్.. ఇలా నిత్యావసర ఎలక్ట్రానిక్ వస్తువులను ఈకాలంలో చాలా మంది ఈఎంఐ పద్ధతిలోనే తీసుకుంటున్నారు. వాటి ఈఎంఐ గడువు తీరేలోపే వాటికి రిపేర్లు రావడమో, పాడవడమో, ఎవరో కొట్టేయడమో జరిగితే ఆ బాధ వర్ణణాతీతం. ఆ బాధ పడొద్దనే ఉద్దేశంతో ఓ కారు యజమాని వినూత్న రీతిలో ఆలోచించారు.
రోడ్లపై సర్రున దూసుకుపోయే వాహనదారుల్లో ఎవరైనా తన కారును ఢీకొడితే రిపేర్ల ఖర్చుల కోసం జేబుకు చిల్లు పడటం ఖాయమని భావించాడు. అనుకున్నదే తడవుగా కారుకు వెనకాల కొత్త తరహాలో బంపర్ స్టిక్కర్‌గా వినూత్న క్యాప్షన్ రాసి వెనకాల వచ్చే వాహనదారులందర్నీ ఆలోచనల్లో పడేశాడు. ‘‘నా కారును పొరపాటున ఢీకొట్టకండి. అసలే ఇది ఈఎంఐలో కొన్నా. అదింకా పూర్తవలేదు’’ అనే అర్థం వచ్చేలా ఒక క్యాప్షన్ రాశారు.
ఇది చూసి ‘కారు కష్టాలు’ అని కొందరు సానుభూతి వ్యక్తపరిస్తే మరికొందరేమో అతని సృజనాత్మకతను మెచ్చుకుంటూ సరదాగా నవ్వుకుంటూ తమ దారిలో వెళ్లిపోతున్నారు. ఇతనిలో ఎంతో హాస్యచతురత ఉందని లోలోపల పొగుడుతూనే మరోవైపు అతని నిజాయతీకి, విజ్ఞాపనకు ఫిదా అయిపోతున్నారు.
కర్ణాటకలోని మంగళూరులో సర్క్యూట్ హౌస్ రోడ్డులో వెళ్తున్న ఒక తెలుపురంగు మారుతి సుజుకీ ఆల్టో కారుకు (Alto Car) సంబంధించిన వీడియోను ఒక వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా ఇప్పటికే ఏకంగా 5.4 కోట్ల మంది ఈ వీడియోను ఆన్‌లైన్‌లో చూడడం విశేషం. 33.41 లక్షలకుపైగా లైక్‌లు వచ్చాయి. వేలాది మంది తమకు నచ్చిన రీతిలో స్పందిస్తున్నారు.
ఎంత కష్టపడి కొనుకున్నాడో..
‘‘కారు యజమాని తాను చెప్పదల్చుకున్న విషయాన్ని అత్యంత వైవిధ్యభరింతగా చెప్పారు’ అని ఒక నెటిజన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ‘‘ఈఎంఐ (EMI) అనేది సగటు భారతీయుని జీవితంలో ఒక భాగమైపోయిందనడానికి ఇదొక చక్కటి ఉదాహరణ’ అని ఒకరు వ్యాఖ్యానించారు. ‘‘ఎంత కష్టపడి కొనుకున్నాడో. అందుకే కారంటే అతనికి అంత ప్రేమ’’ అని మరొకరు పోస్ట్ చేశారు.
చదవండి: ఆ కార్ల ఖరీదు 7 కోట్లు.. డెకరేషన్‌కు 5 కోట్లు!
అతిగొప్ప నినాదం ఇదే..
‘‘ఈఎంఐ మంజూరుచేసిన బ్యాంక్‌కు ఇతను అసలు సిసలు నిఖార్సయిన కస్టమర్’ అని మరో నెటిజన్ (Netizen) వ్యాఖ్యానించారు. ‘‘గుంతల రోడ్డుపై వాయుకాలుష్యంలో కొట్టుకుపోతున్న నాకు ఎదురుగా ఈ క్యాప్షన్ ఎండాకాలంలో చల్లటి మజ్జిగలా హాయినిచ్చింది’’ అని ఇంకొకరు పోస్ట్‌చేశారు. ‘‘ఎన్నో బాధ్యతలున్న సగటు జీవి కారు ఇది’’, ‘‘కార్లపై చూసిన అతిగొప్ప నినాదం ఇదే’’, ‘‘మోదం, ఖేదం కలబోత ఈ క్యాప్షన్’’ అంటూ ఎవరికి నచ్చినట్లు వాళ్లు పోస్ట్‌లుపెట్టారు.


