ఏ మూలన ఏ కెమెరా దాగి ఉన్నదో...ప్రయాణం అన్నాక హోటళ్లలో బస చేయడం సాధారణం. అయితే మన ప్రైవసికీ సంబంధించి హోటల్ గదులు ఎంత వరకు క్షేమం అనే డౌటు చాలామందికి వస్తుంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి...
హిడెన్ కెమెరాలు సాధారణంగా లైట్ పిక్చర్‌లు, డ్రెస్సింగ్ మిర్రర్స్, స్మోక్ డిటెక్చర్స్, టీవీ యూనిట్లు, ఫోటో ఫ్రేమ్‌ల వెనుక, తక్కువగా కనిపించే ప్రదేశాలో అమర్చబడి ఉంటాయి. గదిలోని ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, వస్తువులను జాగ్రత్తగా పరిశీలించాలి. ఏదైనా అసాధారణంగా లేదా అనుమానాస్పదంగా అనిపిస్తే దగ్గరకు వెళ్లి పరిశీలించాలి.
స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్‌లైట్ లేదా టార్చ్ ఆ ప్రదేశంపై వేసి చూడాలి. చిరు కాంతి, రెఫ్లెక్షన్‌లాంటిది కనిపిస్తే అవి కెమెరా లెన్స్ కావచ్చు. రహస్య కెమెరాలలో చాలావాటిలో ఇన్‌ఫ్రారెడ్ లైట్‌ను ఉపయోగిస్తారు. దీన్ని గుర్తించడానికి గదిలోని అన్ని లైట్లను ఆపివేసి, స్మార్ట్‌ఫోన్ కెమెరా ఆన్ చేసి కెమెరా ఉందని అనుమానం ఉన్న చోట ఫోకస్ చేయాలి.
స్క్రీన్‌పై ఎరుపు లేదా ఉదారంగు కనిపిస్తే హిడెన్ కెమెరాకు అది సంకేతం కావచ్చు. హిడెన్ కెమెరాలను గుర్తించడానికి వైఫైని కూడా ఉపయోగించవచ్చు. మొబైల్ వైఫై ఆన్‌చేసి నెట్‌వర్క్ లిస్ట్ తనిఖీ చేయాలి. నెట్‌వర్క్‌లో కామ్, డివైజ్ డబుల్ ఎక్స్, ఐపీకామ్‌లాంటి పేర్లు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి. రూమ్‌లో వైర్‌లెస్ కెమెరా ఉండే ప్రమాదం ఉంది.
(చదవండి: ఆందోళన నుంచి వచ్చింది ఒక ఐడియా!)


