హెడ్‌ఫోన్ ధరించడం కొందరికి ఫ్యాషన్ అయితే మరికొందరు ఏకాగ్రత, పనితీరు కోసం ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా చుట్టూ గందరగోళంగా ఉంటే..ఈ హెడ్‌ఫోన్‌లు ఎంతో హెల్ప్ అవుతాయి. అదీగాక సౌకర్యవంతమైన స్థాయిలో వాల్యూమ్‌ని ఎడ్జెస్ట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. అయితే అవే హెడ్‌ఫోన్‌లు సుదీర్ఘకాలం లేదా గంటల తరబడి ఉపయోగిస్తే..చాలా ఆరోగ్య సమస్యలు ఫేస్ చేయక తప్పదని హెచ్చరిస్తున్నారు ..ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ జ్యోతిర్మయి హెగ్డే. మరి అవేంటో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.
వినికిడి నష్టం (NIHL)
అధిక వాల్యూమ్‌లో ఎక్కువ సేపు హెడ్‌ఫోన్స్ పెట్టుకుని వింటే వినికిడి సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువవుతుంది పరిశోధనలు చెబుతున్నాయి. గంటల తరబడి వినయోగించకపోవటమే మేలని చెబుతున్నారు.
టిన్నిటస్
ఇలా ఎక్కువసేపు హెడ్‌ఫోన్ ఉపయోగించడం వల్ల చెవులో వింత వింత శబ్దాలు వినిపించే టిన్నిటిస్ లక్షణాలు ఎదుర్కొనాల్సి వస్తుందట.
అలసటకు గురవ్వడం
ఎక్కువసేపు హెడ్‌ఫోన్ ఉపయోగించడం వల్ల చెవి, మెదడు అలసటకు గురై..దృష్టి కేంద్రీకరించడం, లేదా ప్రసంగించడంలో సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందట. ఇది వైద్య పరమైన రుగ్మత కానప్పటికీ..ప్రభావం మాత్రం తారాస్థాయిలో ఉంటుందంటున్నారు.
మిగతా శబ్దాలపై అవగాహన లోపం..
అదేపనిగా హెడ్‌ఫోన్స్ ఉపయోగించటం వల్ల ఆ శబ్దాలకే అలవాటుపడి చుట్టుపక్కల పరిసరాల శబ్దాలను గ్రహించలేని పరిస్థితి ఎదురవ్వుతుందని ఆడియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.
మతిమరుపు వచ్చే అవకాశం
అతిగా ఇయర్ ఫోన్స్ ఉపయోగించే వారిలో శ్రద్ధ లోపించి..జ్ఞాపకశక్తిని కోల్పోయే ప్రమాదం ఉందని పలు అధ్యయనాల్లో తేలిందని హెచ్చరిస్తున్నారు.
సురక్షితంగా ఎలా ఉపయోగించాలంటే..
ఇయర్ ఫోన్‌ని సురక్షితమైన పద్ధతిలో వాడుకుంటూ..వినికిడి, జ్ఞాపకశక్తిని కోల్పోయే సమస్యల బారిన పడకూడదంటే ఈ సింపుల్ చిట్కాలు అనుసరిస్తే చాలట.
తక్కువ వాల్యూమ్‌తో వినడం.
తప్పనిసరి అయితే తప్ప.. హెడ్‌ఫోన్ వినియోగాన్ని పరిమితంగా ఉపయోగించేలా చూడటం.
సరైన హెడ్‌ఫోన్స్‌ని ఉపయోగించి..వాల్యూమ్ నేరుగా చెవిలోకి చొచ్చుకుపోనివ్వని సురక్షితమైనవి వాడటం మేలు
అంతేగాదు వినికిడి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో లేదో గమనించుకోవడం
చివరగా ఏ వస్తువైనా సరైన మార్గంలో పరిమితంగా వినియోగిస్తే ఎలాంటి సమస్యలు దరిచేరవు..పైగా మంచి ఆరోగ్యవంతమైన జీవితాన్ని బేషుగ్గా లీడ్ చేయగలుగుతామని చెబుతున్నారు ఈఎన్టీ నిపుణులు డాక్టర్ జ్యోతిర్మయి.
--డాక్టర్ జ్యోతిర్మయ్ ఎస్ హెగ్డే, ఈఎన్‌టి స్పెషలిస్ట్, ఆస్టర్ వైట్‌ఫీల్డ్ ఆస్పత్రి
(చదవండి: Travel Trends 2026: కొత్త ఏడాది టాప్-10 ప్రదేశాలు ఏవంటే..?)


