సర్వ మానవాళికి శుభ సందేశం క్రిస్మస్‌ | Christmas 2025: History of Jesus Christ | Sakshi
Sakshi News home page

సర్వ మానవాళికి శుభ సందేశం క్రిస్మస్‌

Dec 25 2025 12:46 AM | Updated on Dec 25 2025 12:46 AM

Christmas 2025: History of Jesus Christ

ఆత్మస్వరూపుడు శరీరధారిగా ఏతెంచిన రోజు

సర్వమానవాళికీ గొప్ప శుభదినం

శుభవార్త ప్రకటించిన దేవుని దూతలు

మానవులతో దేవుడు తిరిగి మమేకమైన రోజు 

పాఠకులకు క్రిస్మస్‌శుభాకాంక్షలు 

దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. అందుకనే తొలి మానవుడిని తన స్వరూపంలో తన పోలిక చొప్పున నేలమంటితో నిర్మించాడు. తొలి భార్య భర్తలైన హవ్వ ఆదాములతో అందమైన ఏదెను తోట ఏర్పాటు చేసి స్నేహితునిలా కొనసాగాడు. అయితే దుష్టుడైన సాతాను ప్రభావంతో వారు దేవుని ఆజ్ఞ మీరారు. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం వలన వచ్చే జీతం మరణం. ఫలితంగా మానవులకు మరణం సం్రపాప్తమైంది. భూమి శపింపబడింది. భూమిపై మానవ మనుగడ కష్టతరంగా మారింది.

అయితే తాను సృష్టించిన మానవుడిని మాత్రం దేవుడు ఎప్పుడూ విడిచి పెట్టలేదు. భూమిపై అక్రమం, స్వార్థం, హింస పెరిగిన తరుణంలో మానవులను రక్షించేందుకు నాయకులను, న్యాయాధిపతులను, రాజులను, ప్రవక్తలను ఏర్పాటు చేసినా మానవుని స్వభావంలో ఎటువంటి మార్పు లేకుండా పోయింది. పాపానికి నరుడు బానిసగా మారిపోయాడు. 

మోసకరమైన హృదయంతో చీకటితో నిండిన జగతిలో నరకానికి వారసుడయ్యాడు. నరక పాత్రుడైన మానవుడ్ని రక్షించి నిత్య జీవం ఇచ్చేందుకు తిరిగి దేవునితో అనుసంధానం చేసేందుకు పరలోక దేవుడే నరరూపధారుడై రెండు వేల సంవత్సరాల క్రితం దివి నుంచి ఈ భువిపైకి వచ్చేందుకు సిద్ధ పడ్డాడు. మానవుల పట్ల దేవుని అపారమైన ప్రేమకు గొప్ప తార్కాణమే క్రిస్మస్‌.

క్రీస్తు జననం 
సర్వాధికారియైన దేవాది దేవుని జననం ఎంతో ఆశ్చర్యం, ఆనందం, అద్భుతం. జగముల నేలే రారాజు అతి సామాన్యుడిగా, దీనుడుగా ఈ ధరిత్రిపై అరుదెంచాడు. అందుకు యూదా దేశంలోని బేత్లెహేము వేదికైంది. ఆ కాలంలో యూదా ప్రాంతం అంతా రోమా చక్రవర్తి కైసరు ఔగుప్తు ఏలుబడిలో ఉంది. హేరోదు యూదా ప్రాంతానికి అధినేతగా యూదుల రాజుగా కొనసాగుతున్నాడు. 

గలిలయ ప్రాంతంలో అతి సామాన్య కుటుంబంలో పుట్టి నజరేతు వాడైన యోసేపుకు ప్రదానం చేయబడిన పరిశుద్ధురాలైన కన్యక మరియ గర్భంలో జన్మించడానికి సిద్ధమయ్యాడు. క్రీస్తు జననం శుభవార్త దేవుని ప్రధాన దూతయైన గబ్రియేలు ముందుగా మరియకు తెలియచేశాడు. దయా్రపాప్తురాలా అంటూ శుభ వచనం పలికి దేవుని కృప పొందిన నీవు పురుష సంయోగం లేకుండా కన్యకగానే గర్భము ధరించి ఓ కుమారునికి జన్మనిస్తావు. ఆయనకు యేసు అని పేరు పెడతావు అతడు సర్వోన్నత దేవుని కుమారుడనబడతాడు అని దేవునిదూత చెప్పడంతో నవ యవ్వనంలో ఉన్న మరియ ఎంతో భయపడింది. 

ఇది ఎలా సాధ్యం అంటున్న తరుణంలో ‘మరియా భయపడకు ఇది కేవలం దేవుని పరిశుద్ధాత్మ శక్తితోనే జరుగుతుంది.  సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరిస్తుంది, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడతాడు...’ అన్న దూత పలుకులను మరియ వినయంగా స్వీకరించింది. మరియ తన ప్రమేయం లేకుండా గర్భవతి అయిందని తెలిసిన యేసేపు ఆమెను రహస్యంగా వదిలివేయాలని భావిస్తాడు. 

ఎందుకంటే ఆ రోజుల్లో వివాహం కాకుండా ఏ స్త్రీ అయినా గర్భవతి అయితే బహిరంగంగా రాళ్ళతో కొట్టి చంపడం యూదుల ఆచారం. అదే సమయంలో ఈ శుభ వర్తమానం దూత ద్వారా యోసేపుకు చేరుతుంది. యేసేపూ భయపడవద్దు మరియను చేర్చుకొనుటకు సందేహింప వద్దు. పరిశుద్ధాత్మ వలన ఈ కార్యం జరుగుతుంది. ఆమె కుమారునికి యేసు అని పేరుపెట్టాలి ఎందుకంటే తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షిస్తాడు. క్రీస్తు పుట్టుకకు వందల సంవత్సరాలకు ముందే యెషయా, మీకా లాంటి ప్రవక్తల ద్వారా చేసిన ప్రవచనాల నెరవేర్పు జరిగింది. 

మరియ సుతుడికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడుతుంది దానికి అర్థం ‘దేవుడు మనకు తోడు’. యెషయా క్రీస్తు జననాన్ని ప్రవచిస్తూ ‘ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింప బడెను, ఆయన భుజము మీద రాజ్య భారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని పేర్కొన్నాడు. క్రీస్తుకు ముందుగా నడవడానికి వృద్ధ దంపతులైన జెకర్యా, ఎలీసబెతులకు కుమారుడిగా బాప్తీస్మమిచ్చు యోహాను అనుగ్రహించ బడ్డాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఎటువంటి పాపము చేయకుండా పరిశుద్ధత కలవారినే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.

చరిత్ర సాక్షిగా..
మానవ చరిత్రలో యేసు నమోదు చేయబడ్డాడు. సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయాలని రోమా చక్రవర్తి కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ వచ్చింది. యోసేపు దావీదు వంశములో పుట్టిన వాడు గనుక తనకు ప్రదానం చేయబడిన నిండు చూలాలైన మరియను తీసుకొని గలలియలోని నజరేతు నుండి యూదాలోని బేత్లెహేముకు బయలు దేరాడు. ఎంతో ప్రయాసతో కూడిన ప్రయాణం ముగించుకొని బేత్లెహేము గ్రామం చేరుకున్నారు. 

అప్పటికే జనాభా సంఖ్యలో రాయబడటానికి వచ్చిన ప్రజలతో బేత్లెహేము గ్రామం క్రిక్కిరిసి పోయింది. ఓ సత్రపు యజమాని దయతలచి తన పశువుల కొట్టంలో ఉండటానికి వీరికి చోటిచ్చాడు. ప్రసవ దినములు నిండటంతో మరియ శిశువును కని పొత్తి గుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండ బెట్టింది. అవని అంతా ఆయనదే అయినా స్థలం లేక రాజుల రాజుకు చివరకు  పశువుల తొట్టె పవళించే పాన్పుగా మారిపోయింది. మనలను ధనవంతులుగా చేసేందుకు ఆయన దరిద్రుడాయేను అన్న లేఖనాల నెరవేర్పు నిజమైంది.

దివిలో భువిలో సంబరాలు
యేసు జన్మించిన వెంటనే అటు పరలోకంలోనూ ఇటు ధాత్రిలోనూ సంబరాలు మొదలయ్యాయి. ముందుగా పొలంలో గొర్రెలు కాసుకుంటున్న గొర్రెల కాపరుల వద్దకు ప్రభువు దూత శుభవర్తమానం వెళ్ళింది. ఆ దూత ద్వారా కలిగిన ప్రకాశమైన వెలుగును చూసి వారు భయపడగా దూత భయపడ వద్దని చెప్పి ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము తెచ్చానని ‘దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడని ఆయనే ప్రభువైన క్రీస్తు’ అని ప్రకటించడం జరిగింది. అనంతరం పరలోకం నుంచి దూతల మహా సైన్యసమూహము ‘సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగును గాక‘ అంటూ స్తోత్ర గీతాలతో దేవుని మహిమ పరచారు. గొర్రెల కాపరులు వెళ్ళి పశువుల తొట్టిలో పండుకున్న శిశువును చూచి ఎంతో సంబరపడి శిశువును గూర్చి తాము చూసిన సంగతులన్నీ ఊరంతా ప్రచారం చేశారు. 

యేసు జననం సందర్భంగా ఆకాశంలో ఒక అరుదైన నక్షత్రం వెలసింది. అది చూసిన తూర్పుదేశపు జ్ఞానులు ముగ్గురు తారను వెంబడించి ముందుగా యెరూషలేము చేరుకొని హేరోదు రాజును కలిసి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అడిగి తెలుసుకొని బేత్లెహేము చేరుకొని బాల యేసును చూసి అత్యానందభరితులై సాగిలపడి పూజించి తాము తెచ్చిన బంగారము, సాంబ్రాణి, భోళము ప్రభువుకు కానుకగా సమర్పించారు. అలా క్రీస్తు జననం దివిని భువిని ఏకం చేసింది. దేవుడితో మరల మానవుడు పోగొట్టుకున్న సమాధానం కల్పించింది. అందుకే క్రిస్మస్‌ సర్వ లోక వేడుకగా మారిపోయింది. సామాన్యులకు, జ్ఞానులకు ఒకే పీట వేసింది. అప్పటినుంచే ప్రపంచ చరిత్ర రెండుగా విభజింపబడింది. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకంగా పిలువబడింది.

క్రిస్మస్‌ అంటే ఆరాధన
క్రిస్మస్‌ అంటే దేవుని నిండు మనసుతో ఆరాధించడం. మనకోసం పరలోక భాగ్యాన్ని వదులుకొని పవిత్రులుగా, పరిశుద్ధులుగా ఎలా జీవించాలో ఆచరణాత్మకంగా చూపించిన ఆ ప్రభువును వేనోళ్ళ స్తుతించడమే నిజమైన క్రిస్మస్‌. ఆరాధన అంటే అల్లరితో కూడిన ఆట, పాటలు కాదు అంబరాన్ని అంటే సంబరాలు జరపడం కాదు, విందులు వినోదాల్లో తెలియాడటం కాదు, హంగు ఆర్భాటం ఆడంబరాల్లో మునిగితేలడం కాదు.. దేవుని ఆరాధించు వారు ఆత్మతోను సత్యంతోనూ ఆరాధించాలి. క్రీస్తును హృదయం లో కలిగి ఉండటమే క్రిస్మస్‌. అదే క్రీస్తుకు కావాల్సిన ఆరాధన.

 నశించి పోయే ఆత్మలకు నిత్యజీవము వర ప్రసాదంగా అందించాడు. నీతివంతమైన జీవితం, మారుమనస్సు, రక్షణ ద్వారా ఇది సాధ్యం అని చె΄్పాడు అంతేకాదు ఈ లోకాన్ని జయించడానికి కావలసిన ప్రేమ, కరుణ, జాలి, దయ, శాంతం, సహనం, తగ్గింపు, వినయం, ఓర్పు ఎలా కలిగి వుండాలో తన జీవితం ద్వారా నేర్పించాడు. అన్నిటికీ మించి చీకటిలో బతుకుల్లో గొప్ప వెలుగు నింపేందుకు యేసు ఈ లోకానికి వచ్చాడు. నేను లోకమునకు వెలుగునైయున్నాను అని ప్రకటించాడు. ఆయనతో నడిచే వారు జీవపు వెలుగు కలిగి ఉంటారు. ఈ క్రిస్మస్‌ శుభవేళ మనందరం క్రీస్తు స్వారూప్యంలోకి మారాలన్నది ఆ కరుణామయుని అభిలాష. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక! ఆమేన్‌ !!!
మీ అందరికీ క్రిస్మస్‌ పర్వదిన శుభాకాంక్షలు.

దేవుడే ఎందుకు దిగి వచ్చాడు?
క్రీస్తు రాకకు ప్రధాన కారణం పాపులను రక్షించుటకే. తొలి మానవుడు ఆదాము ద్వారా వచ్చిన పాపపు బీజం తీసివేయడానికి తన పరిశుద్ధ రక్తం ద్వారా సిలువపై బలిదానం ద్వారా ధరవాసులందరికి పాప విమోచన కోసం మనుషుల మధ్య నివసించేందుకు సర్వాధికారియైన దేవుడు శరీరధారి అయ్యాడు. అంతేకాదు యేసు ప్రభు ప్రజలందరికీ రక్షణ సువార్త అందించడం, పాపపు చెరలో వున్న వారికి విడుదల, అంధకారమైన జీవితాల్లో వెలుగు నింపడం, బాధల్లో నలిగి పోయినవారికి ఓదార్పు విడుదల ఇచ్చేందుకే నేను వచ్చానని ప్రకటించాడు.
– స్టెర్జి రాజన్‌ బందెల 
సీనియర్‌ పాత్రికేయులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement