తల్లో పేలు గురించి విన్నాం కానీ, కనురెప్పల్లో పేలు ఉండటం గురించి వినలేదు కదా..!. కనురెప్పల్లో చుండ్రు ఉంటుందని తెలుసగానీ ఇదేంటీ..పేలు ఉండటం అని విస్తుపోకండి. ఎందుకంటే..నిజంగానే ఓ మహిళ కంట్లో ఏకంగా 250 పేలను గుర్తించారు వైద్యులు. తొలుత వైద్యులు సైతం ఆశ్యర్యపోయారు. ఆ తర్వాత ఈ వ్యాధి గురించి క్షుణ్ణంగా తెలుసుకుని మరి చికిత్స అందించి ఆమెకు చక్కటి ఉపశమనం అందించారు. అసలేంటి ఈ సమస్య? ఎందుకు వస్తుంది వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా..!
గుజరాత్‌లోని ఆమ్రేలి జిల్లా సావర్ కుండ్ల ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 66 ఏల్ల గీతాబెన్ కంటిలో తీవ్రమైన దురద, నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చింది. సూరత్‌కు చెందిన గీతాబెన్‌కు ఈ సమస్య గత రెండున్నర నెలలుగా వేధిస్తోంది. కళ్లు ఎర్రబారిపోవడం, సరిగా నిద్రపట్టకపోవడం వంటి సమస్యలతో సతమతమైంది. దీంతో కంటి డాక్టర్ మృగాంక్ పటేల్ ఆమె కళ్లను పరీక్షించగా.. రెప్పల్లో ఏకంగా పేలు ఉన్నట్లు గుర్తించారు.
మొదట ఆయన కూడా ఇదేంటని విస్తుపోయారు. ఆ తర్వాత వివిధ అధ్యయన పత్రాలను శోధించి.. ఇలాంటి వింత కేసు గురించి తెలుసుకున్నట్లు తెలిపారు. దీన్ని వైద్య పరిభాషలో ఫిరాయసిస్ పాల్పిబ్రారమ్ అంటారని చెప్పారు. తాము మాగ్నిఫికేషన్ కింద కనురెప్పల్ని పరిశీలించినప్పుడు, పేలు కదులుతున్నట్లు గుర్తించామని అన్నారు. వాటి తోపాటు గుండ్రని పేను గుడ్లను కూడా కనిపించాయని వెల్లడించారు. వీటిని తొలగించాలంటే చాలా సమయం పడుతుందని ముందుగానే బాధిత మహిళకు తెలియజేసి మరి ఆపరేషన్‌కి సిద్ధం చేశారామెను.
అయితే ఆమెకున్నవైద్య పరిస్థితుల రీత్యా ఎలాంటి ఇంజెక్షన్లు ఇవ్వకుండా ఒక్కొక్కపేనుని ఓపికగా తొలగించారు వైద్యులు. ఈ పరాన్న జీవి కంటి రెప్ప మూయగానే అమాంతం రక్తం తాగేస్తుందట. ఎందుకంటే అక్కడ కణజాలాం చాలా పల్చగా ఉండి, సులభంగా రక్తాన్ని పీల్చేయగలదని అన్నారు. పైగా అక్కడ కనురెప్పలకు అతుక్కుపోయి ఉంటాయట. దీని కారణంగా పేషెంట్‌కి దురద, మంట వస్తుందట. అదీగాక ఇవి తొలగించాలనుకున్నా..అంత తేలిగ్గా రావట కూడా.
ప్రత్యేక పరికరంతో తొలగింపు ప్రక్రియ..
ఈ పేలు వెలుతురు పడినప్పుడూ కదులుతుంటాయట. కాబట్టి వాటిని తొలగించడానికి మెక్‌ఫర్సన్ అనే ప్రత్యేక పరికరం ఉపయోగించి ప్రతీ పేనుని పట్టుకుని బయటకు తీసినట్లు వివరించారు. అలాగే ఆ మహిళకు నొప్పి తెలియకుండా అనస్థీషియా ఇచ్చాం అని వైద్యుడు మృగాంక్ వెల్లడించారు.
తన 21 ఏళ్ల అనుభవంలో ఇలాంటి కేసు మొట్టమొదటిదని, అస్సలు ఎప్పుడూ ఇలాంటి కేసు ఎదురవ్వలేదని అన్నారు. బాధిత మహిళ కంటి రెప్పల్లోంచి ఏకంగా 250 పేలు, 85 గుడ్లు(లార్వా)లు తొలగించినట్లు తెలిపారు.
ఫిరాయసిస్ పాల్పిబ్రారమ్ అంటే..
యుఎస్ నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఫిరాయసిస్ పాల్పిబ్రారమ్ అనేది అరుదైన వైద్య పరిస్థితి. దీనివల్ల పేలు, వాటి గుడ్లు కనురెప్పలలో చేరుతాయి. దాంతో తీవ్రమైన దురద, కళ్లు ఎర్రబారడం, నిద్రలేమి వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయట. అయితే ఇది సాధారణ కంటి ఇన్ఫెక్షన్‌కానందున నిర్థారించడం కష్టమని అన్నారు. వీటి లార్వాలు అచ్చం దోమ లార్వాలనే ఉంటాయని చెప్పారు.
ఈ పరిస్థితి ఎందుకొస్తుందంటే..
ఇన్‌ఫెక్షన్ కారణంగా లేదా పరిశుభ్రత లోపించినప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుందని చెబుతున్నారు వైద్యులు. పేలు రావడానికి కొన్ని రకాల వాతావరణాలు, ఇంట్లోని దిండ్లు కారణం కావొచ్చని అన్నారు. ఈ వ్యాధి మనుషులతోపాటు పశువుల్లో కూడా కనిపిస్తుందని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా అడవుల్లో తిరిగే వాళ్లకు, పశువులకు దగ్గరగా ఉండేవాళ్లకు ఇవి వెంటనే అటాక్ అవుతాయట.
వెంటనే కనురెప్పలకు చేరి అక్కడ తిష్టవేస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఇవి కాంతి పడినప్పుడూ పారిపోతాయి కాబట్టి లైట్ లేకుండా తొలగించాలని చెబుతున్నారు వైద్యులు. పైగా ఈ పరాన్నజీవి లార్వాలను ఏ ఔషధం చంపలేదని అన్నారు. వాటిని ఒక్కొక్కటిగా పట్టుకుని కంటి నుంచి తొలగించడం ఒక్కటే మార్గం అని అన్నారు.
'తలలో ఉండే పేలు కంటి పేలు భిన్నంగా ఉంటాయి. కంటి పేలు, కంట్లోని తెల్లటి భాగంలో తిరుగుతూ వెలుతురు నుంచి పారిపోతాయి. అవి కంటి రెప్ప లోపల, చీకటిగా ఉండే భాగంలో జీవిస్తాయి. అక్కడే ఉంటాయి' అని చెప్పుకొచ్చారు డాక్టర్ మృగాంక్.
లక్షణాలు
కంటి నొప్పి, కళ్ళలో ఎప్పుడూ దురద, నిద్రలేమి
కనురెప్పల వాపు, నీరు కారడం వంటివి
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యమని సూచించారు. చేతులను క్రమం తప్పకుండా శుభ్రంగా కడుక్కోవాలని అన్నారు. పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని, యువతలో ఈ పరిస్థితి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు.
(చదవండి: కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం... అమర్యాద...అనారోగ్యకరం కూడానా?)


