మీరు మధుమేహులా? రోజూ మాత్రలు లేదంటే ఇంజెక్షన్లు వేసుకుంటున్నారా. అయితే ఈ కథనం మీ కోసమే. మీలో కొన్ని విటమిన్, సూక్ష్మ పోషకాల లోపం ఉండవచ్చు. వాటిని సరిచేసుకుంటే రక్తంలో చక్కర మోతాదులు కూడా మెరుగు అవుతాయి అని బ్రిటిష్ మెడికల్ జర్నల్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతకీ ఏ విటమిన్లు తక్కువ ఉంటే గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది? వాటికీ మధుమేహానికి సంబంధం ఏమిటీ?
మన శరీరం ఒక సంక్లిష్ట యంత్రం అన్నది అందరికి తెలిసిన విషయమే. ఇది సక్రమంగా నడవాలంటే కనీసం 13 విటమిన్లు, మరెన్నో సూక్ష్మ పోషకాలు అవసరం. ఇవన్నీ మనం తినే ఆహారం ద్వారా లభించడం కష్టం. పైగా వయసు పెరిగే కొద్దీ తిన్న ఆహారం నుంచి విటమిన్లు, పోషకాలను శోషించుకోవడం కూడా కష్టం అవుతుంది. ఈ సమస్యకు మరికొన్ని కారణాలు కూడా చేరడం వల్ల మనం వ్యాధుల బారిన పడుతూంటాము. మధుమేహం విషయానికి వస్తే... ఈ వ్యాధి బారిన పడ్డ వారు ఆధికుల్లో విటమిన్ డి, బీ 12 లు తక్కువగా ఉంటాయి అని శాస్త్రవేత్తలు గుర్తించారు. కొంచెం కచ్చితంగా చెప్పాలంటే 60 శతం మధుమేహుల్లో విటమిన్ డి తక్కువగా ఉంటుంది. అలాగే 29 శతం మంది ఆంటే నలుగురిలో ఒకరికి ఉండాల్సినంత బీ 12 ఉండదని పరిశోధనలు చెబుతున్నాయి. అంతే కాదు. 42 శాతం మధుమేహుల్లో మెగ్నీషియం లోపం ఉంటె 28 శాతం మందిలో ఐరన్ తక్కువగా ఉంటోంది. క్రోమియం, జింక్ లు కూడా తక్కువగా ఉంటాయని గుర్తించారు. ఈ లోపాలను సరిదిద్దుకుంటే మధుమేహం కూడా కంట్రోల్ లూకి వచ్చే అవకాశం ఉంటుంది.

ఒక్కో దానిది ఒక్కో పాత్ర...
విటమిన్ డి, బీ 12, మెగ్నీషియం, ఐరన్, జింక్, క్రోమియం లు మధుమేహ నియంత్రణలో తమదైన పాత్ర పోషిస్తాయి. విటమిన్ డి విషయం తీసుకుందాం. ఇన్సులిన్ మెరుగ్గా పని చేసేందుకు, సరిగ్గా స్రవించేందుకు అవసరం. తక్కువ అయితే హెచ్ బీ 1ఏసీ ఎక్కువ అవుతుంది. నరాలు బాగా పని చేసేందుకు కావాల్సిన బీ 12 తక్కువ అయినా పరోక్షంగా మధుమేహాన్ని ప్రభావితం చేస్తుంది.
రెండు పద్ధతులు..
విటమిన్, పోషక లోపాలను సరిదిద్దుకునేందుకు రెండు పద్ధతులు ఉన్నాయి. మొదటిది.. ఆకుకూరలు, నట్స్ (వేరుశెనగలు, కాజు, బాదాం, పప్పులు వంటివి) గుమ్మడి, దోస లేదా ఇతర విత్తనాలు తీసుకోవడం. సహజ సిద్దమైన పద్దతి. కుదరదు, వయసు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ విటమిన్లు, పోషకాల మాత్రలు తీసుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఏ రకమైన మాత్రా అయినా సరే డాక్టర్ సలహా మేరకే తీసుకోవాలి. మధుమేహుల విషయంలో ఇది మరీ ముఖ్యం. అన్నింటి కంటే ముందు.. మీరు విటమిన్, పోషకాల లోపాలను గుర్తించేందుకు పరీక్షలు చేసుకోవాలి. లోపాలను గుర్తిస్తే వాటిని సప్లిమెంట్ల ద్వారా భర్తీ చేసుకుంటే మధుమేహం నియంత్రణలోకి వచ్చే అవకాశాలు మెరుగవుతాయి. వైద్యుల సలహా, సూచనల మేరకు ఒకసారి ప్రయత్నించి చూడండి.


