హైదరాబాద్: అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో 13వ అంతర్జాతీయ హెల్త్ డైలాగ్ (IHD–2026) ఈ నెల 30, 31 తేదీల్లో హెచ్‌ఐసీసీ–నోవోటెల్, హైదరాబాద్ వేదికగా జరగనుంది. ‘గ్లోబల్ వాయిసెస్.. వన్ విజన్’ అనే థీమ్‌తో నిర్వహించే ఈ సదస్సులో రోగి భద్రత, డిజిటల్ హెల్త్, ఆసుపత్రి నిర్వహణ, క్లినికల్ ఫలితాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి.
అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డా. సంగీతా రెడ్డి మాట్లాడుతూ, “ఏఐ, డేటా, డిజిటల్ టెక్నాలజీలను మానవీయత, సహకారంతో మేళవిస్తే భవిష్యత్తు ఆరోగ్య సంరక్షణ మరింత సమగ్రమవుతుంది. ఈ వేదిక గ్లోబల్ స్థాయిలో ఆలోచనలు, ఆవిష్కరణలను ఏకతాటిపైకి తీసుకువస్తుంది,” అన్నారు.
ఈ సదస్సులో నైజర్, పాపువా న్యూగినియా, కాంగో దేశాల ఆరోగ్య మంత్రులు సహా అంతర్జాతీయ నిపుణులు పాల్గొననుండగా, రెండో రోజు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ కూడా హాజరై ప్రసంగించనున్నారు.


