
అసోంకు తరలించిన పోలీసులు
14 రోజుల రిమాండ్‌కు పంపిన కోర్టు
చట్ట ప్రకారం దర్యాప్తు జరుపుతామన్న సిట్
సంతృప్తి వ్యక్తం చేసిన జుబీన్ భార్య గరిమా
గౌహతి: సింగపూర్‌లో సెప్టెంబర్ 19వ తేదీన అనుమానాస్పద స్థితిలో చనిపోయిన గాయకుడు జుబీన్ గార్గ్ ఉదంతంపై దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఘటనపై అసోం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం జుబీన్ మేనేజర్ సిద్ధార్థ శర్మ, నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ నిర్వాహకుడు శ్యాంకను మహంతాను బుధవారం ఉదయం ఢిల్లీలో అరెస్ట్ చేసింది. వీరిద్దరిపై నేరపూరిత కుట్ర, నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి జుబీన్ మరణానికి కారణమయ్యారన్న ఆరోప ణలపై కేసులు నమోదు చేసింది.
వీరిని వెంటనే గౌహతికి తరలించి కామ్‌రూప్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపర్చగా 14 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. దసరా సెలవులు కావడంతో జడ్జి ఇంటి వద్దే వీరిని హాజరు పర్చామని సిట్ చీఫ్ సీఐడీ స్పెషల్ డీజీపీ మున్నా ప్రసాద్ గుప్తా చెప్పారు. శర్మ, మహంతాలపై ఇప్పటికే ఇంటర్‌పోల్ ద్వారా లుకౌట్ నోటీసు జారీ అయ్యిందని, ఈ నెల 6వ తేదీలోగా వీరిని తమ ఎదుట హాజరు కావాలని కోరామని ఆయన తెలిపారు.
దీంతో, సింగపూర్ నుంచి మహంతా ఢిల్లీకి చేరుకోగానే ఎయిర్‌పోర్టు అధికారులు అదు పులోకి తీసుకుని సమాచారమిచ్చారన్నారు. గుప్తా జాడ కోసం ఢిల్లీ, రాజస్తాన్ పోలీసులను అప్రమత్తం చేశామని, చివరికి ఢిల్లీ–హరియాణా సరిహద్దుల్లో ఉండగా గుర్తించి, అరెస్ట్ చేశామన్నారు. ఇద్దరి మొబైల్ ఫోన్లతోపాటు, జుబీన్ ఫోన్‌ను కూడా వీరి నుంచి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కేసు విచారణ చట్ట ప్రకారం సాగుతుందని స్పష్టం చేశారు.
సీఐడీ కార్యాలయంలో కటకటాల వెనుక మహంతా, శర్మలు చేతులకు బేడీలతో ఉన్న ఫొటో లను సిట్ ఆన్‌లైన్‌లో షేర్ చేసింది. గౌహతి విమానాశ్రయం నుంచి జడ్జి ఇంటికి వీరిని తరలించే సమయంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాపిడ్ యాక్ష న్ ఫోర్స్ కూడా కాన్వాయ్‌ను అనుసరించింది. సింగపూర్‌లో జరిగిన నార్త్ ఈస్ట్ ఫెస్టివ ల్‌కు మహంతా మేనేజర్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి జుబీన్ హాజర య్యారు. అప్పుడే, సింగపూర్‌లో సముద్రంలో ఈత కొడుతూ అనుమానాస్పద స్థితిలో జుబీన్ గార్గ్ చనిపోయారు.
ఈ ఘటనపై దర్యాప్తు కోసం అసోం ప్రభుత్వం 10 మంది అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. తాజాగా మహంతాపై అసోం ప్రభుత్వం నిషేధం విధించింది. రాష్ట్రంలో ఎటువంటి ఉత్సవాలు, కార్యక్రమాలు నిర్వహించరాదని ఆదేశించింది. మహంతా, శర్మల అరెస్ట్‌పై జుబీన్ భార్య గరిమా సైకియా గర్గ్ సంతృప్తి వ్యక్తం చేశారు. జుబీన్ మరణానికి దారి తీసిన పరిస్థితులను తెలుసుకోవాలని తామంతా ఎదురు చూస్తున్నామన్నారు. ఈ మేరకు దర్యాప్తు సజావుగా సాగుతుందన్న విశ్వాసం గరిమా వ్యక్తం చేశారు.