
న్యూఢిల్లీ: కోవిడ్ సంక్షోభం, గల్వాన్ ఉద్రిక్తతలతో బీటువారిన చైనా, భారత్ బంధానికి భారతీయ విమానాలు మళ్లీ ఆకాశ మార్గాన స్నేహవారధి నిర్మించనున్నాయి. సుమారు ఇరుదేశాల మధ్య ఐదేళ్ల నుంచి ఆగిపోయిన భారత్, చైనా నేరుగా విమానసర్వీసులను అతి త్వరలో పునరుద్ధరించబడనున్నాయి. ఈ నెల చివరి నాటికి ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు పునరుద్ధరించే అవకాశం ఉంది. ఈ మేరకు భారత్-చైనాల మధ్య సానుకూల వాతావరణంలో చర్చలు కొనసాగుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎడాపెడా టారిఫ్‌ల మోత మోగించడంతో విసిగి పోయిన భారత్, చైనాలు మళ్లీ స్నేహగీతాన్ని ఆలపిస్తున్నాయి. అందులో భాగంగానే నేరుగా విమానసర్వీసుల పునర్‌ప్రారంభానికి శ్రీకారం చుట్టబోతున్నాయి.
గల్వాన్ నుంచి గట్టిబంధం దిశగా
2020 మేలో తూర్పు లద్దాఖ్‌లో ఇరు దేశాల సైనికుల మధ్య ఉద్రిక్తతకు బీజం పడింది. జూన్‌లో గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ముష్టిఘాతం, పిడిగుద్దులు, ఘర్షణ కారణంగా ఇరువైపులా జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో సరిహద్దు వెంట గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించి ఉద్రిక్తతలను మరింత పెంచారు. దీంతో భారత్, చైనా సత్సంబంధాలు అడుగంటాయి. పాస్‌పోర్ట్‌లు, దిగుమతులు, అనుమతులు మొదలు మరెన్నో రంగాల్లో సత్సంబంధానికి బీటలు పడ్డాయి.
అయితే ట్రంప్ ఇష్టారీతిన విధించిన దిగుమతి సుంకాల భారంతో ఇబ్బందులు పడుతున్న భారత్, చైనాలు ఉమ్మడిగా ఈ సమస్యను పరిష్కరించుకుందామని భావిస్తున్నాయి. ఇందుకోసం మళ్లీ స్నేహగీతం పాడక తప్పని నెలకొంది. గత కొద్దినెలలుగా ఇందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. చైనా జాతీయులకు పర్యాటక వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం గత నెలలో అంగీకారం తెలిపింది. దాదాపు ఏడేళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటనకు సిద్ధపడ్డారు.
చైనాతో బంధం బలపడాలని తాము కోరుకుంటున్నామని ఆదేశ పర్యటనను ఖరారుచేసి మోదీ సూచనప్రాయంగా చెప్పారు. భారత్ వంటి దేశాలపై టారిఫ్‌ను అమెరికా పెంచడాన్ని చైనా సైతం తీవ్రంగా పరోక్షంగా ఖండించింది. ఇలా నెమ్మదిగా బలపడుతున్న మైత్రీ బంధాన్ని నేరుగా విమానసర్వీసుల ద్వారా మరింత పటిష్టంచేయాలని భారత్ ఆశిస్తోంది. చివరిసారిగా మోదీ చైనాలో 2018 జూన్‌లో పర్యటించారు. ఆ తర్వాతి ఏడాది అక్టోబర్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించారు. ఇటీవల టియాన్‌జిన్‌లో జరిగిన 25వ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆయన పలు కీలక అంశాలపై చర్చించారు: అందులో ఇరు దేశా మధ్య విమాన సర్వీసుల పునరుద్ధరణ అంశం ఒకటి.