
సాక్షి, నెల్లూరు: నకిలీ మద్యం వ్యవహారంలో సీఎం చంద్రబాబు కుట్రలు వెలుగు చూస్తున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్థన్‌రావుతో ఒక వీడియోను కుట్రపూరితంగా తయారు చేయించి, జోగి రమేష్ పేరు చెప్పించడం ద్వారా వైఎస్సార్‌సీపీకి ఆ బురదను అంటించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో కీలకమైన నిందితుడు, టీడీపీ నేత జయచంద్రారెడ్డిని ఏపీకి తీసుకురావడంలో ఎందుకు ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. సీబీఐ విచారణకు ఎందుకు చంద్రబాబు భయపడుతున్నారని నిలదీశారు. ఇంకా ఆయనేమన్నారంటే..
డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే చంద్రబాబు ఒక పథకం ప్రకారం కుట్రలకు పాల్పడుతున్నారు. నకిలీ మద్యం విషయంలో చంద్రబాబు నీచమైన డ్రామాలకు పాల్పడుతున్నారనే దానిని ప్రజలు గమనిస్తున్నారు. నకిలీ మద్యం తయారీ ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. దీనికి కారకులైన తన పార్టీ వారిని కాపాడుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందే తప్ప, దీని మూలాలను దర్యాప్తు చేసి, దానిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా లేదు.
ప్రజల దృష్టిని మళ్ళించేందుకు నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పేరును తెరమీదికి తీసుకువచ్చారు. చంద్రబాబు ఇంటిపైన దాడి చేశారంటూ గతంలోనే జోగి రమేష్‌పై ఆయనకు అక్కసు ఉంది. ఎవరైతే గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారో, నేడు కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై గళం ఎత్తుతున్నారో వారిపైన దాడులు చేయించాలి, పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు పెట్టాలనే లక్ష్యంతోనే చంద్రబాబు పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం ప్రారంభించింది.
కూటమి ప్రభుత్వంలోనే ఈ దందా అని నిర్థారించిన ఎక్సైజ్ అధికారులు
నకిలీ మద్యం తయారీలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారు, చంద్రబాబు, లోకేష్‌లతో సన్నిహత సంబంధాలు ఉన్నవారే సూత్రదారులు అని బయటపడింది. సాక్షాత్తు తంబళ్ళపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరుఫున పోటీ చేసిన జయచంద్రారెడ్డి ప్రమేయం వెలుగుచూసింది. అయినా కూడా సిగ్గులేకుండా విషయాన్ని డైవర్ట్ చేయడానికి నకిలీ మద్యం మరకను వైఎస్సార్‌సీపీపై రుద్దడానికి చంద్రబాబు అండ్ కో ప్రయత్నిస్తోంది. నకిలీ మద్యం వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఈ నెల 3వ తేదీన ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ పరిశ్రమ బయటపడింది.
నకిలీ మద్యం, సీసాలు, లేబుళ్ళు వెలుగుచూశాయి. ఇబ్రహీంపట్నంలో వేల లీటర్ల మద్యంను నిల్వ చేసిన గోడవున్‌ను గుర్తించారు. ఈ దందా రెండుమూడు నెలలుగా జరుగుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చినట్లుగా ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషన్ చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. డిప్యూటీ కమిషన్ మూడు నెలలుగా జరుగుతున్నట్లు చెప్పారు.
రెండుమూడు నెలలుగా ఈ నకిలీ మద్యం దందా రెండుమూడు నెలల నుంచే జరుగుతోందని ఒకవైపు ప్రభుత్వ అధికారులు చెబుతుండటంతో ఇది కూటమి ప్రభుత్వం హయాంలోనే అనే విషయం ప్రజలకు తెలిసిపోతుందనే భయంతో ఈ నకిలీ మద్యం దందా రెండు మూడేళ్ల నుంచి జరుగుతోందంటూ వైఎస్సార్‌సీపీకి కూడా ఆ బురదను అంటించే కుట్రకు ఈ ప్రభుత్వం పాల్పడుతోంది. అందులో భాగంగా ఒక విషప్రచారాన్ని ప్రారంభించింది. ఇది మా ప్రభుత్వంలో జరిగిందే కాదు, గత ప్రభుత్వంలోనూ జరిగిందంటూ చెప్పేందుకు తంటాలు పడుతోంది.
జనార్థన్ వీడియో ద్వారా డైవర్షన్
అక్టోబర్ ఆరో తేదీన జనార్థన్‌రావు విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ 'నకిలీ మద్యం తయారీలో నన్ను ముద్దాయిగా చూపుతున్నారు. దీనితో తెలుగుదేశం పార్టీ వారికి సంబంధం లేదు. నాకు ఆరోగ్యం బాగోలేదు, ఆఫ్రికాలో వున్నాను, నేను ఇండియాకు వచ్చిన తరువాత జరిగిన వాస్తవాలను వెల్లడిస్తాను' అని చెప్పాడు. ఆయన వీడియోలో ఎక్కడా జోగి రమేష్ గురించి ప్రస్తావన తీసుకురాలేదు. ఇక ఆయన రెండో వీడియో ఈ నెల 13న విడుదల చేశాడు. దీనిలో జోగి రమేష్ పేరును ప్రస్తావిస్తూ, కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడానికి జోగి రమేష్ కుట్రపన్ని, తనకు డబ్బులు ఇచ్చి ఈ నకిలీ మద్యం తయారీని చేయించారంటూ' ఆరోపణలు చేశాడు.
'నకిలీ మద్యం తయారీ బయటపడటంతో జయచంద్రారెడ్డి తదితరులను టీడీపీ సస్పెండ్ చేయడంతో జోగి రమేష్ తన ప్లాన్ మార్చుకున్నాడని, ఇబ్రహీంపట్నంలో ముందుగా సరుకును తెచ్చిపెట్టమని చెప్పడని, దానిని సాక్షి మీడియా ద్వారా ఎక్సైజ్ వారికి పట్టించాడని, ఇదంతా ఒక పథకం ప్రకారం చేశాడంటూ' కూడా ఆ వీడియోలో పేర్కొన్నాడు. మొత్తం వ్యవహారం అంతా కూడా జోగి రమేష్ చెబితేనే తాను చేశానని, టీడీపీ వారికి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా పేర్కొన్నారు. తొలి వీడియోకు, రెండో వీడియోకు సంబంధం లేకుండా జనార్థన్‌రావు మాట్లాడాడు. రెండో వీడియోతో నకిలీ మద్యం కేసును డైవర్ట్ చేసేందుకు కుట్ర ప్రారంభమైంది.
టీడీపీ నేతలు తప్పు చేయకపోతే ఎందుకు సస్పెండ్ చేశారు?
టీడీపీ నేత జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు తదితరులపై టీడీపీ ఎందుకు సస్పెన్షన్ వేటు వేసింది? జయచంద్రారెడ్డికి చెందిన వాహనంలోనే తాను నకిలీ మద్యంను రవాణా చేశానంటూ డ్రైవర్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. దానికి ఆధారాలు కూడా ఉండటంతోనే విధిలేని స్థితిలో టీడీపీ నుంచి వారిని సస్పెండ్ చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం వ్యవహారంపై సీరియస్‌గా ఉందని, మేమే ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని, గోడౌన్‌లను వెతికి పట్టుకున్నామని, దాడి చేయించామని కూడా ప్రభుత్వం చెప్పుకుంది.
అలాంటప్పుడు జనార్థన్‌రావు విడుదల చేసిన రెండో వీడియోలో జోగి రమేష్ నకిలీ మద్యంను తెప్పించి, ఇబ్రహీంపట్నంలో పెట్టించి, సాక్షి మీడియా ద్వారా దానిని బయటపెట్టించి, ఎక్సైజ్ వారితో సీజ్ చేయించారని ఎలా చెబుతారు? చంద్రబాబుకు వంతపాడే ఎల్లోమీడియా ఈనాడులో నకిలీ మద్యం తయారీ కేంద్రం బయటపడినా కూడా రెండుమూడు రోజుల పాటు దానిపై ప్రస్తావన కూడా చేయలేదు. తరువాత తప్పు చేశారు కాబట్టే మా పార్టీకి చెందిన నాయకులను సస్పెండ్ చేస్తున్నామని నారా లోకేష్, వర్ల రామయ్య ప్రకటించారు. టీడీపీ అధికారిక ట్వీట్‌లో జయచంద్రారెడ్డి 'ఏ1' అంటూ పేర్కొని, తరువాత రెండు రోజుల్లో 'ఏ1' అనే దానిని తొలగించారు. అంటే తమ కుట్రను ప్రారంభించడానికి సిద్దమయ్యే, దానికి అనుగుణంగా తమ వైఖరిని మార్చుకున్నారనేందుకు ఇదే నిదర్శనం.
సీబీఐ విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగుచూస్తాయి
నకిలీ మద్యంపై ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు, బెల్ట్‌షాప్‌ల్లో ఎందుకు తనిఖీలు చేయడం లేదు? దానికి బదులుగా వైఎస్సార్‌సీపీపై బురదచల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు. చంద్రబాబు కపట నాటకాన్ని మొదలుపెట్టారు. హడావుడిగా పన్నెండో తేదీన చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టడానికి కారణం, వైయస్ఆర్‌సీపీ ఎంపీ మిధున్‌రెడ్డి నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్ర హోమంత్రికి లేఖ రాయడమే. ఎక్కడ ఇది సీబీఐ దర్యాప్తునకు దారి తీస్తుందోనని భయంతోనే చంద్రబాబు మీడియాతో రకరకాలుగా మాట్లాడారు. వైఎస్ జగన్‌కి, ఆయన బంధువులుకు కూడా ఆపాదించే విధంగా చంద్రబాబు మాట్లాడారు. నకిలీ మద్యం బయటపడిన తరువాత మౌనంగా ఉన్న ఈనాడు పత్రిక, ఈ నెల తొమ్మిదో తేదీన ఆఫ్రికాలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు లిక్కర్ వ్యాపారంలో ఉన్నారంటూ వైఎస్ జగన్ బంధువులకు అంటగట్టేలా ఒక కథనాన్ని రాసింది.
ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి
జనార్థన్‌రావును అరెస్ట్ చేసి విచారించిన తరువాత ఆయనను న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ సందర్బంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో జోగి రమేష్ పేరు ఉందా? రెండో వీడియోలో మొత్తం జోగి రమేష్ చెబితేనే చేశాను అన్న జనార్థన్‌రావు, పోలీసుల విచారణలో ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదు? దానికి సమాధానం చెప్పాలి. జనార్థన్‌రావు నెల్లూరు జైలుకు రిమాండ్‌కు వెళ్ళిన 24 గంటల తరువాత ఏ విధంగా ఆయన మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది?
ఒకవేళ పోలీసులు విచారణలో జనార్థన్‌రావు ఈ వీడియోలో మాట్లాడి వుంటే, రిమాండ్ రిపోర్ట్‌లో ఆ విషయం ఎందుకు రాయలేదు? జనార్థన్‌రావు మాట్లాడిన వీడియో ఎలా బయటకు వచ్చిందో విచారణ జరిపారా? పక్కన ఎవరో ఉండి ప్రామ్టింగ్ ఇస్తుంటే జనార్థన్‌రావు మాట్లాడినట్లు కనిపిస్తోంది, అలా ప్రామ్టింగ్ ఇచ్చింది ఎవరు? ప్రభుత్వానికి ఉన్న సమాచారంతోనే ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో పోలీసులు దాడులు చేశారని సీఎం చంద్రబాబు చెప్పుకున్న విషయం వాస్తవం కాదా? రెండో వీడియోలో జనార్థన్‌రావు 'జోగి రమేష్ ఒక పథకం ప్రకారమే ఇబ్రహీంపట్నం గోడవున్‌లో నకిలీ మద్యంను పెట్టించి, ఎక్సైజ్ వారికి పట్లించారని' మాట్లాడిన విషయం వాస్తవం కాదా? అంటే ప్రభుత్వమే నకిలీ మద్యం గురించి తెలుసుకుని దాడులు చేసి, పట్టుకుందన్న సీఎం చంద్రబాబు మాటలు అబద్దమా? లేక జనార్థన్‌రావు తన వీడియోలో చెప్పిన మాటలు అబద్దమా?
నకిలీ మద్యం వ్యవహారంలో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని, టీడీపీని అసహ్యించుకుంటున్నారని తెలియగానే, వైఎస్సార్‌సీపీపై బుదరచల్లేందుకు గానూ జనార్థన్‌రావుతో ఒక పథకం ప్రకారం ఈ రెండో వీడియోను కుట్రపూరితంగా తయారుచేసి, బయటకు వదిలిపెట్టారనేది వాస్తవం కాదా? తాను విదేశాలకు వెళ్ళిపోతే రూ.3 కోట్లు ఇస్తానని జోగి రమేష్ ఆఫర్ చేశారని, అందుకే ఆఫ్రికాకు వెళ్ళినట్లు చెప్పిన జనార్థన్‌రావు, ఎవరు చెబితే తిరిగి ఏపీకి వచ్చారు? ఆయన చెబుతున్నట్లుగా మూడు కోట్లు తీసుకోకుండానే ఎలా ఏపీకి వచ్చాడు? మొలకలచెరువు ఘటనలో కొందరు దోషులను అదుపులోకి తీసుకున్నారు. వెంటనే వారిని విచారణకు ఇవ్వాలంటూ కష్టడీ పిటీషన్ వేశారు. కానీ జనార్థన్‌రావు విషయంలో ఎందుకు కస్టడీ పిటీషన్ వేయలేదు?
జనార్థన్‌రావును లోతుగా విచారించకుండా, దొంగ వీడియోను విడుదల చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? టీడీపీ నేతగా ఉన్న జనార్థన్‌రావును ఆఫ్రికా నుంచి పిలిపించిన ప్రభుత్వం, కీలకమైన జయచంద్రారెడ్డిని ఎందుకు పిలిపించడం లేదు? ఆయనపై లుక్‌అవుట్ నోటీస్ ఎందుకు జారీ చేయలేదు? ఎందుకు ఆయనపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు? పోలీసుల విచారణలో టీడీపీకి చెందిన నాయకులు పాల వ్యాన్‌ల ద్వారా నకిలీ మద్యాన్ని సరఫరా చేశారని అధికారులు వెల్లడించారు. ఆ వ్యాన్‌లను, వాటి యాజమానులను ఎందుకు అదుపులోకి తీసుకోలేదు?
వారంతా టీడీపికి చెందిన వారు కావడం వల్లే వారిని ఉపేక్షిస్తున్నారా? రాష్ట్రంలో ఉన్న డెబ్బై అయిదు వేల బెల్ట్‌షాప్‌లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? రాష్ట్ర వ్యాప్తంగా మద్యం శాంపిళ్లను సేకరించి, నకిలీ అవునా కాదా అని తెలుసుకునేందుకు ఎందుకు ల్యాబ్‌లకు పంపించడం లేదు? జనార్థన్‌రావుతో గుర్తుతెలియని ప్రాంతంలో ఒక వీడియోను తీయించి, రాజకీయం చేయాలని ఎందుకు చూస్తున్నారు. ఈ వ్యవహారం ముదురుతుంటే ఎంపీ మిధున్‌రెడ్డి నివాసాలపై దాడులు చేయించడం, ప్రజల దృష్టి మళ్లించేందుకు కాదా? నకిలీ మద్యంపై మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు సీబీఐ దర్యాప్తును కోరడం లేదు?