
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగట్టడం వల్లే కక్షతో కేసులు పెట్టారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. జైలుకెళ్లొచ్చినా వెనక్కి తగ్గేది లేదని.. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానన్నారు.
‘‘దాదాపుగా రాష్ట్రంలోని అన్నీ జైళ్లు వైఎస్సార్‌సీపీ నేతలతో నిండిపోయాయి. టీడీపీ వాళ్లు అరాచకాలు చేసినా పోలీసులు కేసులు పెట్టే ధైర్యం చేయలేకపోతున్నారు. అక్రమ కేసుల వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు భవిష్యత్తులో ఫేస్ చేయాల్సి వస్తుంది. గతంలో మాపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసినా మేం ఎవరి మీద కేసులు పెట్టలేదు. ఇప్పుడు ఎప్పుడో జరిగిందని ఓ టీడీపీ నాయకుడి వాంగ్మూలాన్ని తీసుకుని కేసులు పెడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని దుష్ట సంప్రదాయానికి చంద్రబాబు నాంది పలుకుతున్నారు.
..జగన్ పరామర్శకు వెళ్లిన సమయంలో కూడా అనేక అక్రమ కేసులు పెట్టారు. అరెస్టులు చేయటం, పీటీ వారెంట్‌లు వేయటం.. జైళ్ల చుట్టూ తిప్పటం.. ఇదే వాళ్ల పని.. ప్రసన్న కుమార్ ఇంటిపై దాడి కేసులో నిందితులు ఎవరూ కూడా పోలీసులు గుర్తించలేదు. మా పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై అక్రమ కేసు పెట్టారు. ఎవరో డ్రోన్ ఎగరేస్తే మా పార్టీ నేతపై మర్డర్ కేసులు పెడుతున్నారు. రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వెనుక ఉన్నది టీడీపీ ఎమ్మెల్యేలే.
ఎస్పీ స్థాయి అధికారులు వద్దన్నా టీడీపీ నేతల ఒత్తిడి తోనే పెరోల్ ఇచ్చారు.. దీన్ని మళ్ళీ వైఎస్సార్‌సీపీకి అంటగట్టే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఇప్పటికైనా టీడీపీ చేసిన తప్పులు ఒప్పుకుని చెంపలేసుకోవాలి. అడ్రస్ లేని వ్యక్తులు, ఏ గాలికి ఆ చాప ఎత్తే వ్యక్తులు మాట్లాడిన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీని బలోపేతం చేస్తాం. వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎం చేసేందుకు కృషి చేస్తా’’ అని కాకాణి తెలిపారు.