
సాక్షి, తాడేపల్లి: వ్యవసాయంపై అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిస్సిగ్గుగా పచ్చి అబద్దాలు మాట్లాడారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఆధునిక వ్యవసాయానికి తానే ఆధ్యుడినంటూ చంద్రబాబు అసెంబ్లీలో ఇచ్చిన ప్రజెంటేషన్ చూసి రైతులు నవ్వుకుంటున్నారని అన్నారు. వ్యవసాయం దండగ అన్న ఆలోచనలతో ఉన్న చంద్రబాబు, తన రైతు వ్యతిరేకతను ఏనాడు దాచుకోలేదని గుర్తు చేశారు.
నేడు రాష్ట్రంలో పంటలకు గిట్టుబాటు ధరలు లేని పరిస్థితి ఒకవైపు, యూరియా కొరత మరోవైపు తీవ్రంగా ఉంటే, వాటిని పరిష్కరించలేని అసమర్థ సీఎం చంద్రబాబేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి చంద్రబాబు వ్యవసాయానికి తాను చేసిన కృషిని గురించి గొప్పగా చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆక్షేపించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన నాయకుడుగా వైయస్ జగన్ పాలనలో చేసిన మంచిని కూడా వక్రీకరిస్తూ, అసెంబ్లీలో దిగజారుడు మాటలు మాట్లాడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వ్యవసాయంపై సుదీర్ఘమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో రైతుల సమస్యలపై ఒక్క సమీక్ష కూడా నిర్వహించని సీఎం చంద్రబాబు నేడు అసెంబ్లీలో మాట్లాడుతూ 'తన పాలనలో వ్యవసాయం చాలా బాగుంది, రైతులకు ఎటువంటి కష్టాలు లేవు, రైతులు ఎంతో సంతోషంతో ఉన్నారు. రైతులే యూరియాను ఎక్కువ వాడుతూ తప్పు చేస్తున్నారు, దీనివల్ల క్యాన్సర్ వంటి జబ్బులు వస్తున్నాయని' అన్నారు. మొత్తం మీద 62 శాతం వ్యవసాయం మీద ఆధారపడ్డారు అని చెబుతూనే, రైతులు ఎటువంటి సమస్యలను ఎదుర్కొనడం లేదని ముక్తాయింపు నివ్వడం ఆయన దివాలాకోరుతనంకు నిదర్శనం.
యూరియాపై చంద్రబాబు కొత్త సిద్దాంతం
చంద్రబాబు సిద్దాంతం ప్రకారం రైతులు యూరియా వాడకం తగ్గించేయాలి. నేడు రాష్ట్రంలో యూరియా కొరత ఉంది, కాబట్టి యూరియా వినియోగాన్ని రైతులు తగ్గించుకోవాలి, దానివల్ల నాణ్యమైన పంటలు పండుతాయి, వాటికి మంచి మార్కెటింగ్ ఉంటుంది అని చెబుతున్నారు. అంతేకానీ రైతులకు కావాల్సిన యూరియాను ఇవ్వలేకపోతున్నాం, ప్రభుత్వ వైఫల్యాన్ని ఏ మాత్రం అంగీకరించడం లేదు. అసహ్యాన్ని జయించిన నేత చంద్రబాబు. తన మాటలు చూసి ప్రజలు నవ్వకుంటారని తెలిసి కూడా నిస్సిగ్గుగా మాట్లాడగలరు.
డ్రిప్ ఇరిగేషన్ పైనా అబద్దాలేనా బాబూ?
ఈ దేశానికి డ్రిప్ ఇరిగేషన్‌ను తానే పరిచయం చేశానంటూ చంద్రబాబు అసెంబ్లీలో లేని గొప్పలను చెప్పుకున్నారు. డ్రిప్ ఇరిగేషన్‌ను ఆనాడు పీఎం వాజపేయ్‌కు చెప్పి, వన్‌మెన్ కమీషన్ కింద ఇజ్రాయిల్‌కు వెళ్ళినని, శాస్త్రీయంగా పరిశోదనలు చేసి, దానిని పీఎంకు ఇస్తే, దానిని ఆయన ఈ దేశంలో అమలు చేశారంటూ చంద్రబాబు తన గొప్పతనాన్ని చెప్పుకున్నారు. కానీ డ్రిప్ ఇరిగేషన్ ఈ దేశంలో ఎప్పుడు ప్రారంభమైందని చూస్తే, 1980లోనే తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలో రైతులే ఇతర దేశాల్లో వాడకాన్ని చూసి దీనిని ప్రారంభించారు.
1987లో ఎన్‌సీపీఏ డ్రిప్ ఇరిగేషన్‌ను ప్రారంభించింది. 1991లో కేంద్రం దీనిని చేపట్టడం వల్ల ఏపీలో కూడా ఈ విధానం ప్రారంభమైంది. చంద్రబాబు 1995లో ఎన్డీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యాడు. ఆయన సీఎం కాకముందే ఇరవై ఏళ్ళుగా దేశంలో డ్రిప్ ఇరిగేషన్ విధానం అమలులో ఉంది. ఎటువంటి సిగ్గు లేకుండా తాను వచ్చిన తరువాతే ఈ విధానం దేశంలో ప్రారంభమైందని అసెంబ్లీలో చంద్రబాబు చెప్పుకోవడం ఆయన దివాలాకోరుతనంకు నిదర్శనం.
గిట్టుబాటు ధరలు ఎవరి హయాంలో ఎంతో తెలుసా?
రైతులకు సంబంధించి గిట్టుబాటు ధరలపై చంద్రబాబు మాట్లాడుతూ మిరపకు రికార్డు లేదు అన్నారు. మరోవైపు వ్యవసాయశాఖ మంత్రి మిర్చిపంటను ఈ-క్రాప్ కింద రికార్డు చేశామని చెబుతున్నారు. కానీ చంద్రబాబు తన వద్ద ఎటువంటి రికార్డు లేకపోవడం వల్ల వారిని ఆదుకోలేకపోయామంటూ మాట్లాడారు. దీనితో పాటు తాను ఉల్లి, పత్తి, మామిడి, టమాటా పంటలకు మద్దతు ధర కల్పించానంటే ఆర్భాటంగా ప్రకటించుకున్నారు. వైఎస్ జగన్ హయాంలో, ఇప్పుడు చంద్రబాబు హయాంలో పంటకు కల్పించిన గిట్టుబాటు ధరలను ఒకసారి పరిశీలిస్తే...
- వైఎస్ జగన్ హయాంలో ధాన్యం క్వింటాకు రూ.1800 నుంచి రూ.2000 ఉంటే, చంద్రబాబు హయాంలో రూ.1150 నుంచి రూ.1400 మాత్రమే ఉంది.
- కందులు.. వైఎస్ జగన్ హయాంలో క్వింటా 10,200 నుంచి రూ.11,800 ఉంటే చంద్రబాబు హయాంలో 5500 నుంచి 6200లకు పడిపోయాయి.
- మినుములు.. వైఎస్ జగన్ హయాంలో క్వింటా రూ.9200-9850 వరకు ఉంటే, చంద్రబాబు హయాంలో రూ.6000 లకు తగ్గిపోయాయి.
- పెసలు.. వైఎస్ జగన్ హయాంలో క్వింటా 9100-9700 వరకు ఉంటే, చంద్రబాబు హయాంలో రూ.5000-5200 లకు తగ్గిపోయాయి.
- సజ్జలు.. వైఎస్ జగన్ హయాంలో క్వింటా రూ.2860-3650 వరకు ఉంటే, చంద్రబాబు హయాంలో హయాంలో రూ.1800-2000 లకు తగ్గిపోయాయి.
- మిర్చి.. వైఎస్ జగన్ హయాంలో రూ.21,000 - 27,000 ఉంటే చంద్రబాబు హయాంలో రూ.8000 - 11,000 లకు పడిపోయాయి.
- పొగాకు.. వైఎస్ జగన్ హయాంలో క్వింటా రూ.15000 -18000 ఉంటే, చంద్రబాబు హయాంలో రూ.100 - 300 వరకు పడిపోయింది.
- ఉల్లికి వైఎస్ జగన్ హయాంలో రూ.4000 - 12000 లకు అమ్మితే, చంద్రబాబు హయాంలో క్వింటా ఉల్లి కేవలం రూ.300లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి కల్పించారు. రైతుల గోడును పట్టించుకోకుండా ఉల్లి రైతును ఆదుకున్నాను అని చెప్పుకుంటున్నారు.
- వైఎస్ జగన్ హయాంలో టమాటా కిలో రూ.20-25 ఉంటే, మీ హయాంలో రూ.1.50 కి పడిపోయింది.
- వైఎస్ జగన్ హయాంలో కోకో 950-1050 ఉంటే, మీ హయాంలో రూ.240-500 కి పడిపోయింది.
- చీనీ టన్ను జగన్ హయాంలో రూ.30,000 - రూ.1 లక్ష వరకు రైతులు అమ్ముకున్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో రూ.7000 -14000
- మామిడికి జగన్ హయాంలో క్వింటా రూ.2200 - 2900 ఉంటే, చంద్రబాబు హయాంలో రూ.200 లకు పడిపోయింది.
మద్దతుధరలను ధైర్యంగా ప్రకటించిన వైఎస్ జగన్
దమ్మున్న నాయకుడు ఈ రాష్ట్రానికి సీఎం అయితే, రైతులు పండించిన పంటలకు మా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు ఇవీ అని బహిరంగంగా రేట్లను ప్రకటించారు. ఆ పని ఆనాడు సీఎంగా వైఎస్ జగన్ చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్ ప్రతులను కూడా మీడియాకు చూపిస్తున్నాం. మా ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. ఈ రేట్లకే రైతులకు మద్దతు ధర కల్పిస్తామని బహిరంగంగా చెప్పిన నాయకుడు వైఎస్ జగన్. దాని ప్రకారం రైతులకు అండగా నిలిచారు. ధరల స్థిరీకరణ నిధి కింద చంద్రబాబు హయాంలో 3,74,680 మంది రైతులకు రూ.3,322.15 కోట్లు ఇచ్చారు. అదే వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో 6,16,991 మందికి రూ. 7,746.31 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చారు.
సోమశిల కింద రెండో పంటకు తొలిసారి నీరిచ్చారంటూ అబద్ధాలు
'సోమశిల కండలేరు కింద ఎప్పుడూ రెండు పంటలు వేయరూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రెండో పంటకు తొలిసారి నీరు ఇవ్వడం వల్ల పంటల విస్తీర్ణం పెరిగి యూరియా కొరత ఏర్పడింది' అంటూ చంద్రబాబు కొత్త సూత్రీకరణ చేశారు. మిడిమిడి జ్ఞానంతో సీఎం స్థానంలో ఉండి చంద్రబాబు మాట్లాడటం చూసి నెల్లూరు రైతులు నవ్వుకుంటున్నారు. 2004 వరకు సోమశిలలో 36 టీఎంసీలకు మించి నీటిని నిల్వ ఉంచేవారు కాదు, దీనివల్ల నీరులేక ఒక్క పంటకే నీరు ఇచ్చేందుకు ఇబ్బంది పడేవారు.
స్వర్గీయ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం అయిన తరువాత సోమశిలలో దాదాపు 74 టీఎంసీలను నిల్వ చేసి, దాదాపు అన్ని సంవత్సరాల పాటు రెండోపంటకు నెల్లూరు జిల్లాకు నీరుఇచ్చారు. అలాగే వైయస్ జగన్ సీఎంగా ఉన్న అయిదేళ్ళపాటు కూడా రెండోపంటకు ఈ రిజర్వాయిర్ నుంచి నీటిని ఇచ్చారు. వాస్తవాలను తెలుసుకోకుండా సీఎంగా చంద్రబాబు మాట్లాడిన మాటలు పచ్చి అబద్దాలు. దీనిపై నెల్లూరుకు వచ్చి రైతులతో మాట్లాడితే వాస్తవాలు తెలుస్తాయి. చంద్రబాబు సీఎం అయిన తరువాత నెల్లూరు ప్రాంతానికి రెండోపంటకు నీరివ్వడం ఇదే తొలిసారి, అదీ అయన గొప్పతనం.
అన్నదాత సుభీభవ కింద ఎంత ఎగ్గొట్టారో చెప్పాలి
వరి అనేది తినడానికి పనికిరాదు, ఆల్కాహాల్ తయారీకి వాడుకోవాల్సిందేనని సీఎం చంద్రబాబు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ధాన్యం గిట్టుబాటుధర లేక క్వింటా రూ.12వేలకు రైతులు అమ్ముకుంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెట్టే దిక్కులేదు. నీళ్ళు ఉంటే వరి తప్ప మరో పంట పండించుకునే అవకాశం లేదని, తాను ధాన్యంకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నాను అని ఒకవైపు చెబుతూనే, వరి నాణ్యత తగ్గితే ఆల్కహాల్‌కు ఉపయోగించుకోవాలని చెబుతున్నాడు. అన్నదాత సుఖీభవ పథకాన్ని పూర్తిగా అమలు చేశాను అని చెప్పుకుంటున్నాడు.
కేంద్రం ఇచ్చే దానితో సంబంధం లేకుండా రూ.20వేలు ప్రతి రైతుకు ఇస్తాను అని చెప్పారు. ఇప్పుడు కేంద్రం ఇచ్చే ఆరువేలతో కలిసి ఇస్తాను అని మాట మార్చేశారు. దీనిలో కూడా తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. కనీసం రెండో ఏడాది కూడా అరకొరగా అది కూడా 54 లక్షల మందికి గానూ కేవలం 48 లక్షల మందికే ఇచ్చారు. ఎందకు రైతుల సంఖ్య తగ్గిందీ అని ప్రశ్నిస్తే, రైతులు చనిపోయారంటూ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. అంటే రైతులు చనిపోతే, ఆ కుటుంబాలకు చెందిన వారు వ్యవసాయం చేయడం మానుకున్నారా? కొందరికి అనవసరంగా ఇస్తున్నామని, వారిని తొలగించామని చెబుతున్నారు. చంద్రబాబు వాటర్ మేనేజ్‌మెంట్ గురించి మాట్లాడారు. ఇరిగేషన్ కాలువలను ఉపాధి హామీ కింద పనులు చేస్తున్నామని చెబుతూ ఒకవైపు దోచుకుంటున్నారు, అదే కాలువలకు ఇరిగేషన్ శాఖ నుంచి బిల్లులు దండుకుంటున్నారు. ఈ అక్రమాల్లో కాలువ పనుల నాణ్యతా ప్రమాణాలను పూర్తిగా గాలికి వదిలేశారు.
యూరియాపై రెండు నాలుకల ధోరణి
యూరియా కొరత లేదని మాట్లాడుతున్న చంద్రబాబు నిత్యం పత్రికల్లో వస్తున్న రైతుల గోడు గురించి ఏమంటారు? పొరుగు రాష్ట్రాల్లో కొరత ఏర్పడిందని, ఏపీలో కూడా అదే పరిస్థితి ఉందని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశానికే దిశానిర్దేశం చేశాను, వ్యవసాయానికి కొత్త మెలకువలు నేర్పించాను అని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రంలో యూరియా కొరతను ఎందుకు పరిష్కరించలేకపోయారు. వివిధ జిల్లాల్లో రైతులు యూరియా కోసం ఎలా బారులు తీరారో, ఎలా ఆందోళనలు చేస్తున్నారో పత్రికల్లో వచ్చిన కథనాలను ఈ సందర్బంగా మీడియా ద్వారా ప్రదర్శిస్తున్నాం. వీటికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. వీరంతా రైతులు కాదా? రైతుల కన్నా చంద్రబాబు వ్యవసాయంలో నిష్ణాతుడా? రైతులు ప్యానిక్ బయ్యింగ్ చేస్తున్నారంటూ మాట్లాడుతున్నారు.
ప్రైవేటు వ్యక్తులకు యాబైశాతం వరకు ఇచ్చాం కాబట్టే ఇబ్బంది ఏర్పడిందని అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఆయన మాట్లాడిన వీడియోను కూడా ఈ మీడియా సమావేశంలో ప్రదర్శిస్తున్నాం. ఈనెల 2వ తేదీన మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 'కేంద్రం మన రాష్ట్రానికి కేటాయించిన యూరియాలో యాబైశాతం ప్రైవేటుకు, మిగిలిన యాభైశాతం ప్రభుత్వానికి కేటాయిస్తుంది. ప్రైవేటుకు ఎక్కువ కేటాయించడం వల్ల చాలా మంది రైతులు అటు రైతుభరోసా కేంద్రాల వద్ద తీసుకుంటున్నారు. కొంతమంది బయట తీసుకుంటున్నవారు ఇబ్బంది పడుతున్నారు.' అంటూ మాట్లాడారు. అదే మంత్రి అచ్చెన్నాయుడు ఈ రోజు అంటే 22వ తేదీన అసెంబ్లీలో మాట్లాడుతూ... ఏపీ చరిత్రలో తొలిసారి ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన యూరియాను యాబై శాతం నుంచి డెబ్బైశాతంకు పెంచి రైతుసేవా కేంద్రాలకు పంపి, రైతులకు విక్రయిస్తున్నాం' అంటూ మాట్లాడారు.
అలాగే తెలంగాణ, కర్ణాటకలో యూరియాకు ఎటువంటి సమస్యలు వచ్చాయో చూస్తున్నాం. ఆ ఫోటోలను తీసుకుని ఒక ఫేక్ పార్టీ యూరియా కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు' అంటూ మాట్లాడారు. ఇదే మంత్రి అచ్చెన్నాయుడు యూరియా కొరత యాబైశాతం ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం వల్లే వచ్చిందని మీడియా ప్రతినిధుల సమావేశంలో అంగీకరించాడు. దీనిపై చంద్రబాబు ఆయనకు తలంటడం వల్ల మాట మార్చి ఈ రోజు అసెంబ్లీలో డెబ్బైశాతం రైతుసేవా కేంద్రాల్లోనే పంపిణీ చేస్తున్నామని పచ్చి అబద్దాలు మాట్లాడారు. గతం కన్నా ఎక్కువ యూరియాను తీసుకువచ్చామని మంత్రి చెప్పారు. తెచ్చిన యూరియాను యాబైశాతం ప్రైవేటుకు ఇవ్వడం వల్ల, వారు దానిని బ్లాక్ చేసి రూ.270 కి అమ్మాల్సిన కట్టను రూ.600 లకు బ్లాక్‌లో అమ్మే పరిస్థితిని తీసుకువచ్చారు. దీనివల్ల రూ.250 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. రైతులకు సేవాకేంద్రాల ద్వారా ఇవ్వాల్సిన యూరియాను ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఎందుకు అమ్మించారో చెప్పాలి.
పంటల బీమా చెల్లింపులపై చర్చకు సిద్దమా?
రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేసిన యూరియాను డోర్ డెలివరీ చేస్తాను అని చంద్రబాబు చెబుతున్నారు. ఎకరాకు ఎంత యూరియా వేయాలో భూసార పరీక్ష చేసి, దాని ప్రకారం యూరియాను ఎంత ఇవ్వాలో నిర్ణయించి, ఆ మేరకు ఆధార్ అనుసంధానం ద్వారా రైతుకు డోర్ డెలివరీ చేస్తాను అని చంద్రబాబు చెబుతున్నాడు. అంటే యూరియా కష్టాలు అనేవి ఈ ఏడాది మాత్రమే కాదు, భవిష్యత్తులోనూ ఉంటాయి, వాటిని పరిష్కరించే సామర్థ్యం తనకు లేదని చంద్రబాబే ఒప్పుకుంటున్నారు. 800 మంది అమెరికా నుంచి పోస్ట్‌లు పెట్టారని అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. అమెరికాలో ఉన్న వారి తల్లిదండ్రులు రాష్ట్రలో వ్యవసాయం చేయడం లేదా?
అంతర్జాతీయ స్థాయిలో కూటమి ప్రభుత్వ పరువుపోతోందని సిగ్గుపడాలి. భూసార పరీక్షలు వైఎస్ జగన్ హయాంలో జరగలేదని, ల్యాబ్‌లు పెట్టి, ఎటువంటి పరికరాలను పెట్టలేదని తప్పుడు కూతలు కూస్తున్నారు. వైయస్ జగన్ నిర్మించిన ఆధునిక ల్యాబ్‌లను వంద జన్మలు ఎత్తినా చంద్రబాబు చెయ్యలేరు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అండగా ఆర్బీకేలను ఏర్పాటు చేసిన ఘనత వైయస్ జగన్‌ను దక్కుతుంది. ల్యాబ్‌లు, రీజనల్ కోడింగ్ సెంటర్‌లను నిర్మించారు. వీటిపైన పచ్చి అబద్దాలు మాట్లాడటం సిగ్గుచేటు.
చంద్రబాబు హయాంలో ఇవ్వాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీని రైతులకు బకాయిలు పెట్టి వెళ్లిపోతే, వైయస్ జగన్ గారు దానిని చెల్లించారు. ఏ సీజన్‌లో రైతులకు నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగా ఆ సబ్సిడీనీ అందించిన ఘనత వైయస్ జగన్‌కే దక్కుతుంది. 2018-19కి సంబంధించి రూ.596.40 కోట్లు, అలాగే 2019-20కి సంబంధించి రూ.1252 కోట్లు, 2020-21కి సంబంధించి రూ.1739 కోట్లు, 2021-22 రూ.2977.82 కోట్లు ఉచిత పంటల బీమా కింద ఇవ్వడం జరిగింది. వైఎస్ జగన్ హయాంలోనే మొత్తం 54,55,363 మంది రైతులకు మొత్తం 7802 కోట్లు ఉచిత పంటల బీమా కింద ఇవ్వడం జరిగింది. దీనిని ఇది నిజం కాదని అచ్చెన్నాయుడు నిరూపించగలరా? అచ్చెననాయుడిని సవాల్ చేస్తున్నాం. నిరూపించలేకపోతే తన పదవికి రాజీనామా చేస్తారా?
కౌలురైతులను ఆదుకున్నది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే
కౌలురైతులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతుభరోసా ఇవ్వలేని ఎమ్మెల్యే కొణతల రామకృష్ణ అసెంబ్లీలో మాట్లాడారు. పీఎం కిసాన్ పథకం కింద ఇచ్చే రూ.6వేలు ఇవ్వకపోతే, రాష్ట్రమే దానిని భరించి మొత్తం రూ.13,500 రైతుభరోసా కింద వారికి ఇచ్చాం. ప్రభుత్వం వద్ద దానికి సంబంధించి రికార్డులు ఉన్నాయి, ఒకసారి పరిశీలించిన తరువాత దానిపై మాట్లాడాలి. సున్నావడ్డీ పంటరుణాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ దిగిపోయే నాటికి 84,66,217 మంది రైతులకు పెట్టిన రూ. 2050 కోట్లు బకాయిలను కూడా వైయస్ జగన్ ప్రభుత్వమే చెల్లించింది.