
విజయవాడ: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం మరోసారి కక్ష సాధింపు చర్యలకు దిగింది. వైఎస్ జగన్ ఏ పర్యటన చేపట్టినా జనం ప్రభంజనంలా తరలి రావడాన్ని చూసి ఓర్వలేక చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని జనాన్ని నియంత్రించాలని చూస్తోంది.
ఇందులో భాగంగా ఈనెల 31వ తేదీన (గురువారం) వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై ఆంక్షలు విధించింది. కేవలం పది మందికి మాత్రమే అనుమతి అంటూ పోలీసులతో నోటీసులు ఇప్పించింది చంద్రబాబు సర్కారు. వైఎస్ జగన్ హెలీప్యాడ్ వద్ద కేవలం పది మంది మాత్రమే ఉండాలని నోటీసుల్లో పేర్కొంది.
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనలో భాగంగా జైల్లో ఉన్న వైఎస్సార్‌సీపీ నేత కాకాణితో వైఎస్ జగన్ ములాఖత్ కానున్నారు. ఇక్కడకు కూడా జనం రాకూడదని ఆంక్షలు విధించింది. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసానికి వైఎస్ జగన్ వెళ్లే క్రమంలో కూడా జనానికి అనుమతి లేదని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. కేవలం కాన్వాయ్‌లకు మాత్రమే అనుమతి ఉందని, జనం పది మంది మించి రావడానికి వీల్లేదని నోటీసుల్లో స్పష్టం చేశారు.
జగన్ వస్తున్నారంటే జనం తండోపతండాలుగా వచ్చే అవకాశం ఉండటంతో కూటమి సర్కారు భయభ్రాంతులకు గురౌవుతుంది., అందుకే ఆంక్షలతో వైఎస్ జగన్ జనాభిమానాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది.
అప్పుడు హెలీప్యాడ్‌కు అనుమతి లేదంటూ..
జులై 3న వైఎస్ జగన్ చేపట్టాల్సిన నెల్లూరు పర్యటనకు సైతం అడ్డంకులు సృష్టించింది కూటమి సర్కారు. హెలీప్యాడ్‌కు అనుమతి ఇవ్వకుండా కుట్రలకు తెరలేపింది. గత నెల 27న వైఎస్ జగన్ పర్యటన కోసం వైఎస్సార్‌సీపీ నేతలు దరఖాస్తు చేశారు.
ఆ సమయంలో హెలిప్యాడ్‌కి అనుమతి ఇవ్వకుండా అడ్డంకులు కల్గించారు. ఇప్పుడు పది మంది మాత్రమే రావాలంటూ ఆంక్షల పర్వాన్ని తెరపైకి తెస్తూ మరోమారు నోటీసులు ఇవ్వడం వైఎస్ జగన్ పర్యటనను ఏదో రకంగా అడ్డుకోవాలని చూడటమేనని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.