ఎస్‌ బాస్‌లకే ‘రెడ్‌’ కార్పెట్‌! | Senior police officers are under pressure because of tdp | Sakshi
Sakshi News home page

ఎస్‌ బాస్‌లకే ‘రెడ్‌’ కార్పెట్‌!

Apr 12 2025 4:31 AM | Updated on Apr 12 2025 4:31 AM

Senior police officers are under pressure because of tdp

రూల్స్‌ పాటించే ఎస్పీలు బైపాస్‌ 

వారి స్థానంలో అస్మదీయ డీఎస్పీలు 

రాష్ట్రవ్యాప్తంగా నెల్లూరు మోడల్‌  

ఒత్తిళ్లతో హడలెత్తిపోతున్న ఉన్నతాధికారులు  

‘రెడ్‌బుక్కే రూల్‌ బుక్‌...! కచ్చితంగా అమలు చేయడమే జిల్లా ఎస్పీల బాధ్యత..! టీడీపీ ప్రధానకార్యాలయంతోపాటు జిల్లాల్లోని పార్టీ నేతలు సూచించిన ప్రకారం వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులుపెట్టాల్సిందే..! వారిని తీవ్రంగా వేధించాల్సిందే..!’ -  ముఖ్యనేత అల్టిమేటం...!

‘ప్రభుత్వ పెద్దలు చెప్పింది అర్థమైంది కదా...! ఫాలో కావాల్సిందే...! లేదంటే చార్జ్‌మెమోలు ఇస్తాం.. చెప్పినట్లుగా నడుచుకోని ఎస్పీలను పక్కనబెడతాం.. డీఎస్పీలతో రెడ్‌బుక్‌ కేసులు ఫాలో అప్‌ చేయిస్తాం..!’  - పోలీస్‌ బాస్‌ హుకుం..! 

రెడ్‌బుక్‌ అరాచకాలతో పోలీసు ఉన్నతాధికారులు ఒత్తిళ్లతో సతమతమవు­తున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌ రెడ్‌బుక్‌ ఒత్తిళ్లతో తీవ్ర అస్వస్థతకు గురి కావడం ఎస్పీలను ఆందోళనకు గురి చేస్తోంది. గత 20 రోజులుగా ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాలో జరిగిన పరిణామాలను వాకబు చేస్తూ అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. - సాక్షి, అమరావతి 

నెల రోజులుగా కృష్ణకాంత్‌కు వేధింపులు..!
రెడ్‌బుక్‌ కుట్రను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌పై ప్రభుత్వ పెద్దలు, డీజీపీ కార్యాలయం నెల రోజులుగా తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు స్పష్టమవుతోంది. వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డిపై అక్రమ కేసులు నమోదు, అక్రమ అరెస్టులో ఎస్పీ తమ అంచనాలకు తగ్గట్టుగా పని చేయడం లేదని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

2014–19 మధ్య పెండింగ్‌లో ఉన్న పలు కేసులను తిరగదోడి రాజకీయ ప్రత్యర్థులపై ఐపీసీ సెక్షన్‌ 307 చేర్చి హత్యాయత్నం కింద కేసులు బనాయించాలని పట్టుబట్టారు. దీంతో టీడీపీ నేతల ఒత్తిళ్లతో పలువురు స్టేషన్‌ హౌస్‌ అధికారులు వాస్తవాలతో నిమిత్తం లేకుండా వివిధ కేసుల్లో సెక్షన్‌ 307 చేర్చేందుకు యత్నించారు.  ఈ విషయం తెలియడంతో ఎస్పీ కృష్ణకాంత్‌ వారిని వారించినట్లు సమాచారం. 

నిబంధనలకు విరుద్ధంగా సెక్షన్‌ 307 చేర్చితే న్యాయపరంగా ఇబ్బందులు తప్పవని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. దీన్ని సహించలేని సోమిరెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దాంతో ముఖ్యమంత్రి కార్యాలయం ఎస్పీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని ఆదేశించడంతో కృష్ణకాంత్‌ను డీజీపీ తన కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. 

రెడ్‌బుక్‌ కేసులకు సంబంధించి చెప్పినట్లు  చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. అనంతరం రోజూ ఫోన్లు చేస్తూ ఒత్తిడి పెంచడంతో ఎస్పీ కృష్ణకాంత్‌ తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనకు తక్షణం మెరుగైన చికిత్స అందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆయనకు హృదయ సంబంధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని, ఒత్తిడికి గురి కావద్దని సూచించారు. 

రెడ్‌బుక్‌ను కాదనే ఎస్పీలకు మెమోలు
అడ్డగోలుగా వ్యవహరించేందుకు వెనుకంజ వేసే ఎస్పీలను వెంటనే పక్కనబెట్టాలని డీజీపీని ప్రభు­త్వ పెద్దలు ఆదేశించారు. ఆయా జిల్లాల్లో టీడీపీ వీర విధేయ డీఎస్పీలను గుర్తించి వారితో రెడ్‌బుక్‌ కేసుల దర్యాప్తును పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. నె­ల్లూరు జిల్లాలో ప్రస్తుతం అదే సూత్రాన్ని అనుస­రిస్తు­న్నారు. నెల్లూరు రూరల్‌ డీఎస్పీగా ఉన్న ఘట్ట­మ­నేని శ్రీనివాస్‌ను తెరపైకి తెచ్చారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధ్థన్‌రెడ్డిపై అక్రమ కేసుతోపాటు ఇత­ర రెడ్‌బుక్‌ కేసుల దర్యాప్తును ఆయనే పర్యవేక్షిస్తుండటం గమనార్హం. 

పోలీసు బృందాల ఏర్పాటు, వివిధ ప్రాంతాలకు పంపించడం, జిల్లావ్యాప్తంగా పో­లీసు­లకు ఆదేశాలు జారీ చేయడం తదితర వ్యవహారాలను డీఎస్పీ శ్రీనివాసే నిర్వర్తిస్తుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు మోడల్‌నే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని ఎస్పీలకు డీజీపీ కార్యాలయం తేల్చి చెప్పినట్లు సమాచారం. 

రెడ్‌­బుక్‌­ను ఫాలో కా­కుంటే ఎస్పీలకు చార్జ్‌ మెమోలు త­ప్పవని, ఆ తరు­వాత తాము ఎంపిక చేసిన డీఎస్పీ­లు ఆయా కేసులను పర్యవేక్షిస్తారని హెచ్చరించిన­ట్లు తెలుస్తోంది. ఈ పరి­ణామాలు ఐపీఎస్‌ అధికారు­లైన ఎస్పీలను అవమా­నించడమేనని పోలీసువర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement