
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజం
వినియోగదారులకు తిరిగి చెల్లించాల్సిన డబ్బులను మీరు ఉదారంగా ఇస్తున్నట్లు ప్రచారమా?
చార్జీలను ఇంకా తగ్గిస్తామని నమ్మబలికి ఏడాదిలోనే రూ.19 వేల కోట్ల బాదుడు
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్‌సీ) తలంటితే సిగ్గు పడాల్సింది పోయి ట్రూ డౌన్ పేరుతో విద్యుత్ చార్జీలను తగ్గిస్తున్నట్లు ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం చంద్రబాబు సర్కారు దివాళాకోరుతనానికి నిదర్శనమని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. ఈఆర్‌సీ ఆదేశాలతో వినియోగదారులకు తిరిగి చెల్లించాల్సిన రూ.923.55 కోట్లను తాను ఎంతో ఉదారంగా ఇస్తున్నట్లు చెప్పుకోవడం సిగ్గుగా లేదా? అని ప్రశి్నంచారు.
అనుమతి లేకుండా విద్యుత్ చార్జీల భారం మోపిన చంద్రబాబు ప్రభుత్వానికి ఈఆర్‌సీ నిర్ణయం చెంప పెట్టు లాంటిదన్నారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం కాకాణి మీడియాతో మాట్లాడారు. విద్యుత్ చార్జీలు ఇంకా తగ్గిస్తానని నమ్మబలికిన చంద్రబాబు ఏడాదిలోనే ప్రజలపై రూ.19 వేల కోట్ల భారాన్ని మోపారని ధ్వజమెత్తారు. ట్రూ డౌన్ చంద్రబాబు ఘనతగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
అనుమతించిన ధరకు మించి కొనుగోలు
2024–25 సంవత్సరానికి రూ.2,758.76 కోట్లు ట్రూ అప్ చార్జీలకు డిస్కంలు ఈ ఏడాది జూలైలో అనుమతి కోరగా ఏపీఈఆర్‌సీ రూ.1,863.64 కోట్లకు మాత్రమే అనుమతి ఇచి్చందన్నారు. కూటమి సర్కారు ఏపీఈఆర్‌సీ అనుమతించిన ధరకు మించి విద్యుత్ కొందన్నారు. ఏపీఈఆర్‌సీ యూనిట్ రూ.5.27కు కొనమని చెబితే.. ఈపీడీసీఎల్ రూ.5.84 చొప్పున, సీపీడీసీఎల్ రూ.5.86 చొప్పున, ఎస్పీడీసీఎల్ యూనిట్ రూ.5.89 చొప్పున వెచి్చంచి విద్యుత్ కొన్నట్లు వెల్లడించాయన్నారు. విద్యుత్ కొనుగోలు ఖర్చు రూ.34,517 కోట్లకు అనుమతి ఉంటే రూ.45,476 కోట్లు వెచి్చంచామని డిస్కంలు చెప్పాయన్నారు. ప్రసార, పంపిణీ నష్టాలు 10.17 శాతమని డిస్కంలు ప్రతిపాదిస్తే ఈఆర్‌సీ మాత్రం 9.87 శాతానికే అంగీకరించిందన్నారు.
2024–25కి సంబంధించి ప్రతి నెలా యూనిట్‌కు 0.40 పైసలు చొప్పున డిస్కమ్‌లు ఇప్పటికే రూ.2,787.18 కోట్లు వసూలు చేశాయన్నారు. అనుమతించిన మొత్తం పోనూ మిగిలిన రూ.923.55 కోట్లను ఈ ఏడాది నవంబర్ నుంచి ట్రూ డౌన్ చేయాలని ఈఆర్‌సీ ఆదేశించిందన్నారు. కూటమి సర్కారు 2024 నవంబర్ బిల్లు నుంచే రూ.6,072.86 కోట్ల భారాన్ని ప్రజలపై మోపి వసూలు చేస్తుండగా ఈ ఏడాది జనవరి బిల్లు నుంచి మరో రూ.9,412.50 కోట్ల అదనపు భారం మోపిందన్నారు.