సాక్షి, నెల్లూరు: మంత్రి అచ్చెన్నాయుడుకు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు. అలాగే, రైతుల సమస్యలపై చర్చించేందుకు చంద్రబాబు, అచ్చెన్నాయుడు సిద్ధమా? అని ప్రశ్నించారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్‌సీపీ హయాంలో ఆర్‌బీకే వ్యవస్థ ద్వారా రైతులకు వైఎస్ జగన్ అండగా నిలిచారు. వైఎస్ జగన్ తెచ్చిన వ్యవస్థలను చంద్రబాబు కుట్రపూరితంగా నిర్వీర్యం చేశారు. చంద్రబాబు మాటలను నమ్మ ప్రజలు, రైతులు మోసపోయారు. కూటమి నేతల తీరు చూసి ప్రజలు ఛీకొడుతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం. అసెంబ్లీ సాక్షిగా కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులే విమర్శలు చేసుకుంటున్నారు. రైతులు సమస్యలపై చర్చించేందుకు చంద్రబాబు, అచ్చెన్నాయుడు సిద్ధమా? అని సవాల్ విసిరారు.
కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ఏపీలోని బెల్టు షాపుల్లో 90 శాతం నకిలీ మద్యమే. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయి. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో బెల్టు షాపులను ఎత్తేశాం. ప్రజల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కలేదు. మద్యం బాటిళ్లపై క్యూఆర్ కోడ్ ఎక్కడుంది?. ఎక్సైజ్ అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ప్రజల ఆరోగ్యంతో సంబంధం లేకుండా దోచుకుంటున్నారు’ అని ఘాటు విమర్శలు చేశారు.


