 
													తొలి మహిళ ఇంజనీర్‌గా కంప్యూటర్ రంగంలో కృషి చేసిన కర్ణాటకకు చెందని రాజేశ్వరి ఛటర్జీ లేదా మెరైన్ ఇంజనీర్ సోనాలి బెనర్జీ పేర్లనే చెప్పుకుంటాం. కానీ వారందరికంటే ఒక వితంతవు..నాటి సామాజిక పరిస్థితులను చేధించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రంగంలో చేరి, రాణించి దేశానికే ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరుకుంది. చరిత్ర ఆమె విజయాలను అంతగా గుర్తించకపోయినా..ఎలక్రికల్ ఇంజనీర్‌లో తొలి మహిళా గ్రాడ్యుయేట్ అనేది కాదనలేని సత్యం. అంతేగాదు ఎందరో అమ్మాయిలు ఆ రంగంలో చేరేలా పురికొల్పేందుకు కారణమైంది. నాడు ఆ ఒక్క మినహాయింపుతో..ఎవ్వరూ చేయలేని సాహసం చేసిన తొలి మహిళ ఆమె. ఔను ఏరంగంలోనైనా ఫస్ట్ పొజిషన్‌లో ఉండటం అంటే భయంగానే ఉంటుంది. ఎందుకంటే మార్గదర్శకులు ఉండరు, పైగా ఎన్నో కళ్లు మన గెలుపుని అనుమానిస్తాయి, తక్కువ అంచనా వేస్తాయి. వాటన్నింటిని అధిగమించి అసాధారణ గెలుపుని ఒడిసి పట్టి యావత్తు ప్రపంచం గుర్తించుకునేలా చేసిన తొలి మహిళా ఇంజనీర్ ఆమె. ఈ తరానికి అంతగా తెలియని, గుర్తింపుకు నొచుకుని ఆ మహిళ ఇంజనీర్ ఎవరంటే..
ఆ మహిళే..భారతదేశపు తొలి మహిళా ఇంజనీర్ అయ్యలసోమయూజుల లలిత. మన తెలుగమ్మాయే. చెన్నైలోని గిండిలోని ఇంజనీరింగ్ కళాశాలలో చేరినప్పుడూ తొలి రోజు కాలేజీలో ఎదురైన ఘటనకు మరెవ్వరైనా..మళ్లీ అడుగు పెట్టడానికే భయపడిపోతారు. కానీ లలిత ఉక్కు ధైర్యంతో ముందుకుసాగారామె. ఆ రోజుల్లో ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్‌లో అంతా అబ్బాయిలే ఉండేవారు. ఒకే ఒక్క అమ్మాయి తన సహచర విద్యార్థిగా అడుగుపెడుతుందని తెలిసి అంతా వింతగా, ఎగతాళిగా నవ్వులు వినిపిస్తున్నా..ఓపికతో భరించింది.
కూర్చొనేందుకు చోటు లేని పరిస్థితి. ఆమె కోసం ప్రత్యేకంగా సెపరేట్‌గా వేసిన కూర్చీలో కూర్చొని పాఠాలు వినింది. కాటన్ చీరలో తలొంచుకుని నిశబ్దంగా వస్తున్న అమ్మాయిని చూసి అందరికీ చిన్న చూపు, ద్వేషం. అయినా తన పని, లక్ష్యంమీద దృష్టిపెట్టి..కొద్దికాలంలోనే ప్రొఫైసర్లకు, తన తోటి పురుష విద్యార్థులకు అభిమాన సహచర విద్యార్థినిగా పేరుతెచ్చుకుంది. అంతేగాదు ఆ కాలేజీలో మహిళ హాస్ట్‌ల్ లేకపోయినా..తన కోసం కేటాయించిన ప్రత్యేక గదిలో ఉండి, చదువుకోవడానికి ఎంతో ధైర్యం కావాలి.
ఇంజనీరింగ్ కోర్సులో చేరేందుకు దారితీసిన పరిస్థితి..
ఆగస్టు 27, 1919 చెన్నైలో ఒక తెలుగుకుటుంబంలో జన్మించిన లలిత నాటి కాలంలోని సామాజిక పరిస్థితులన్నింటిని ధిక్కరించి చదువుకున్న తొలి మహిళ. 15 ఏళ్ల ప్రాయానికే వివాహం చేసుకుని 18 ఏళ్లకే వితంతువుగా మారింది. శ్యామల అనే కూతురుకి తల్లిగా మారింది. ఒక్కసారిగా నిశబ్దంలోకి తొంగి చూస్తున్న ఆమె జీవితాన్ని మార్చాలనుకున్నాడు ఆమె తండ్రి ఇంజనీర్, లెక్చరర్ అయిన ప్రొఫెసర్ అయ్యల సోమయాజుల సుబ్బారావు. 
ఆమె జీవితంలోకి వచ్చిన నష్టాన్ని పూరించలేకపోవచ్చు..ఏదో వ్యాపకంతో ఆమె జీవితం చిగురించేలా చేయాలని ఆశించారు. కేవలం విద్యతోనే ఆర్థిక స్వాతంత్య్రాన్ని పొంది ధైర్యంగా మనగలదని ప్రగాఢంగా నమ్మారాయన. ఆ ఉద్దేశ్యంతోనే ఇంట్లోనే లలితకు గణితం, భౌతిక శాస్త్రాన్ని బోధించారాయన. ఆ తర్వాత గిండిలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌కు దరఖాస్తు చేసుకోమని ప్రోత్సహించారు.
అయితే ఆ సమయంలో మహిళా హాస్టళ్లు లేవు, ప్రత్యేక సౌకర్యాలు లేవు. స్త్రీని చేర్చుకునే విద్యావిధానం కూడా లేదు. కానీ సుబ్బారావుగారు స్వయంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రెడ్డికి విజ్ఞప్తి చేసి లలితను 'స్పెషల్ కేసు'గా చేర్చుకునేలా ఒప్పించారు. ఆ ఒక్క మినహాయింపు చరిత్ర గతిని మార్చేసింది. అయితే లలిత తండ్రి నమ్మకాన్ని నిజం చేసేలా తన కోర్సులో రాణించింది, మంచి స్కిల్ సంపాదించుకుంది.
అలా 1944 నాటికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రురాలై..భారతదేశపు తొలి మహిళా ఇంజనీర్ అయ్యిందామె. గ్రాడ్యుయేషన్ అనంతరం లలిత సిమ్లాలోని సెంట్రల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్(సీఎస్‌ఓ)లో చేరారు. అక్కడ ఆమె దేశానికి కీలకమైన విద్యుత్ పరికరాలు సాంకేతికత భద్రతా ప్రమాణాలను నిర్ణయించే విధులను నిర్వర్తించేది. ఆ తర్వాత కలకత్తాలోని అసోసియేటెడ్ ఎలక్ట్రికల్(ఏఈఐ)లో విద్యుత్ కేంద్రాల కోసం విద్యుత్ జనరేటర్లు, రక్షణ రిలేను రూపొందించారు.
అంతేగాదు దేశ పురోగతికి శక్తినిచ్చే.. విద్యుత్‌గ్రిడ్‌కి సంబంధించిన సమర్థవంతమైన వ్యవస్థలో స్పెషలిస్ట్‌గా ఉన్నారు. నిశబ్దంగా ఉండే ఆమె ధోరణి వల్లే ప్రపంచానికి లలితా అనే ఎలక్ట్రికల్ ఇంజనీర్ గురించి తెలియకుండాపోయింది. ఒక పక్క కూతురు శ్యామలను పెంచుతూనే ఇంజనీరింగ్ వృత్తిలో అంచలంచెలుగా రాణిస్తోందామె.

ఆమెకు దక్కిన అసాధారణ గుర్తింపు..
1964లో, న్యూయార్క్‌లో జరిగిన మొదటి అంతర్జాతీయ మహిళా ఇంజనీర్లు, శాస్త్రవేత్తల సదస్సు(ICWES)లో లలిత భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆ సదస్సులో ఆమె 35 దేశాల మార్గదర్శకులతో వేదికను పంచుకుంది. అంతలా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విశేష ప్రతిభను కనబర్చిన ఆమె 1979లో మరణించారు. 
కానీ చరిత్ర ఆమె సాధించిన విజయాలను అంతగా గుర్తించలేదు. తొలి మహిళా ఇంజనీరింగ్‌గా ఎవరెవరో పేర్లను వినిపించేదే తప్ప వారందరికంటే..లలిత ఒక వితంతువుగా నాటి సామాజిక పరిస్థితులను చేధించుకుంటూ సాగిన వైనాన్ని గుర్తించకపోవడం బాధకరం.
(చదవండి: ఇద్దరు పిల్లల తల్లి సాహసం..! మరో రికార్డు కోసం..)

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
