
ఎమర్జింగ్ కోర్సులపై ప్రత్యేక ఫోకస్
ఐఐటీలు, ఎన్‌ఐటీల అధ్యాపకులతో అప్‌గ్రేడ్
కొత్త సాంకేతికత పొందాలంటే ఇదే మార్గం
యూనివర్సిటీలకు ఏఐసీటీఈ మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకుల బోధన ప్రమాణాలు మెరుగు పర్చాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సూచించింది. కాలానుగుణంగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అప్‌గ్రేడ్ చేసుకోవాలని పేర్కొంది. దేశంలోని అన్ని యూనివర్సిటీలకు ఈ మేరకు లేఖ రాసింది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్‌లో కొత్తగా వచ్చిన డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఎమర్జింగ్ కోర్సులపై దృష్టి పెట్టాలని తెలిపింది. దేశంలో ఏటా 12.53 లక్షల మంది ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు.
ఇందులో కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరేవారే 68 శాతం ఉంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ కోర్సులు చేస్తున్నవారు 3.90 లక్షల మంది ఉండగా, వీరిలో కనీసం 50 వేల మందికి కూడా స్కిల్ ఉద్యోగాలు రావడం లేదు. ఏఐ కోడింగ్, సైబర్ సెక్యూరిటీ మాడ్యూల్స్‌పై పట్టు ఉండటం లేదు. బోధన మెళకువలు లోపించడమే ఈ పరిస్థితి కారణంగా ఏఐసీటీఈ భావిస్తోంది. అధ్యాపకులకు కొత్త కోర్సులపై తాజా టెక్నాలజీని అందిపుచ్చుకునే అవకాశం ఉండటం లేదు. దీంతో విద్యార్థులు నష్టపోతున్నారు.
అప్‌గ్రేడ్‌కు అనేక మార్గాలు
కొత్త ఎమర్జింగ్ కోర్సుల్లో మాస్టర్ డిగ్రీ చేసినవారు ఉండటం లేదు. అయితే, ప్రొఫెషనల్స్‌కు దీనిపై ఎక్కువ పరిజ్ఞానం ఉంటోంది. ఉదాహరణకు ఏఐఎంఎల్ సబ్జెక్టు బోధించే అధ్యాపకులకన్నా, సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసే వారికి కొత్త టెక్నాలజీ తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి వారిని ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ క్లాసుల ద్వారా అధ్యాపకులకు కొత్త టెక్నాలజీపై అవగాహన కల్పించాలని ఏఐసీటీఈ సూచించింది.
క్లౌడ్, డేటాపై పట్టు కోసం డేటా సెంటర్స్‌లో పనిచేసే ప్రొఫెషనల్స్ సహకారం తీసుకోవాలి. సైబర్ సెక్యూరిటీ కోర్సు బోధించేవారు కొత్తగా వస్తున్న సైబర్ నేరాలు, సెక్యూరిటీ ఆప్షన్స్‌ను తెలుసుకోవడా నికి దర్యాప్తు సంస్థల్లో నిపుణుల సహకారం తీసుకోవాలి. వీటితో పాటు ఐఐటీ, ఎన్‌ఐటీ సంస్థలు ఎమ ర్జింగ్ కోర్సులపై అంతర్జాతీయ టెక్నా లజీని అందిపుచ్చుకుంటున్నాయి. ఆయా సంస్థల్లో పనిచేసే అధ్యాపకుల చేత క్లాసులు తీసుకోవడం ప్రయోజ నకరంగా ఉంటుంది.
వీటిపై పట్టు అవసరం
⇒ బోధన టెక్నాలజీ వినియోగంలో డిజిటల్ టూల్స్ వాడకంపై అధ్యాపకులకు అవగాహన అవసరం. గూగుల్ క్లాస్ రూం, ఎల్‌ఎంఎస్ ప్లాట్‌ఫాం, ఆన్‌లైన్ క్లాస్ నిర్వహణ, ఇంటరాక్టివ్ క్లాసులు తీసుకోవడం వంటి కోర్సులపై స్వయం, కోర్సెరా, ఎన్‌పీటెల్ వంటి సంస్థలు శిక్షణ ఇస్తున్నాయి.
⇒ ఆధునిక బోధన పద్ధతులను అనుసరించే విధానం పెరగాలి. వీడియో లెక్చర్లు, వర్చువల్ ల్యాబ్స్, రిమోట్ ఎక్స్‌పర్మెంట్, ఆన్‌లైన్ అసైన్‌మెంట్ వంటి కోర్సులను ఎన్‌ఐటీటీఆర్ అనే సంస్థ అందిస్తోంది.
⇒ ఏఐఎంఎల్, డేటాసైన్స్ టూల్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, ఆటోమేషన్ వంటి సాంకేతిక స్కిల్స్ ఆప్‌డేట్ కోర్సులను ఐఐటీలు, ఇస్రో వంటి సంస్థలు అందిస్తున్నాయి.
⇒ స్టాన్‌ఫర్డ్, గూగుల్, ఐబీఎం వంటి సంస్థలు కూడా సర్టిఫికెట్ కోర్సులు అందిస్తున్నాయి. వీటిని పూర్తి చేసేలా యూనివర్సిటీలు అధ్యాపకులను ప్రోత్సహించాలి. దీంతోపాటు పారిశ్రామిక భాగస్వామ్యంతో కొత్త టెక్నాలజీని నేర్చుకునేలా చేయాలని ఏఐసీటీఈ సూచించింది.