రహదారి దుస్థితిపై అంకుశ్ చౌదరి ఆగ్రహం
మహా నగరాలు, పట్టణాలు.. గ్రామాలు ఎక్కడైనా కానివ్వండి. తవ్వేసిన రహదారులు, నెలలకొద్దీ పూర్తికాని పారిశుద్ధ్యం పనులు సర్వసాధారణం. ఇక వీధుల్లోని సిమెంటు రహదారుల విషయమైతే చెప్పాల్సిన అవసరమే లేదు. గంటల్లో తవ్వి తీస్తారు కానీ.. అవశేషాలు మాత్రం అలాగే పడి ఉంటాయి. కొత్త రోడ్డు వేసేందుకూ వారాలకు వారాలు సమయం పడుతుంది. ఇలా చేస్తే ప్రజలకు ఎంత ఇబ్బందన్నది అస్సలు పట్టింపు ఉండదు. కాంట్రాక్టర్ ఎవరో తెలియదు.. తెలిసినా సామాన్యులు ఎవరూ ఎందుకిలా అని అడగలేరు. అడిగినా.. పట్టించుకుంటారన్న గ్యారెంటీ కూడా లేదు. ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫూర్‌పూర్‌లోనూ ఇలాంటి తంతే ఒకటి నడిచింది కానీ.. ఓ రైతు నాయకుడు దీన్ని తీవ్రంగా ప్రతిఘటించాడు. ప్రభుత్వ అధికారికి ప్రజాగ్రహం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించాడు. అసలు విషయం ఏమిటంటే..
అది చెప్పే ముందు ఈ ట్వీట్ చూడండి... https://x.com/ggganeshh/status/1986069720668537230 ఎర్ర టీషర్ట్ వేసుకున్న వ్యక్తి రైతు సంఘం నాయకుడు అంకుశ్ చౌదరి. పక్కనున్న వ్యక్తి సాగునీటి విభాగం జూనియర్ ఇంజినీర్ సచిన్ పాల్. పంట కాలువల పూడికను కాస్తా రహదారిపై వదిలేశారట సాగునీటి విభాగం వారు. ఎంతకీ తీయకపోవడంతో వీధి వీధంతా కంపు కొడుతోంది. పైగా ఆ బురదలో ప్రజలు నడవడమే కష్టమైపోయింది. ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదేమో ఇంజినీరు సారు.. అంకుశ్ చౌదరి ఆగ్రహం నశాళానికి ఎక్కింది. జూనియర్ ఇంజినీర్ సచిన్ పాల్ చొక్కా పట్టేసుకున్నాడు. ఆ నల్లటి, దుర్గంధభరితమైన బురదలో నడిపించాడు. రోడ్లు ఇలా ఉంటే మేము మా ఇళ్లకెలా వెళ్లాలి పటేలా? పొలాలకు దారేది పటేలా? అంటూ అతడిని బురదలో నడిపించాడు. చుట్టూ ఉన్న వారు ఇంజినీర్‌కు తగిన శాస్తి జరిగిందని సంబరపడ్డారు కానీ.. ఈ ఘటన కాస్తా వాడి వేడి చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వ అధికారులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తప్పని, అంకుశ్ చౌదరి చేసింది సరైన పనేనని కొందరు సమర్థిస్తే... మరికొందరు వ్యతిరేకించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని వారు అంటున్నారు.
ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం చెప్పుకోవాలి. కర్ణాటక రాజధాని బెంగళూరులో రహదారుల దుస్థితిపై చాలాకాలంగా ప్రజల్లో అసంతృప్తి ఉంది. కొంతమంది అకడక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు కూడా. రోడ్లు వేయకపోతే ట్యాక్సులు కట్టమని కొందరు... రోడ్లు, ఫుట్‌పాత్‌లలో పేరుకుపోయిన చెత్తను హైలైట్ చేస్తూ ప్రభుత్వం దృష్టిని ఆకర్శించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బెంగళూరు వాసుల ప్రజాస్వామ్యయుతమైన నిరసనతో కొంచెం ఆలస్యంగానైనా ప్రయోజనం ఉంటుందేమోకానీ.. క్షణికావేశంలో అంకుశ్ చౌదరిలా ప్రవర్తిస్తే మాత్రం ఏమవుతుందో చెప్పలేము.


