న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం ఉదయం నుంచి నగరాన్ని ఘనమైన పొగమంచు, చల్లటి వాతావరణం కమ్మేసింది. దీంతో గాలి నాణ్యత సూచిక (AQI) తీవ్ర స్థాయికి చేరువైంది. శనివారం రాత్రి 11 గంటలకు గాలి నాణ్యత (AQI)410కి చేరి తీవ్ర స్థాయికి చేరింది. ఆదివారం ఉదయం 6.30 గంటలకు AQI 396గా నమోదైంది.
ప్రభావిత ప్రాంతాలు.. చాంద్ని చౌక్ – 455, వజీర్‌పూర్ – 449, రోహిణి – 444, జహాంగీర్‌పురి – 444, ఆనంద్ విహార్ – 438 , ముండ్కా – 436కి గాలి నాణ్యత చేరడంతో ఈ ప్రాంతాలన్నీ తీవ్ర కాలుష్యం వర్గంలోకి చేరాయి. దాంతో భారత వాతావరణ శాఖ (IMD) ఘనమైన పొగమంచు హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్, కనిష్టం 8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. చల్లటి వాతావరణం,తక్కువ గాలి వేగం, ఉష్ణోగ్రత మార్పులు కాలుష్యాన్ని నేలమట్టం వద్దే నిలిపేశాయి.
ఈ నేపధ్యంలో రోడ్డు, రైలు, విమాన రవాణాపై అంతరాయం కలిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. పిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధిత సమస్యలున్నవారికి ఆరోగ్య సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపునులు పేర్కొన్నారు.
తక్కువ గాలి వేగం, ఉష్ణోగ్రత ఇన్వర్షన్ కారణంగా కాలుష్యం నేలమట్టం వద్దే నిలిచిపోతుందని నిపుణులు తెలిపారు. శీతాకాలం మరింతగా పెరుగుతున్న కొద్దీ ఢిల్లీలో గాలి కాలుష్యం సమస్య మళ్లీ మళ్లీ తలెత్తుతుందని హెచ్చరించారు. ఢిల్లీలో గాలి నాణ్యత సమస్యపై దీర్ఘకాలిక పరిష్కారాలు, స్థిరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.


