 
													గ్లోబల్ ఫెరారీ రేసింగ్ సిరీస్‌లో పాల్గొంటున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించనుంది పుణేకి చెందిన రేసర్ డయానా పండోలె. ఈ ఛాంపియన్‌షిప్ నవంబర్‌లో మొదలవుతుంది. ఫెరారీ 296 చాలెంజ్ కారుతో దూసుకుపోనుంది. డయాన. ఫెరారీ 296 అనేది ఇటాలియన్ బ్రాండ్‌కు సంబంధించిన అత్యాధునిక, ట్రాక్–ఫోకస్ట్ మెషీన్.
‘రేసింగ్’ అనేది డయానా ఎవరి నోటి నుంచో విన్న మాట కాదు. చిన్నప్పటి నుంచే రేసింగ్‌కు సంబంధించిన కబుర్లు ఇంట్లో వినేది. అమ్మా,నాన్నలకు రేసింగ్ అంటే ఇష్టం. కాలక్రమంలో వారి ఇష్టమే తన ఇష్టంగా మారింది.
మొదట బైక్ నేర్చుకుంది. ఆ తరువాత కారు నడపడం నేర్చుకుంది. ఆ తరువాత రేస్ కార్లతో దూసుకుపోయేది. డయానాలో ఉత్సాహమే కాదు దానికి తగిన శక్తి,సామర్థ్యాలు ఉన్నాయి. అందుకే ఇండియన్ నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌ను గెల్చుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది డయానా.
పోటీలకు సంబంధించి పెళ్లికి ముందు ఉన్న ఉత్సాహం పెళ్లయిన తరువాత కొద్దిమందిలో కనిపించదు. ఇద్దరు పిల్లల తల్లి అయిన 32 ఏళ్ల డయానాలో మునపటి ఉత్సాహం ఎంతమాత్రం తగ్గలేదు. తరగని ఆ ఉత్సాహమే గ్లోబల్ ఫెరారీ రేసింగ్ సిరీస్ పాల్గొంటున్న తొలి భారతీయ మహిళగా మరోసారి చరిత్ర సృష్టించేలా చేస్తోంది.
(చదవండి: ధనాధన్..వాకథాన్..! ఊపందుకుంటున్న సుదీర్ఘ నడక ఈవెంట్లు..)
 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
