వ్యాపారవేత్త అనంత్ అంబానీ అరుదైన అవార్డు అందుకున్నారు. వన్య ప్రాణుల సంరక్షణలో అనూహ్య ప్రభావం చూపినందుకు అమెరికన్ హ్యూమేన్ సొసైటీ అంతర్జాతీయ విభాగమైన గ్లోబల్ హ్యూమేన్ సొసైటీ.. అనంత్ అంబానీకి గ్లోబల్ హ్యూమానిటేరియన్ అవార్డును ప్రదానం చేసింది. ఈ పురస్కారాన్ని అందుకున్న మొదటి ఆసియా వ్యక్తిగా, అలాగే అతి పిన్న వయస్కుడిగా అంబానీ చరిత్ర సృష్టించారు.
అంబానీ స్థాపించిన వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రం‘వంతారా’ విజ్ఞాన ఆధారిత సంరక్షణా కార్యక్రమాలు, పెద్ద స్థాయిలో రక్షణ–పునరావాస చర్యలు, అలాగే జాతి సంరక్షణలో కొత్త దారులు చూపినందుకు విశేషంగా ప్రశంసలు అందుకుంది. గ్లోబల్ హ్యూమేన్ సొసైటీ అధ్యక్షురాలు, సీఈవో డాక్టర్ రాబిన్ గాంజర్ట్ మాట్లాడుతూ, “ప్రతి ప్రాణికి గౌరవం, ఆరోగ్యం, ఆశ ఇవ్వాలన్న అంకితభావాన్ని వంతారా ప్రతిబింబిస్తోంది. దీనికి దార్శనికుడు అనంత్ అంబానీ,” అని పేర్కొన్నారు. వంతారాను ఆమె “చికిత్స, పునరుజ్జీవనానికి నిలయంగా నిలిచిన విశిష్ట సంరక్షణ కేంద్రం”గా అభివర్ణించారు.

ఈ గౌరవం అందుకున్న అనంత్ అంబానీ ‘సర్వభూతహిత’ భావాన్ని ప్రస్తావిస్తూ, “ప్రతి ప్రాణికి గౌరవం, శ్రద్ధ, భరోసా ఇవ్వడం మా ధర్మం. సంరక్షణ రేపటికి వాయిదా వేయదగినది కాదు” అని అన్నారు. గతంలో ఈ అవార్డును బెట్టి వైట్, షిర్లీ మెక్‌లేన్, జాన్ వేన్ వంటి ప్రముఖులు, అలాగే అమెరికా అధ్యక్షులు జాన్ ఎఫ్. కెన్నెడీ, బిల్ క్లింటన్ అందుకున్నారు.
కఠినమైన గ్లోబల్ హ్యూమేన్ సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసిన వంతారా, జంతు ఆహారం, ప్రవర్తనా సంరక్షణ, వైద్య సేవలు, సహజ ప్రవర్తనకు అవకాశాలు వంటి అనేక అంశాల్లో అత్యుత్తమ ప్రమాణాలు చూపింది. వంతారా ప్రాజెక్టులు ప్రమాదంలో ఉన్న జాతుల పునరుద్ధరణ, శాస్త్రీయ సంరక్షణ పరిశోధనలు, ప్రకృతి వాతావరణాల్లో జంతువుల పునర్నివాసంపై దృష్టి సారిస్తున్నాయి.


