ముఖ్యమంత్రి పినరయి విజయన్, మమ్ముట్టిలతో...
‘ఊర్వశి’ శారద (80) చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదీ తెలుగు నేలలో కాదు. కేరళలోని తిరువనంతపురంలో. ఆదివారం అక్కడ ఘనంగా జరిగిన ‘కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్’ (2024) బహూకరణ వేడుకలో ఆమె కరతాళధ్వనుల మధ్య వీల్‌చైర్‌లో వేదిక మీదకు వచ్చారు. ప్రసిద్ధ నటుడు మమ్ముట్టి చేయి అందించగా లేచి ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేతుల మీదుగా ఆ రాష్ట్ర సర్వోన్నత సినీ పురస్కారం ‘జె.సి.డేనియల్’ అవార్డు అందుకున్నారు. మనకు రçఘుపతి వెంకయ్యనాయుడు ఎలాగో అక్కడ జె.సి.డేనియల్ అలాగ. జె.సి. డేనియల్ తొలి మలయాళ సినిమా దర్శకుడు.
1965 నుంచి శారద మలయాళ సినిమాలలో నటించడం మొదలుపెట్టారు. 2015 వరకూ ఆమె నటన కొనసాగింది. ‘శారద మలయాళ రంగానికి మొదటి జాతీయ అవార్డు తీసుకు వచ్చారు. ఆమె మలయాళ రంగానికి చేసిన సేవలు విశిష్టమైనవి. ఆమె తన లోతైన, నిండైన అభినయంతో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారు’ అని పినరయి విజయన్ శారద నటనను కొనియాడారు. శారద మలయాళంలో 125 చిత్రాలలో నటించారు. ‘తులాభారం’ (1968) మలయాళ చిత్రానికి ఆమె మొదటి జాతీయ అవార్డు తీసుకున్నారు. ఈ సినిమా తెలుగులో ఆమె ముఖ్యపాత్రగా ‘మనుషులు మారాలి’ పేరుతో రీమేక్ అయ్యింది. శారద ఆ వెంటనే ‘స్వయంవరం’ (1972) మలయాళ సినిమాతో మరోసారి జాతీయ అవార్డు గెలిచారు.
అదూర్ గోపాల కృష్ణన్ దర్శకత్వంలో నిర్మితమైన ఈ సినిమా మలయాళంలో పార్లల్ సినిమాకు మొదటి అడుగుగా వ్యాఖ్యానిస్తారు. ఆ తర్వాత శారద ‘నిమజ్జనం’ (1977) తెలుగు సినిమాతో మూడోసారి జాతీయ అవార్డు గెలిచారు అందుకే ఆమెకు జె.సి.డేనియల్ అవార్డుతో పాటు ఐదు లక్షల నగదును అందించారు. శారద ఈ సందర్భంగా తను నటించిన మలయాళ చిత్రంలోని పాట పాడి ప్రేక్షకులను ఉత్సాహపరిచారు.
తెలుగులో ఆమె ‘శారద’, ‘బలిపీఠం’, ‘కార్తీక దీపం’, ‘న్యాయం కావాలి’, ‘జస్టిస్ చౌదరి’ తదితర ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత పరుచూరి బ్రదర్స్ రాసిన ‘ప్రతిధ్వని’, ‘లారీ డ్రైవర్’, ‘బొబ్బిలి బ్రహ్మన్న’ తదితర చిత్రాల పాత్రలలో నటించారు. నటుడు బాలకృష్ణకు ‘అత్తగారి’ పాత్రలో ‘నారీ నారీ నడుమ మురారి’, ‘అనసూయమ్మ గారి అల్లుడు’ తదితర చిత్రాలలో అలరించారు. ‘అమ్మ రాజీనామా’ చిత్రం ఆమె నటనకు మరో కలికితురాయి. ప్రస్తుతం శారద చెన్నైలోని తన సోదరుడి కుటుంబంతో నివసిస్తున్నారు.


