అభినేత్రి శారద పేరు తెలుగు పరిశ్రమలో ఎప్పటికీ చెరిగిపోని పేరు. ఆమె ఒక నట గ్రంథాలయం. ఆరు పదుల సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన పాత్రలకు జీవం పోశారు. ‘కల్యాశుల్కం’ చిత్రంతో వెండితెరకు పరిచమైన శారద.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నటించి ఎనలేని అభిమానులను సంపాదించుకున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని మన పెద్దలు చెబుతారు. అయితే, శారద మాత్రం ముందు రచ్చ గెలిచి ఆ తరువాతే ఇంట గెలిచారు. శారద తెలుగు నటే కానీ, మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్ రేంజ్‌కు చేరుకున్నారు. జాతీయ స్థాయి ఉత్తమ నటిగా పేరుపొందిన ఆమెకు పుట్టిల్లయిన తెలుగు చిత్ర పరిశ్రమ తన ప్రతిభకు పట్టాభిషేకం చేసింది.
'జేసీ డానియల్ అవార్డు - 2024'కు శారద ఎంపిక
తాజాగా కేరళ ప్రభుత్వం శారదను గౌరవించనుంది. మలయాళ చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలకు గుర్తుగా కేరళ ప్రభుత్వం అందించే అత్యున్నత సినిమా పురస్కారం 'జేసీ డానియల్ అవార్డు - 2024'కు ఆమె ఎంపికయ్యారు. జనవరి 25న తిరువనంతపురంలో కేరళ రాష్ట్ర చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని శారద అందుకుంటారు.
ఈ వార్త తెలిసిన వెంటనే శారద స్పందించారు. ఈ అవార్డ్‌కు తనను ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. తనపై మలయాళ చిత్రసీమతో పాటు అక్కడి ప్రేక్షకులు చూపిన ప్రేమను తన ఆఖరి శ్వాస వరకు మర్చిపోనని ఆమె అన్నారు. మలయాశ ప్రేక్షకులు లేకపోతే తన కెరీర్ లేదని పేర్కొన్నారు. తన సినీ కెరీర్ ఆరంభంలో తెలుగులో కొన్ని చిత్రాల్లో కామెడీ వేషాలు మాత్రమే దక్కాయని, ఆ పాత్రలు కూడా ఈ అమ్మాయికి సరిగా చేయడం లేదని చాలామంది మేకర్స్ అన్నారని గుర్తుచేసుకున్నారు.
సినిమా ఛాన్స్‌లు లేని సమయంలో మలయాళంలో ‘శాకుంతల’ అనే సినిమా తనకు ఊపరిపోసిందన్నారు. అలా జాతీయ అవార్డ్ అందుకునే రేంజ్‌కు మలయాళ పరిశ్రమ తనను తీసుకెళ్లిందని ఆమె అన్నారు. మలయాళ ప్రముఖ దర్శక నిర్మాత కుంజాకో తన ప్రతిభను గుర్తించారని ఆయన్ను ఎప్పటికీ మరిచిపోలేనని శారద తెలిపారు. తెలుగులో అమ్మ రాజీనామా, మేజర్ చంద్రకాంత్, దాన వీర శూర కర్ణ, తెనాలి రామకృష్ణ, స్వయంవరం ,నిమజ్జనం , జస్టిస్ చౌదరి, సర్దార్ పాపారాయుడు, స్టాలిన్, యోగి వంటి ఎన్నో మంచి పాత్రలు చేసిన సినిమాలు ఉన్నాయి.


