కేరళ అత్యున్నత జేసీ డేనియల్ పురస్కారానికి ఎంపిక
ఈనెల 25న తిరువనంతపురంలో సీఎంచే ప్రదానం
ఒకప్పటి మలయాళ సూపర్‌స్టార్ శారద
5 భాషల్లో 350 పైగా సినిమాల్లో నటన
అందులో 125 మలయాళ సినిమాలే
తెలుగు సినీపరిశ్రమలోనూ ప్రత్యేక స్థానం
మళయాళీలతో ‘చేచీ’ (అక్క) అని పిలిపించుకున్న ప్రసిద్ధ సినిమా నటి శారదను కేరళ ప్రభుత్వం అత్యున్నత జేసీ డేనియల్ అవార్డు (2024)కు ఎంపిక చేసింది. ఈనెల 25న తిరువనంతపురంలో జరగనున్న కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేతుల మీదుగా అవార్డుతోపాటు రూ.5 లక్షల నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని స్వీకరిస్తారు. ఐదు భాషల్లో 350 సినిమాల్లో నటించిన శారద, మలయాళంలో 125 సినిమాల్లో నటించారు. మలయాళ సినీపరిశ్రమకు శారద సేవలను గుర్తిస్తూ కేరళ ప్రభుత్వం తన అత్యున్నతమైన అవార్డుకు ఎంపిక చేయటం విశేషం.
మూడుసార్లు జాతీయ అవార్డు ...
నటనలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన నటులకు ఇచ్చే జాతీయ అవార్డును మూడుసార్లు అందుకున్న ఏకైక తెలుగు నటి శారద స్వస్థలం కళల తెనాలి. 1945 జూన్ 25న జన్మించారు. అసలు పేరు తాడిపర్తి సరస్వతీదేవి. సినిమాల్లోకి వెళ్లాక శారదగా మారింది. తండ్రి వ్యాపారరీత్యా బర్మా వెళ్లేందుకని చెన్నై వెళ్లినపుడు, అనుకోకుండా 1955లో ఎనీ్టఆర్ ‘కన్యాశుల్కం’ సినిమాలో బాలపాత్రలో నటించింది. తెనాలి తిరిగొచ్చాక 13 ఏళ్ల వయసులో పరుచూరి రాజారాం బృందంలో చేరి, నాటకాల్లో నటించసాగారు. ఆ తరువాత ‘రక్తకన్నీరు’ నాటకంలో నాగభూషణం సరసన హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు.
ఎన్టీఆర్ జాతీయ పురస్కారం
ఆ తర్వాత తెలుగు సినిమాలు ఆమె పాత్ర చుట్టూ పరిభ్రమించేలా తీశారు. ఎన్నో సినిమాల్లో శారద గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు. చిత్తూరు వి.నాగయ్య, ఎన్టీఆర్ జాతీయ పురస్కారం సహా అనేక అవార్డులను అందుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ప్రస్తుతం పూర్తి విశ్రాంత జీవనంలో ఉన్నారు.
మలయాళ సినిమా రంగంలో సుస్థిర స్థానం
1961లో హేమాంబరధరరావు సినిమా ‘తండ్రులు–కొడుకులు’తో శారదగా పరిచయమయ్యారు. 1963లో విడుదలైన అన్నపూర్ణ వారి ‘ఇద్దరు మిత్రులు’లో అక్కినేని సోదరిగా నటించారు. తర్వాత కొంతకాలం కామెడీ వేషాలే దక్కాయి.‘తిరుపతి’ అనే నాటకంలో శారదను చూసిన తమిళ హీరో శివాజీగణేశన్, ఆమెకు ‘కుంకుమమ్’ అనే తమిళ సినిమాలో అవకాశం కల్పించారు. తెలుగు సినిమాలతో వెండితెరకు వెళ్లిన శారదలోని ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించింది మాత్రం మలయాళ సినిమారంగమే. 1960 దశకంలో మలయాళంలో ప్రముఖ నటులైన సత్యన్, ప్రేమనజీర్‌తో కలిసి ‘ఇనప్రావుగళ్’లో నటించిన శారదకు, ఆ సినిమాతో మలయాళ సినిమా రంగంలో సుస్థిరమైన స్థానం లభించింది. 1965లో ఎంటీ వాసుదేవనాయర్ ‘మురప్పెణ్ణు’లోనూ శారద తన నటనతో అద్భుతం అనిపించుకున్నారు. కేఎన్ సేతుమాధవన్, ఎ.విన్సెంట్, పి.భాస్కరన్ వంటి ప్రముఖ దర్శకులతో పనిచేశారు.
తొలిసారిగా ‘ఊర్వశి’ అవార్డు..
1968లో శారద నటించిన మలయాళ సినిమా ‘తులాభారం’. జాతీయ ద్వితీయ ఉత్తమ సినిమాగా ఎంపికైంది. ఆ సినిమాలో అమోఘమైన నటనకు శారద, తొలిసారిగా ‘ఊర్వశి’ అవార్డు అందుకున్నారు. ఆదూర్ గోపాలకృష్ణన్ దర్శకత్వంలో వచ్చిన ‘స్వయంవరం’ సినిమాలో రెండోసారి ఊర్వశి అవార్డు గెలుచుకున్నారు. మలయాళ సినిమా పరిశ్రమను తిరగరాసిందీ సినిమా. 1972లో నాలుగు జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. 1979లో శారద నటించిన ‘నిమజ్జనం’ సినిమా జాతీయ ఉత్తమ సినిమాగా ఎంపికైంది. ఈ సినిమాతో ముచ్చటగా మూడోసారి ఊర్వశి అవార్డును సగర్వంగా స్వీకరించారు. 1982లో జాతీయ అవార్డు అందుకున్న ‘ఎలిపత్తాయం’ అనే సినిమాలో ఒక విభిన్నమైన పాత్రలో నటించారు. భరతన్ దర్శకత్వంలోని ‘మిన్నుముంగిట నురుగుచెట్టు’లో హీరోహీరోయిన్లుగా శారద, ప్రఖ్యాత మలయాళ హీరో నెడుమూడి వేణు నటన శిఖరాగ్రాలకు చేరిందని విమర్శకులు ప్రశంసించారు. శారద మలయాళ సూపర్‌స్టార్‌గా గుర్తింపును తెచ్చుకున్నారు. మలయాళీలకు ఆమె ‘చేచి’ (అక్క) అయింది.


