టాలీవుడ్ నటి రీతూ వర్మ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించింది. హీరో గోపీచంద్ ప్రతిష్టాత్మక చిత్రంలో ఆమె అలరించేందుకు సిద్ధమయింది. ప్రస్తుతానికి టైటిల్ ఖరారు కాని ఈ మూవీని దర్శకుడు సంకల్ప్‌రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఘాజీ, ఐ.బి 71, అంతరిక్షం చిత్రాలతో భిన్నమైన చిత్రాలతో మెప్పించిన సంకల్ప్ రెడ్డి... ఈసారి భారతదేశ చరిత్రలో మరిచిపోయిన ఓ కీలకఘట్టాన్ని వెండతెరపై చూపించనున్నాడు. ఈ క్రమంలో తాజాగా రీతూ వర్మ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

(Gopichand 33) పేరుతో ప్రారంభమైనే ఈ ప్రాజెక్ట్‌లో సత్యవతి అనే గిరిజన యువతిగా రీతూ వర్మ పాత్రలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లో ఆమె అత్యంత కీలకమైన పాత్రలోనే నటిస్తున్నట్లు పోస్టర్ సూచిస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ దీనిని సమర్పిస్తున్నారు. 7వ శతాబ్దం నాటి సంఘటనల ఆధారంగా దీన్ని తెరకెక్కించనున్నారు.
భారతదేశ చరిత్రలో అందరూ మరిచిపోయిన ఓ కీలకఘట్టాన్ని ఈ చిత్రంతో తెరపై చూపించనున్నారు. ఇప్పటివరకూ ఎక్కడా కూడా చర్చల్లోలేని ఈ కథను చెప్పబోతున్నామని దర్శకుడు తెలిపారు. ఈ సినిమా కోసం గోపీచంద్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ మణికందన్ ఎస్ (హిట్ 1, హిట్ 2, గీత గోవిందం, సైంధవ్), ప్రొడక్షన్ డిజైనర్ చిన్నా, యాక్షన్ కొరియోగ్రాఫర్ పృథ్వీ మాస్టర్ ఉన్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.


