టెలికం సేవల సంస్థ వొడాఫోన్ ఐడియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో (క్యూ3) రూ.5,286 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నష్టం రూ.6,609 కోట్లతో పోల్చితే సుమారు 20 శాతానికి పైనే తగ్గింది. ఆదాయం ఇదే కాలంలో రూ.11,117 కోట్ల నుంచి రూ.11,323 కోట్లకు పెరిగింది.
ఒక్కో యూజర్ నుంచి సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) 7.3 శాతం పెరిగి రూ.186కు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.173గా ఉంది. కంపెనీ మొత్తం రుణ భారం రూ.2.09 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో బ్యాంక్‌లకు రూ.4,424 కోట్ల బకాయి పడగా, స్పెక్ట్రమ్‌కు సంబంధించి వాయిదా పడిన చెల్లింపులు రూ.1.24 లక్షల కోట్లు ఉన్నాయి.


