 
													నడిస్తే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప.. అని వైద్యులు పదే పదే చెవిన ఇల్లు కట్టుకుని చెబుతున్నారు. మరోవైపు కోవిడ్ తర్వాత శారీరక శ్రమ, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇవ్వడానికి నగరవాసులు ఆసక్తి కనబరుస్తున్నారు. మహమ్మారి సమయంలో ఎదురైన అనుభవాల రీత్యా.. వాకథాన్‌లపై క్రమంగా ఆసక్తి పెరుగుతోంది. దీంతో పార్కుల్లో వాకర్స్ మాత్రమే కాదు సుదూర ప్రాంతాలకు నడిచే వాకథానర్లు కూడా పెరుగుతున్నారు.
వీరి కోసం పలు కార్పొరేట్ సంస్థలు వాకథాన్ ఈవెంట్లను నిర్వహిస్తున్నాయి. ప్రజల నుంచి కూడా ఈ తరహా ఈవెంట్ల పట్ల ఆసక్తి పెరుగుతోంది. దీంతో పలు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్లు.. ఏదో ఒక ఈవెంట్‌కు అనుగుణంగానో, సామాజిక కార్యక్రమాలకు నిధుల సమీకరణ కోసమో హైదరాబాద్ నగరంలో ఇటువంటి వాకథాన్‌లు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. 
‘వాకథాన్‌లు’ – ‘వాకింగ్ మారథాన్‌ల’ సంక్షిప్త రూపం దేశవ్యాప్తంగా ఆరోగ్య ప్రియుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఫిట్నెస్, ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన రీత్యా ‘వాకథాన్‌లు’ బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. వాకథాన్‌లు నగర రోడ్లకే పరిమితం కాలేదు. చాముండి కొండలలోని అటవీ ట్రైల్స్, రాజస్థాన్‌లోని ఎడారి ప్రదేశాలతో సహా ప్రకృతి అందాల నడుమ ఇవి జరుగుతున్నాయి. సామాజిక ‘కారణాల’ కోసం నిధులను సమీకరించేందుకు నిర్వహించే వాకథాన్‌లు కూడా పెరిగాయి. 
ముంబైలో జరిగిన ‘చలో భారత్ వాకథాన్ 2025’లో 6,500 మందికి పైగా పాల్గొన్నారు. అవయవ దానం, రొమ్ము కేన్సర్ అవగాహన వన్యప్రాణుల సంరక్షణ వంటివి కూడా వాకథాన్‌లకు థీమ్స్‌గా మారుతున్నాయి. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ‘ఫిట్ ఇండియా‘ ఉద్యమం పెద్ద ఎత్తున వాకథాన్‌లను ప్రోత్సహించింది. గత 2020లో రాజస్థాన్‌లో 200కి.మీ ‘ఫిట్ ఇండియా వాకథాన్’ను నిర్వహించారు.
వ్యవస్థలూ.. వ్యక్తిగతంగానూ.. 
వాకథాన్‌లు కార్పొరేట్ ప్రపంచాన్ని సైతం ఆకర్షించడం ప్రారంభించాయి. థ్రిల్ జోన్ వంటి ప్రత్యేక ఈవెంట్ నిర్వాహకులు టౌన్ స్క్రిప్ట్ వంటి ఈవెంట్–బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లు దేశవ్యాప్తంగా ఎండ్యూరెన్స్ వాకింగ్ ఈవెంట్‌లను సృష్టిస్తున్నాయి. ప్రతి సంవత్సరం భారతదేశంలోని నగరాల్లో డజనుకు పైగా వాకథాన్‌లు జరుగుతున్నాయి. ‘మేం 2011–12లో బెంగళూరులో మా మొదటి ‘ట్రైల్‌వాకర్’ నిర్వహించినప్పుడు 320 మంది పాల్గొన్నారు. 
ప్రస్తుతం రెండు నగరాల్లో నిర్వహిస్తుంటే ప్రతి సంవత్సరం 1600 మందికి పైగా పాల్గొంటున్నారు’ అని ఆక్స్‌ఫామ్ ఇండియా సీఈఓ అమితాబ్ బెహర్ చెప్పారు. మరోవైపు వ్యక్తిగతంగానూ రికార్డు స్థాయి నడకలతో గుర్తింపు పొందారు. కోయంబత్తూరుకు చెందిన నటరాజ్ 2021– 2023 మధ్య 798 రోజుల్లో 6,614 కి.మీ నడిచి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కారు. 2024లో పర్యావరణ అవగాహన పెంచడానికి విరాగ్ మధుమాలతి నవీ ముంబై నుంచి రాజస్థాన్ వరకూ 1,305 కి.మీ. నడిచి ప్రపంచ రికార్డును నెలకొల్పారు.
కొంకణ్ ట్రయల్ నిర్వహిస్తున్నాం.. 
‘గతంలో పలు మార్లు వాకథాన్, మారథాన్‌లలో పాల్గొన్న అనుభవం ఉంది. ప్రస్తుతం పుణె సమీపంలోని అందమైన గ్రామాలు, చిన్న చిన్న పట్టణాలు, చెరువులు, వాగులు, వంకలు, ఘాట్‌లు.. ఇంకా అనేక ప్రకృతి సౌందర్యాల నడుమ కొంకణ్ ట్రయల్  వాకథాన్ నిర్వహిస్తున్నాం’ అని గ్రీన్ ట్రయిల్ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. తమ వాకథాన్‌ను నగరానికి పరిచయం చేసిన సందర్భంగా వీరు తమ ఈవెంట్ వివరాలు వెల్లడించారు. 
విభిన్న రంగాల్లో సేవలు అందిస్తున్న వ్యాయామ, ఆరోగ్య ప్రియులమైన తామంతా కలిసి ఈ వేదికను స్థాపించామన్నారు. ఈ ఈవెంట్‌లో పాల్గొనేవారు 100 కి.మీ దూరాన్ని 50 గంటల్లో, 50 కి.మీ దూరాన్ని 25 గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. కనీసం ఇద్దరు నుంచి నలుగురు టీమ్‌గా పాల్గొంటారు. తమ వాకథాన్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌తో పాటు బెంగళూర్, ముంబై, పుణె తదితర నగరాల నుంచి వాకర్స్ ఉత్సాహం చూపిస్తున్నారన్నారు.
బహుళ వాకథాన్‌లు.. 
బహుళ వాకథాన్‌లు చేసిన వారు 100 కి.మీ ట్రయల్‌ను పూర్తి చేయడానికి 32 గంటలకు పైగా సమయం గడుపుతారు. వారు ప్రతి 15–20 కి.మీ తర్వాత చిన్న విరామాలు తీసుకుంటూ నడుస్తారు. మొదటి 50 కి.మీలు పూర్తి చేసిన తర్వాత దాదాపు రెండు గంటల పాటు ఒక దీర్ఘ విరామం తీసుకుంటారు. ఒక వ్యక్తి 100 కిలోమీటర్లు పూర్తి చేయడానికి కనీసం 1.5 లక్షల అడుగులు వేస్తాడు. చివరి 100 అడుగులు అత్యంత కష్టతరమైనదని వాక్‌థానర్లు అంటున్నారు. 
ఓపికకు పరీక్ష.. 
‘వాకథాన్‌లు స్టామినాను, ఓపికను పరీక్షిస్తాయి.. మొదటి 10 కి.మీ. సరదాగా ఉంటుంది. కానీ తర్వాత నుంచి కష్టం మొదలవుతుంది’ అని వాకథాన్ ప్రియుడు ఇష్మీత్ సింగ్ చెప్పారు. ‘మారథాన్ 2–3 గంటల్లో ముగుస్తుందని ముందే తెలుస్తుంది. దానికి అనుగుణంగా శిక్షణ పొందినట్లయితే, దానిని పూర్తి చేయగలం. 
కానీ వాకథాన్‌ల కోసం చాలా దృఢసంకల్పం అవసరం’ అని సింగ్ అంటున్నారు. ఆయన తన చివరి 100 కి.మీ వాకథాన్‌ను 32 గంటల్లో పూర్తి చేశారు. వాకథాన్ శిక్షణలో భాగంగా రోజువారీ సెషన్‌లు, పోషకాహారం వంటివి సూచిస్తారు.. అమెచ్యూర్ వాకథానర్లు ఒకేసారి 25–30 కి.మీ లను కవర్ చేసే వారాంతపు నడకలతో ప్రారంభిస్తారు. వీరు నగర రోడ్లు, గ్రామ దారులు, పగలు, రాత్రి వేళల్లో, అలాగే అన్ని రకాల భూభాగాల్లో నడవడానికి అవకాశం పొందుతారు. ఇది గొప్ప అనుభవం అని వాకథానర్లు అంటున్నారు.
(చదవండి: అక్కాచెల్లెళ్లు నలుగురికి అరుదైన వ్యాధి..! విస్తుపోయిన వైద్యులు)

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
