అది చైనాలోని ఒక నగరం. అందులో ఓ హై–రైజ్ అపార్ట్‌మెంట్‌లోని 10వ అంతస్తు.. అకస్మాత్తుగా ఓ మహిళ బాల్కనీ నుంచి వేలాడటం కనిపించింది. అది చూసినవారంతా హడలిపోయారు. చెమటలు పట్టించిన ఈ దృశ్యం వెనుక కథ తెలిసి ముక్కున వేలేసుకున్నారు. ఒక వ్యక్తి భార్య లేని సమయంలో.. అతని ఇంటికి ప్రియురాలు వెళ్లింది. వారిద్దరూ ఇంట్లో ఉన్న సమయంలో.. భార్య హఠాత్తుగా ఇంటికి తిరిగి వచ్చేసింది.
దీంతో భయపడిన ఆ వ్యక్తి.. తన ప్రియురాలిని దాచిపెట్టే ప్రయత్నంలో ఆమెను బాల్కనీలోకి నెట్టేశాడు. పది అంతస్తుల ఎత్తులో ఆ మహిళ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వేలాడటం మొదలుపెట్టింది. అది చుట్టుపక్కల వారు గమనించారు, పట్టు కోల్పోకుండా నిలబడటానికి ఆమె విఫలయత్నం చేసింది. ఇది గమనించిన వారు అరుపులతో, ఆందోళనతో గంటల తరబడి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు. తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంట్లో ప్రియుడు.. బయట ప్రియురాలు
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలో, ఫ్లాట్ లోపల ఉన్న ప్రియుడు.. కిటికీలోంచి ప్రియురాలితో ఏదో మాట్లాడటం కనిపించింది. ఇంతకీ ఆమె వేలాడటానికి కారణం ఏంటంటే... ఆ మహిళ ప్రియుడి భార్యకు దొరక్కుండా దాక్కోవడానికి ప్రయతి్నంచడమే.. తన భార్య రాగానే ప్రియుడు ఆ మహిళను హడావిడిగా బాల్కనీ వైపు నెట్టేశాడని, దాక్కోవాలని సూచించాడని స్థానిక మీడియా పేర్కొంది. పరువు పోతుందనే భయం.. ఆమెను చావు అంచుల్లోకి నెట్టింది. ప్రాణభయంతో వణికిపోతున్న ఆ మహిళ చేతిలో ఫోన్ పట్టుకునే ఉంది. ఏం చేయాలో తోచక, చివరికి బలం తెచ్చుకుని.. డ్రైన్‌పైప్‌లను, కిటికీ అంచులను పట్టుకుని ధైర్యంగా కిందకు దిగడం ప్రారంభించింది.
పక్కింట్లో ఆపద్బంధువు!
భవనం పక్క గోడకు వేలాడుతూ, అతి కష్టం మీద ఓ వాటర్ పైప్ పట్టుకుని పక్క ఫ్లాట్ కిటికీ వైపు ఆమె జారింది. పక్క ఫ్లాట్ యజమాని కిటికీ తట్టగా.. చివరకు ఆ ఆపద్బాంధవుడు ఆమెను లోపలికి సురక్షితంగా లాగాడు. ఎట్టకేలకు ప్రాణాలను దక్కించుకున్నా.. ఈ సంఘటన మాత్రం ఆమె పరువును, ప్రియుడి పరువును నిలువునా బజారున పడేసింది.
– సాక్షి, నేషనల్ డెస్క్


