టైమ్ మేగజైన్ వెల్లడి
న్యూయార్క్: ఏఐ. కృత్రిమ మేధ. కొన్నేళ్లుగా ప్రపంచాన్నే ఏలుతున్న సరికొత్త సాంకేతిక విప్లవం. దాని రూపకల్పనలో శ్రమించిన వారందరికీ సమష్టిగా ప్రఖ్యాత టైమ్ మేగజైన్ 2025 పర్సన్ ఆఫ్ ద ఇయర్ గౌరవం దక్కింది. గురువారం ఒక ప్రకటనలో మేగజైన్ ఈ మేరకు వెల్లడించింది. కృత్రిమ మేధ ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేని రీతిలో సింహగర్జన చేసిన ఏడాదిగా 2025ను అభివర్ణించింది.
‘సొంతంగా ఆలోచించే యంత్రాలు మొదలుకుని ఒకప్పుడు అసాధ్యమని భావించిన వాటన్నింటినీ సుసాధ్యం చేస్తున్న సాంకేతిక అద్భుతం ఏఐ. దాన్ని స్వప్నించి, శ్రమించి చివరికి సాధించిన వ్యక్తులందరూ 2025కు గాను పర్సన్ ఆఫ్ ద ఇయర్ పురస్కారానికి అర్హులే‘ అని పేర్కొంది. ’వ్యక్తులు మాత్రమే కాదు, సంస్థలు, కాన్సెప్టులను కూడా ఈ పురస్కారానికి ఎంపిక చేశాం’ అని టైమ్ మేగజైన్ ఎడిటర్ ఇన్ చీఫ్ సామ్ జాకబ్స్ వివరించారు.


