ముంచుకురానున్న భారీ హిమకంపం
జపాన్ భూకంపమే సూచిక!
హిమాలయాలు ప్రస్తుతం నివురుగప్పిన నిప్పేనా? మంచుకొండల్లో పెను విలయం తప్పదా? అది కూడా అతి త్వరలోనే ముంచుకురానుందా? ఆ ఆస్కారం చాలానే ఉందని చెబుతున్నారు సైంటిస్టులు. ఏకంగా 7.6 తీవ్రతతో జపాన్ ను తాజాగా వణికించిన లేను భూకంపం ఇందుకు సూచికేనని అని వారు అభిప్రాయపడుతున్నారు. రానున్న ఉత్పాతాన్ని ఇప్పటి నుంచే ’గ్రేట్ హిమాలయన్ ఎర్త్ క్వేక్’ గా పిలిచేస్తున్నారు కూడా!
పేలనున్న మందుపాతర!
జపాన్ భూకంపం వంటి ప్రాకృతిక విలయాలకు ఆస్కారం అత్యంత ఎక్కువగా ఉండే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ మీద ఉన్న విషయం తెలిసిందే. దాంతో అక్కడ జనానికి ఈ విపత్తులు, ముఖ్యంగా భూకంపాలతో సహజీవనం పరిపాటిగా మారింది. త్వరలో హిమాలయాల్లో కూడా అదే పరిస్థితి తలెత్తేలా ఉందన్నది భూ భౌతిక శాస్త్రవేత్తల ఆందోళన. హిమాలయ ప్రాంతాన్ని ఏ క్షణంలోనైనా పేలనున్న మందుపాతరగా వాళ్లు అభివరి్ణస్తున్నారు. హిమాలయాల అడుగున టెక్టానిక్ ప్లేట్ల కుమ్ములాటే ఇందుకు ప్రధాన కారణం.
ఎందుకంటే అక్కడ ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ నిరంతరం యురేషియన్ ప్లేట్ ను ఢీకొడుతూ వస్తోంది. దాంతో కొన్ని సహస్రాబ్దాలుగా ఆ ప్రాంతమంతటా భూగర్భంలో విపరీతమైన ఒత్తిడి నెలకొని ఉంది. అది ఎప్పుడో ఒకప్పుడు అతి భారీ పరిమాణంలో విడుదలవడం ఖాయమన్నది సైంటిస్టుల మాట. ‘అదే జరిగితే రిక్టర్ స్కేలుపై ఏకంగా 8, లేదా అంతకు మించిన తీవ్రతతో భూమి కంపిస్తుంది. దాని ప్రభావానికి మొత్తం ఉత్తర భారతమే గాక నేపాల్, ఇరుగుపొరుగు దేశాలు కూడా కనీవినీ ఎరగనంతటి స్థాయిలో భారీ ప్రాణ, ఆస్తి నష్టాలను చవిచూడాల్సి రావచ్చు‘ అని వారు హెచ్చరిస్తున్నారు.
చరిత్రే సాక్షి
హిమాలయాలకు భూకంపాలు, అందులోనూ భారీ ప్రకంపాలు నిజానికి కొత్తేమీ కాదు. 1934లో ఏకంగా 8 తీవ్రతతో సంభవించిన భూకంపం బిహార్ మీదుగా నేపాల్ దాకా ఉత్పాతం సృష్టించింది. ఇటీవలి చరిత్ర చూసుకున్నా, 2015లో నేపాల్‌లోని హిమ సానువుల్లో 7.8 తీవ్రతతో వచి్చన భూకంపం అక్కడ భారీ జన, ఆస్తి నష్టాలకు కారణమైంది. అయితే హిమాలయాల్లో భూకంపం వచ్చేస్తుందని ఆందోళన అక్కర్లేదన్నది నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ డైరెక్టర్ డాక్టర్ ఓం ప్రకాశ్ మిశ్రా మాట. ‘హిమాలయాల్లో సైంటిస్టులు చెబుతున్నట్టు ప్రాకృతిక ఉత్పాతమేదీ రాబోదు.
నిజానికి ఎన్నెన్నో ఉత్పాతాల నుంచి దేశాన్ని కాపాడుతున్న పెట్టని కోట మన హిమ సానువులు. భూ పలకల ఒరిపిడి విలయానికి దారి తీస్తుందని బెంబేలు పడాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఆ ఒరిపిడి తాలూకు ఒత్తిడి 2.5 నుంచి 3.5 తీవ్రతతో కూడిన భూకంపాల రూపంలో ఎప్పటికప్పుడు విడుదలవుతూనే ఉంది. కనుక గ్రేడ్ హిమాలయన్ ఎర్త్ క్వేక్ గురించి మరీ ఆందోళన పనిలేదు‘ అని చెప్పుకొచ్చారాయన. కానీ ఎవరెన్ని చెప్పినా సమీప కాలంలో భారీ భూకంపానికి హిమ సానువులు సిద్ధమవుతున్నాయన్నదే మెజారిటీ శాస్త్రవేత్తల అభిప్రాయం.
బీఐఎస్ దీ అదే మాట
ఇటీవల జరిగిన దేశ భూకంప రిస్కు జోన్ల మ్యాపింగ్ కూడా మెజారిటీ శాస్త్రవేత్తల అభిప్రాయాయాన్నే బలపరుస్తుండటం విశేషం. అందులో భాగంగా భూకంప జోన్ రూపురేఖలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) తాజాగా సవరించింది. అత్యధిక రిసు్కతో కూడిన జోన్ 6 ను కొత్తగా ఏర్పాటు చేయడమే గాక హిమాలయ ప్రాంతమంతటినీ దాని పరిధిలోనే చేర్చింది! ఇవన్నీ మంచు కొండల్లో ముంచుకు రాగల పెను ముప్పు ముందస్తు సూచికలేనని చెబుతున్నారు.


