న్యూఢిల్లీ: పాకిస్తాన్-చైనా నేతృత్వంలోని కొత్త ప్రాంతీయ కూటమిలో చేరేందుకు బంగ్లాదేశ్ అమితమైన ఆసక్తి చూపిస్తున్నదనే వార్తలు ఇటీవలి కాలంలో విరివిగా వినిపిస్తున్నాయి. ఇది దక్షిణాసియాలో కీలక వ్యూహాత్మక మార్పును సూచిస్తున్నది. భారతదేశం లేకుండా, పాకిస్తాన్‌తో కలిసి ప్రాంతీయ కూటమిలో చేరడం బంగ్లాదేశ్‌కు వ్యూహాత్మకంగా సాధ్యమే అని బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారు తౌహిద్ హుస్సేన్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఢాకా, బీజింగ్, ఇస్లామాబాద్‌లతో కూడిన కొత్త త్రైపాక్షిక సమూహంపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ సూచన చేసిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వచ్చింది.
యూనస్ తాత్కాలిక ప్రభుత్వ సారధ్యంలో..
2024ఆగస్టులో షేక్ హసీనా పదవీచ్యుతి అనంతరం పాకిస్తాన్-బంగ్లాదేశ్ సంబంధాలు వాణిజ్యం, రక్షణ, మౌలిక సదుపాయాల రంగాలలో విస్తరిస్తూ వస్తున్నాయి. ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వ సారధ్యంలో ఈ రెండు దేశాల మధ్య సహకారం పెరుగుతోంది. గతంలో షేక్ హసీనా ప్రభుత్వం.. న్యూఢిల్లీ, బీజింగ్, వాషింగ్టన్‌లను నొప్పించకుండా సమతుల్య సంబంధాలను చాకచక్యంగా కొనసాగించింది. నాడు భారతదేశం ఒక కీలక భాగస్వామిగా ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితులలో ఢాకా.. ఇస్లామాబాద్, బీజింగ్ వైపు మొగ్గు చూపుతూ, భారత్‌తో సమతుల్య భాగస్వామ్యాన్ని కోల్పోయింది.
చైనాలోని కున్మింగ్‌లో మంతనాలు
ఈ ప్రాంతీయ కూటమి చర్చలు గత ఏడాది నుండి వేగం అందుకున్నాయి. గత జూన్‌లో చైనా, బంగ్లాదేశ్,పాకిస్తాన్‌లు చైనాలోని కున్మింగ్‌లో తమ మొదటి అధికారిక త్రైపాక్షిక సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడి, మౌలిక సదుపాయాలు , రుణ నిర్వహణలో సహకారాన్ని పెంపొందించేందుకు మూడు పక్షాలు అంగీకారం కుదుర్చుకున్నాయి. మరోవైపు పాకిస్తాన్ తాజాగా భారతదేశాన్ని మినహాయించి, చైనాను భాగస్వామిగా చేర్చుకుంటూ, విస్తృతమైన దక్షిణాసియా కూటమిని ప్రతిపాదిస్తున్నది. ఈ నేపధ్యంలో ఇస్లామాబాద్- బీజింగ్ మధ్య ఈ అంశంపై చర్చలు జరిగాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
‘త్రైపాక్షిక సంబంధం’తో కొత్త చిక్కులు?
భారతదేశం కీలక సభ్యురాలిగా ఉన్న సార్క్ (SAARC) స్థానంలో కొత్త ప్రాంతీయ కూటమిని సృష్టించేందుకు పాకిస్తాన్- చైనాలు పనిచేస్తున్నాయనే వార్తలు కూడా కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ వ్యూహాత్మక కూటమి ఏర్పాటు దక్షిణాసియాలో చైనాకు పెరుగుతున్న ఆధిపత్యాన్ని స్పష్టంగా సూచిస్తున్నది. భారతదేశాన్ని మినహాయించి, చైనాను భాగస్వామిగా చేర్చుకుంటూ పాకిస్తాన్ ప్రతిపాదిస్తున్న ఈ కూటమి, కొత్త భౌగోళిక రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది.ఈ అభివృద్ధి చెందుతున్న త్రైపాక్షిక సంబంధం (బంగ్లాదేశ్-చైనా-పాకిస్తాన్) ప్రాంతీయ దౌత్యానికి, భవిష్యత్తులో దక్షిణాసియా కూటమికి చిక్కులను తీసుకువచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: Tamil Nadu: విజయ్-రంగస్వామి మెగా ప్లాన్..


