‘‘ఆయనది చాలా క్రిటికల్ కండిషన్ అట!’’... ఒకరికి చాలా సీరియస్‌గా ఉన్నప్పుడు చాలామంది ఈ మాట వాడుతుంటారు. కార్డియాలజీ, న్యూరాలజీ... ఇలాంటి అనేక విభాగాల్లాగే ‘క్రిటికల్ కేర్’ అనేది కూడా ఒక విభాగం. కాకపోతే కార్డియాలజీ, న్యూరాలజీలతో పాటు ఇలాంటి అన్ని విభాగాల వారికీ చికిత్స అందించే అత్యంత కీలక విభాగమిది. అయితే... వైద్యశాస్త్ర పరిజ్ఞానం ఉన్న కొందరు తప్ప... చాలామంది క్రిటికల్ కేర్‌నూ, ఎమర్జెన్సీ విభాగాన్నీ ఒకటే అనుకుంటారు. కానీ అది సరికాదు. కానీ... క్రిటికల్ కేర్ అన్నా లేదా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అన్నా దాదాపుగా ఒకటే. కాకపోతే కార్డియాలజీ, న్యూరాలజీలకు ప్రత్యేకంగా ఐసీసీయూ (ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ యూనిట్), ఎన్‌ఐసీయూ (న్యూరో ఇంటెన్సివ్ కేర్ యూనిట్) ఇలా చాలా పెద్ద పెద్ద హాస్పిటళ్లలో వేర్వేరు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు ఉండవచ్చు. కానీ ఓ మోస్తరు పెద్ద హాస్పిటల్స్‌లో ఒకే ఐసీయూ ఉంటుంది. క్రిటికల్ పరిస్థితుల్లో ఉండే బాధితులకు ఈ క్రిటికల్ కేర్ యూనిట్స్‌లో అందే చికిత్సలూ, అందజేసే నిపుణులైన డాక్టర్లు... ఆ క్రిటికల్ కేర్ ప్రత్యేకతలేమిటో చూద్దాం.
క్రిటికల్ కేర్, ఎమర్జెన్సీ కేర్ ఒకటి కాదు. ఎమర్జెన్సీ అంటే... ఏదైనా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న బాధితులప్రాణాలు నిలిపేందుకు కొద్దిసేపు మాత్రమే అక్కడ ఉంచి చికిత్స అందించి... ఇకప్రాణాలు నిలుస్తాయన్న తర్వాత క్రిటికల్ కేర్ / ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించి అక్కడ మాత్రం చాలా సేపు ఉంచి చికిత్స అందించి, ఒక వార్డుకు లేదా రూమ్‌కు తరలించి చికిత్స అందిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎమర్జెన్సీ కొద్ది కాలం... క్రిటికల్ కేర్‌లో కాస్తంత ఎక్కువ కాలం చికిత్స అందిస్తారు.
క్రిటికల్ కేర్‌కూ, ఎమర్జెన్సీకీ ఇదీ తేడా...
మనకు తేలిగ్గా అర్థమయ్యేందుకు ఒక ఉదాహరణ చెప్పుకుందాం. విషం తీసుకున్న ఒక వ్యక్తిని ఎమర్జెన్సీకి తీసుకురాగానే... ఒక సెకండ్‌లోని చాలా సూక్ష్మమైన భాగం అంటే క్షణాల్లోనే గొంతులోకి పైప్ వేయగలంత సమర్థులు ఎమర్జెన్సీలో ఉంటారు. అలా ఆ గొట్టం ద్వారా కడుపులో ఉన్న విషాన్ని బయటకు తీసుకువస్తారు. అలాగే ఓ రోడ్డు యాక్సిడెంటు లేదా ఇతరత్రా ప్రమాదాలకు గురైనవారినీ (ట్రామా కేసు) లేదా గుండెపోటు వచ్చినా, పక్షవాతానికి గురైనా... తక్షణప్రాణాపాయం ఉన్నవారికి... తక్షణ వైద్యసేవ అందాల్సిన అవసరం ఉన్న వ్యక్తికి... ఆ తక్షణ చికిత్స అందేలా చేసేదే ఎమర్జెన్సీ వార్డు.
ఇక అలా ఎమర్జెన్సీ చికిత్స అందిన తర్వాత... అప్పటికప్పుడు వచ్చే ప్రమాదం తప్పినప్పటికీ... తక్షణ అవసరం పెద్దగా ఏదీ లేకపోయినా... పూర్తి ప్రమాదం ఇంకా ఉండనే ఉందనీ, కొంతకాలం పాటు చాలా అప్రమత్తంగా చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలిశాక... అంతటి అప్రమత్తతతో పేషెంట్స్‌ను చూసుకునే విభాగమే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లేదా క్రిటికల్ కేర్ యూనిట్. ఎమర్జెన్సీలో ఉండే అన్ని రకాల అప్రమత్తమైన సేవలూ క్రిటికల్ కేర్‌లో ఉన్నప్పటికీ... ఇక్కడ పేషెంట్‌ను ఎమర్జెన్సీ వార్డులో కంటే ఎక్కువ సేపు ఉంచి చికిత్స అందిస్తారు.
కొన్ని దేశాల్లో దీన్ని ‘క్రిటికల్ కేర్ విభాగం’ అంటారు. మరికొన్ని చోట్ల దీన్నే ‘ఇంటెన్సివ్ కేర్ విభాగం’ అంటారు. పేరు ఏదైనప్పటికీ... అక్కడి డాక్టర్లు, వైద్య సిబ్బంది అనునిత్యం అప్రమత్తంగా ఉంటారు. ఇందుకోసం క్రిటికల్ కేర్ డాక్టర్లు ప్రత్యేక శిక్షణ పొంది ఉంటారు. పేషెంట్ జీవితాన్ని కాపాడాటానికి రోజులోని 24 గంటలూ అంతే సావధానంగా ఉంటారు. అందుకే వీళ్లను ఇంటెన్సివిస్ట్స్ అని కూడా అంటారు.
ఇక్కడి పేషెంట్స్ ఎవరంటే...?
తక్షణ చికిత్స అందక అలాగే వదిలేస్తే కొద్ది క్షణాల్లోనేప్రాణాపాయం సంభవించగల అవకాశం ఉన్న పేషెంట్స్‌ను క్రిటికల్ కేర్ యూనిట్‌కు తరలిస్తారు. అత్యవసరంగా వైద్యసేవలు అవసరమైన రోగులు ఆసుపత్రిలో తొలుత వచ్చే ప్రదేశమిది. సాధారణంగా గుండెపోటు, పక్షవాతం, ఏదైనా రోడ్డు / వాహన / రైలు ప్రమాదానికి గురైనవారు, అగ్నిప్రమాదాల బారిన పడ్డవారు, పాము లేదా తేలు కాటుకు గురైనవారు, విషం తాగినవారు, ఏదైనా ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్‌కు గురై తక్షణ చికిత్స అవసరమైనవారు... ఇలాంటి కేసులను క్రిటికల్ కేర్ యూనిట్‌కు తరలిస్తారు.
అన్ని విభాగాలలోనూ నిష్ణాతులు... క్రిటికల్ కేర్ ఇంటెన్సివిస్టులు
ఒక పేషెంట్స్‌కు... ఏ ప్రత్యేకమైన దేహభాగం లేదా అవయవానికి (గుండె లేదా మెదడు... ఇలా) లేదా ఓ వ్యవస్థకు (కార్డియాలజీ / న్యూరాలజీ / గ్యాస్ట్రో ఎంటరాలజీ వ్యవస్థ) ఎలాంటి వైద్యచికిత్స అవసరమో... ఆ డాక్టర్‌తో పాటు మిగతా అనుబంధ విభాగాలలోని ఆ డాక్టర్ల బృందమంతా వెంటనే పేషెంట్‌కు చికిత్స అందించడం మొదలుపెడతారు. ఉదాహరణకు ఒక వ్యక్తి రోడ్డు యాక్సిడెంట్‌కు లోనైనప్పుడు మొదట తలకు దెబ్బతగిలి ఉండే న్యూరో సర్జన్‌తో పాటు ఎముకలకు ఏదైనా హాని జరిగిందేమోనంటూ ఆర్థోపెడిక్ సర్జన్... అలాగే ఆ దెబ్బ తగిలిన చోటును బట్టి రక్తప్రసరణ వ్యవస్థకు ఏదైనా విఘాతం కలిగితే దానికి సంబంధించిన నిపుణులు... ఇలా అవసరాన్ని బట్టి ప్రధాన వైద్య నిపుణులతో బాటూ ఇతర నిపుణులూ కలిసి పనిచేసి పేషెంట్‌ను రక్షించడానికి ప్రయత్నిస్తారు. అలా మొదటగా అతడిలోని జీవక్రియలకు సంబంధించిన వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేసేలా చూస్తారు.
ఇలాంటి పత్యేక శిక్షణ పొందిన వైద్యులను
‘ఇంటెన్సివిస్ట్స్’ అంటారు. అంటే వాళ్ల చికిత్స చాలా కేంద్రీకృతంగా, తక్షణం పేషెంట్‌ప్రాణాలను రక్షించడం కోసమే అయి ఉంటుంది. ఈ ఇంటెన్సివిస్ట్‌లందరూ కేవలం ఒక నిర్ణీతమైన దేహవ్యవస్థా లేదా ఓ నిర్దిష్టమైన అవయవం విషయంలోనే కాకుండా... పూర్తిగా అన్ని శారీరక దేహ వ్యవస్థలూ (అంటే నాడీ, జీర్ణ, రక్తప్రసరణ, గుండె ఇలా అన్ని రకాల వ్యవస్థలూ), దేహభాగాలూ / అవయవాలన్నింటిపైనా మంచి పట్టు, వాటి చికిత్సల్లో అద్భుతమైన నైపుణ్యంగలవారిగా ఉంటారు.
గతం కంటే ఇప్పుడు మరిన్ని నైపుణ్యాలతోనూ ఇంకింత ప్రత్యేకంగా...
దాదాపుగా గత మూడు శతాబ్దాల క్రితం అన్ని రంగాలకు చెందిన వైద్యులంతా ఈ ఇంటెన్సివ్ కేర్ యూనిట్/క్రిటికల్ కేర్ విభాగంలో ఉండేవారు. అన్ని రకాల సేవలూ అక్కడే దొరికేవి. కానీ ఇప్పుడు ఆధునిక యుగంలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు / క్రిటికల్ కేర్ యూనిట్ల పనితీరు పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు వైద్యరంగంలో వచ్చిన ఆధునిక వైద్య పరిజ్ఞానం, అత్యున్నతమైన సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత... పేషెంట్లను ఉంచే ప్రదేశాలూ, అక్కడి వసతులు అన్నీ ప్రత్యేకంగా మారాయి. ఉదాహరణకు... శ్వాస తీసుకోలేని రోగులకు కృత్రిమశ్వాస అందించేందుకు వెంటిలేటర్లు, పేషెంట్స్‌కు సంబంధించిన అన్ని రకాల కీలకమైన రీడింగ్స్‌ను తీసుకునే అత్యున్నత స్థాయి పరిజ్ఞానం కలిగిన సున్నితమైన (ప్రెసిషన్‌గా పనిచేసే సెన్సిటివిటీ ఎక్కువగా ఉండే) పరికరాలు, మూత్రపిండాలు విఫలమైన సందర్భాల్లో కృత్రిమంగా దేహంలో లేదా రక్తంలోని మలినాలన్నింటినీ తొలగించే డయాలసిస్ యంత్రాలు... ఇలా ఎన్నో కీలకమైన ఉపకరణాలన్నీ ఏ రంగానికి కావాల్సినవి ఆ రంగాలకు చెందిన ప్రత్యేక ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో ఇప్పుడు అమర్చి ఉంచుతున్నారు.
అన్నింటా పురోగతితో పాటు అత్యవసర వైద్యసేవల్లో కూడా...
ఇప్పటితో పోలిస్తే కొద్ది కాలం కిందట వైద్యచికిత్సలు ఇప్పటికంటే కాస్త నింపాదిగా, కాస్తంత మెల్లగా సాగేవి. అందుకే ఒకప్పటి తీవ్రమైన జబ్బులకూ శానిటోరియమ్‌ల తరహాలోనే ఆసుపత్రులు ఉండేవి. అత్యవసరంగా వైద్యసేవలు అందించాల్సిన చాలా సందర్భాలలో పేషెంట్లు చనిపోవడం లాంటి దుర్ఘటనలే ఎక్కువగా చోటుచేసుకునేవి. కానీ ఇప్పుడు ఆధునిక వైద్య చికిత్స ప్రక్రియల్లో గణనీయమైన పురోగతి రావడంతో ఈ చికిత్స అందించే క్రమంలోనూ విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. అంటే ఎంత వేగంగా హాస్పిటల్‌కు తీసుకొస్తే అంతటి ఉత్తమమైన / వేగవంతమైన చికిత్స అందేలాగా... దానికి అనుగుణంగానే ప్రభావాలు (రిజల్ట్స్) కనిపించేలా పరిస్థితులు మారిపోయాయి.
ఉదాహరణకు... పెను ప్రమాదాలేవైనా సంభవించినప్పుడు... అది జరిగిన మొదటి అరగంటలోనే పేషెంట్స్‌ను తీసుకువస్తే... ఆ వ్యవధిని ΄్లాటినమ్ మొమెంట్స్ అని,ప్రాణాపాయాన్ని తప్పించగల అవకాశాలు పుష్కలంగా ఉంటాయని, రెండో అరగంటను గోల్డెన్ మొమెంట్స్ అని, ఆ తర్వాతి క్షణాలను సిల్వర్ మొమెంట్స్... అంటూ అభివర్ణిస్తున్నారు. అంటే గోల్డెన్ మొమెంట్స్‌లోప్రాణాపాయాన్ని తప్పించడానికి మంచి అవకాశం ఉండగా... ఆ తర్వాతి క్షణాల్లో ఒక మోస్తరు అవకాశాలుంటాయని... ఇలా ప్రమాదమైనా, గుండెపోటు, పక్షవాతం లాంటి ఆరోగ్య పెనుముప్పులనైనా తప్పించే అవకాశం ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది.
దీనికి తోడు అన్ని విభాగాల్లోనూ సూపర్‌స్పెషాలిటీలు, అందులోనూ మళ్లీ సబ్‌స్పెషాలిటీలు రావడం మొదలైంది. ఈ మార్పుకు తగినట్లుగానే క్రిటికల్ కేర్ యూనిట్లు సైతం తమ తమ విభాగాల్లో ఇంకా ప్రత్యేకతలను సంతరించుకోవడం మొదలుపెట్టాయి. అత్యాధునిక ఉపకరణాలు,ప్రాణాలను కాపాడేందుకు కొత్త కొత్త అత్యాధునిక వైద్యసేవలు ఆవిష్కృతమవుతున్నాయి. ఈ యూనిట్లలోకి కొత్త పరికరాలు వస్తున్నాయి. ఇక్కడ పనిచేసే వైద్యులు సైతం పీజీ (ఎం.డి.) తర్వాత ఇంకా మళ్లీ క్రిటికల్ కేర్ మెడిసిన్ అనే ప్రత్యేక విద్యార్హత / ప్రత్యే శిక్షణ పొందాల్సి ఉంటుంది.
ఇక్కడి నిపుణుల ప్రత్యేకత ఏమిటంటే...
ఏదైనా ఒక అవయవానికి ఓ వ్యాధి వచ్చిందనుకోండి. తొలుత అది ఆ అవయవానికే పరిమితమవుతుంది. కొంతకాలం తర్వాత అది మరింతగా తీవ్రమైతే ΄÷రుగునే ఉన్న అవయవాలకూ లేదా దానితో సంబంధం ఉన్న అవయవాలకూ, సంబంధిత వ్యవస్థలకూ విస్తరిస్తుంది లేదా వాటిపై తన ప్రతికూలతలను చూపుతుంది. ఉదాహరణకు... గుండెపోటుతో గుండె కండరం విఫలం కావడం మొదలైతే... అది కేవలం గుండెకే పరిమితం కాకుండా... రక్తసరఫరా సరిగా జరగకపోవడంతో మెదడుకు కూడా రక్తం అందకపోవడం, దాని పనితీరూ ప్రభావితం కావడం జరుగుతాయి. మెదడు అన్ని కీలక అవయవాలను నియంత్రిస్తుంటుంది కాబట్టి దాని అధీనంలో ఉండే అన్ని అవయవాలూ చచ్చుబడిపోయేందుకు అవకాశాలు పెరుగతాయి.
ఒకవేళ మెదడులో రక్తస్రావం అయి, గుండెను నియంత్రించే కేంద్రంపై దాని ప్రభావం పడితే గుండెనూ ప్రభావితం చేస్తుంది. అందుకే క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఉన్నప్పుడు వ్యాధి సోకిన అవయవం గాకుండా... దాని వల్ల ప్రభావితమైన అవయవాలూ పనిచేయకుండా పోయే కండిషన్‌ను ‘మల్టీ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్’ అంటారు. ఇక అన్ని అవయవాలూ పూర్తిగా విఫలమైతే దాన్ని ‘మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్’గా చెబుతారు. ఇలాంటి పరిస్థితి రాకుండా క్రిటికల్ కేర్ యూనిట్‌లోని డాక్టర్లందరూ నిరంతరం శ్రమిస్తుంటారు. అందుకే క్రిటికల్ కేర్ యూనిట్‌లో పనిచేసే వైద్యులకు కేవలం ఒక ప్రత్యేకమైన అవయవానికి సంబంధించిన పరిజ్ఞానమో లేదా ఒక వ్యవస్థకు చెందిన పరిజ్ఞానమో కాకుండా... శరీరంలోని అన్ని అవయవాలకు సంబంధించిన సంపూర్ణ పరిజ్ఞానం ఉండేలా శిక్షణ పొందుతారన్నమాట. అందుకోసం ప్రత్యేకంగా క్రిటికల్ కేర్ మెడిసిన్ (సీసీఎమ్) అనే విభాగమే రూపొందింది. వీళ్ల నేతృత్వంలోనే అత్యంత సంక్లిష్టమైనప్రాణాపాయాన్ని నివారించే విధులు నిర్వర్తించే కీలకమైన పనులు జరుగుతుంటాయి.
ఉదాహరణకు ఒక కేస్ స్టడీ...
ఒక వ్యక్తికి నిమోనియా సోకిందనుకుందాం. నిజానికి నిమోనియా లంగ్స్‌కు సంబంధించిన సమస్య. దేహంలోని ఎన్నో వ్యవస్థల్లో ‘శ్వాసకోశ వ్యవస్థ’ ఒకటి. నిమోనియా ఆ వ్యవస్థ కిందికి వస్తుంది. సాధారణంగా నిమోనియా చికిత్స కోసం యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందిస్తే చాలు. కానీ ఏవైనా కారణాల వల్ల సమస్య అదుపులో లేకుండా పోయి... పేషెంట్‌కు శ్వాస అందకపోతే ఆక్సిజన్ పెట్టాలి. కృత్రిమ శ్వాస ఇవ్వడానికి వెంటిలేటర్ అవసరం. ఒకవేళ లంగ్స్ కు ఉన్న ఇన్ఫెక్షన్ రక్తానికీ వ్యాపించి, సెప్సిస్‌గా మారితే అప్పుడు కేవలం యాంటీబయాటిక్స్‌తో మాత్రమే చికిత్స చేస్తే సరిపోదు. ఆ పరిస్థితుల్లో అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేయించేలా మందులు ఇవ్వాలి. గుండె, రక్తప్రసరణ వ్యవస్థ అన్ని సక్రమంగా ఉండేలా చూడాలి.
రక్తపోటు నియంత్రణలోకి వచ్చేలా చూడాలి. ఒక్కోసారి అతడికి గుండె పనితీరును మెరుగుపరచడానికి హార్ట్‌లంగ్ బైపాస్ అనే చికిత్సనూ అందించాల్సి రావచ్చు. ఇలా చేయడాన్ని ‘ఎక్‌స్ట్రా కార్పోరియల్ ఆక్సిజనేషన్’ అంటారు. ఒకవేళ ఇన్ఫెక్షన్ లంగ్స్ నుంచి కిడ్నీలకు పాకితే... అప్పుడతడి రక్తంలోని వ్యర్థాలను తొలగించడానికి ‘డయాలిసిస్’ అనే ప్రక్రియను నిర్వహించాలి. రక్తం పూర్తిగా కలుషితమైతే దాన్ని బయటకు తీసుకువచ్చి అక్కడ కృత్రిమంగా శుభ్రం చేసి మళ్లీ ఆ ఇన్ఫెక్షన్ తొలగిపోయాక శరీరంలోకి ఎక్కిస్తారు. దీన్ని ‘ఎక్‌స్ట్రా కార్పోరియల్ ప్యూరిఫికేషన్’ అంటారు. ఇలాంటి సేవలెన్నో ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్/క్రిటికల్ కేర్ యూనిట్లలో దొరుకుతాయి.
ఇదో టీమ్ స్పిరిట్‌తో కూడిన ప్రక్రియ
అత్యంత సంక్లిష్టమైన ఈ క్రిటికల్ కేర్ విభాగాల్లో కేవలం ఇంటెన్సివిస్టులు మాత్రమే కాకుండా... ఆయా విభాగాలకు చెందిన నిపుణులూ సేవలందిస్తుంటారు. ఉదాహరణకు... ఆయా అవయవానికి సంబంధించిన వైద్యులు, క్రిటికల్ కేర్ కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన నర్స్‌లు, సాంకేతిక నిపుణులు (టెక్నీషియన్స్)... ఇలా ఎందరో ఒక బృందంగా (టీమ్‌గా) పనిచేస్తుంటారు. ఈ టీమ్ వర్క్ అంతా ఒక సీనియర్ ఇంటెన్సివిస్ట్ నేతృత్వంలో, అతడి ఆదేశాల మేరకు పనిచేస్తుంటారు. వీళ్లంతా ఒక టీమ్‌స్పిరిట్‌తో పేషెంట్‌ను అతడున్న సంక్లిష్ట పరిస్థితి (క్రైసిస్) నుంచి బయటపడేసి సేవ్ చేస్తారు. అందుకే ఈ వైద్యవిభాగాన్ని గౌరవపూర్వకంగా ‘క్రిటికల్ కేర్ మెడిసిన్’గా లేదా ఇంటెన్సివ్ కేర్ చికిత్స అందే ప్రదేశంగా అభివర్ణిస్తారు.
ఎవరెవరికి ఈ సేవలుఅవసరమంటే...?
సాధారణంగా చాలా పెద్దవీ, అలాగే అత్యంత సంక్లిష్టమైనవీ అయిన శస్త్రచికిత్సలు పూర్తయ్యాక పేషెంట్ పరిస్థితి బాగా నిలకడ స్థితికి వచ్చే వరకు క్రిటికల్ కేర్‌లోనే ఉంచుతారు. వాళ్లే కాకుండా ఇంకా పెద్ద పెద్ద ప్రమాదాలకు గురైనవారు, గుండెపోటు వచ్చినవారూ, పక్షవాతానికి గురైన వారూ, అవయవాల మార్పిడి చికిత్స అందుకున్నవారూ, నీళ్లలో ముగినిపోయినవారు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో కీమోథెరపీ తర్వాతా అలాగే మలేరియా, డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ వంటి మామూలు జబ్బులు సైతం కొందరిలోప్రాణాంతకంగా మారినప్పుడు వారికీ ఈ క్రిటికల్ కేర్ సేవలు అవసరమవుతాయి. ఇంకేవైనా రోడ్డు ప్రమాదాలూ, బాంబు పేలుళ్లు జరిగి అనేకమంది పదులు, వందల సంఖ్యల్లో ప్రమాదాలకు గురైనప్పుడు కూడా క్రిటికల్ కేర్ సేవలు నిరంతరం, నిరంతరాయంగా అందుతుంటాయి.
నిర్దిష్టమైన పనివేళలంటూ ఉండవు... అన్నీ పనివేళలే...
అక్కడ పనిచేసే సిబ్బందికి నిర్దిష్టమైన పనివేళలంటూ ఉండవు. ఏ క్షణాల్లో అత్యవసర సేవలు అవసరమవుతాయో తెలియక అనుక్షణం అప్రమత్తంగా ఉండేలా షిఫ్టుల్లో నిపుణులైన నర్సులు, సిబ్బంది పనిచేస్తుంటాయి. సవాళ్లతో కూడిన పరిస్థితుల్లోనూ ఇంకా గట్టిగా పనిచేస్తారు. వారు కోలుకున్న తర్వాత మళ్లీ మరొకరిప్రాణాలు రక్షించే పనుల్లో... ఇలా నిరంతరమూ తమ పనుల్లో నిమగ్నమవుతుంటారు.
అంతరాయాలను నివారించేందుకు కొద్దిమందికే అనుమతి...
ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో పనులు సాఫీగానూ లేదా అంతరాయాలు లేకుండా కొనసాగేందుకు వీలుగా సాధారణ వ్యక్తులను చాలా పరిమితంగా మాత్రమే అనుమతిస్తుంటారు. ఒకవేళ వెళ్లాల్సివచ్చినా ప్రత్యేకమైన గౌనులు, మాస్కులు, క్యాప్స్ ధరించి వెళ్లాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలు కూడా పేషెంట్స్‌కు మేలు చేసేందుకు ఉద్దేశించినవే. అక్కడ (ఐసీయూలో) ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదలను బాగా తగ్గించడానికే. ఆగిన గుండెను మళ్లీ స్పందిచేలా చేసే సీపీఆర్ (కార్డియో పల్మునరీ రిససియేషన్) చేసే సిబ్బంది వంటి ప్రత్యేక నిపుణులు అక్కడ ఉంటారు. ఈ సంయుక్త సేలవన్నింటి వల్ల ఇప్పుడు... అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో గాయపడ్డా... వారిలోప్రాణాలు కోల్పేయేవారి సంఖ్య దాదాపుగా తగ్గిపోయింది. ఇలా అందరిప్రాణాలూ కాపాడటం కోసం ఉద్దేశించిన అంత్యంత కీలకమైనదే ఈ క్రిటికల్ కేర్ విభాగం.


