
సాక్షి,తాడేపల్లి: సీఎం చంద్రబాబుకు కొత్త పథకాల ఆలోచన ఎప్పుడూ రాదని, వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పథకాల్ని కాపీ కొట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కాకాణి మీడియాతో మాట్లాడారు.
‘రాష్ట్రంలో ఎరువులు అందక రైతులు అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది. కీలక సమయంలో రైతులకు ఎరువులు అందలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా అన్నీ సమకూర్చాం. కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. రైతాంగాన్ని పట్టించుకునే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. రైతుల్ని అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారు.
రైతుల సమస్యలను చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసింది. రైతులను అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తున్న దుస్థితిలో ప్రభుత్వం ఉంది. అవినీతి సొమ్మును కూడబెట్టే పనిలో మంత్రులు ఉన్నారు. మంత్రి అచ్చెన్నాయుడికి నైతికత ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. ఆగ్రోస్ ఎండీ ద్వారా లంచాలు గుంజాలని చూసిన వ్యక్తి అచ్చెన్నాయుడు. ఎంతటి నీచ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆగ్రోస్ ఎండీ రాసిన లేఖపై ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదంటేనే వారి వేధింపులను అర్థం చేసుకోవచ్చు.అధికారుల ద్వారా కమీషన్లు గుంజుకోవాలని చూడటం సిగ్గుచేటు. ఆ తప్పుడు పని చేయలేనంటూ ఆ అధికారి లేఖ రాశారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి నైతికత ఉంటే వెంటనే రాజీనామా చేయాలి.
రైతులకు యూరియా అందించలేని ప్రభుత్వం కూడా ఒక ప్రభుత్వమేనా?.అసలు రైతాంగ సమస్యలపై ఒక్క సమీక్ష కూడా చంద్రబాబు చేయలేదు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారా? అనే అనుమానం కలుగుతోంది. వ్యవసాయ ప్రణాళికలు, విత్తనాలు, ఎరువుల సమస్యలను పట్టించుకోవటం లేదు. రైతులు రాష్ట్రంలో ఉన్నారనే విషయాన్ని కూడా చంద్రబాబు మర్చిపోయారు.
రాష్ట్రంలో యూరియా దొరక్క రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. బ్లాక్ మార్కెట్ లో రూ.200 అదనంగా వెచ్చించి కొనాల్సి వస్తోంది. యూరియా, ఎరువులు అన్నీ బ్లాక్ మార్కెట్ లోకి వెళ్లిపోయాయి. వైఎస్ జగన్ హయాంలో ఆర్బీకేల ద్వారా రైతుల చెంతకే చేర్చాం. ఐదేళ్లలో ఏనాడూ యూరియా కొరత రాలేదు.
కానీ నేడు రైతులను కూటమి ప్రభుత్వం సంక్షోభమలోకి నెట్టేసింది. రాష్ట్రానికి రావాల్సిన యూరియాలో సగం కూడా ఏపీకి రాలేదు.అయినా చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఏ పథకాన్ని కూడా పూర్తిగా అమలు చేయకుండానే చేసినట్టుగా చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. రైతులకు పెట్టుబడి కింద సొంతంగా రూ.20 వేలు ఇస్తామన్న చంద్రబాబు ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదు.

వైఎస్ జగన్ రైతుల కోసం ప్రత్యేకంగా రూ.7,800 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు.అన్ని విధాలా రైతాంగాన్ని ఆదుకున్నారు. బీమా కోసం వైఎస్ జగన్ ప్రతి ఏటా ప్రభుత్వం తరపునే ఖర్చు చేశారు. దాన్ని కూడా టీడీపీ ఎంపీలు తప్పుదారి పట్టించేలా మాట్లాడారు. రైతులను ఈ ప్రభుత్వం పట్టించుకోనందునే 250 మంది ఆత్మహత్య చేసుకున్నారు.అంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేం ఉంటుంది?. ఆగ్రోస్ ఎండీ రాసిన లేఖపై ఇప్పటికీ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు?.వరదలకు నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి.రైతులకు యూరియాను వెంటనే అందించాలి.
రాష్ట్రంలో వ్యవసాయశాఖ మంత్రి ఉన్నాడా అనే అనుమానం ఉంది. కూటమి ప్రభుత్వం ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు. చంద్రబాబుకు కొత్తపథకాల ఆలోచన ఎప్పుడూ రాదు. అన్నీ వైఎస్ జగన్ పథకాలే చంద్రబాబు కాపీ కొట్టాడు. వైఎస్ జగన్ హయాంలోనే రైతులకు న్యాయం జరిగింది. రైతులకు రైతు భరోసా అందించిన ఘటన వైఎస్ జగన్‌దే. చంద్రబాబు అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు ఇస్తానని మోసం చేశారు’అని ధ్వజమెత్తారు.