
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణతో బడుగు,బలహీన వర్గాలే కాదు అగ్రవర్ణాల్లోని పేదలకు సైతం తీరని అన్యాయం జరుగుతుందని జైభీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా విజయవాడలో శనివారం మేధోమథనం సదస్సు జరిగింది.
జడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. పీపీపీ అంటే పూర్తిగా ప్రైవేటీకరణ చేయడమే. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం వల్ల సామాన్యులకు తీరని నష్టం తప్పదు. ఈ విధానం వల్ల బడుగు,బలహీన వర్గాలే కాదు అగ్రవర్ణాల్లోని పేదలకు సైతం తీరని అన్యాయం జరుగుతుంది. తీవ్ర వ్యతిరేకత వస్తున్న చంద్రబాబు వెనక్కి తగ్గకపోవడం వెనుక అతిపెద్ద లాభం ఉందనేది స్పష్టమవుతోంది. పీపీపీ చేయడం వల్ల వచ్చే కమిషన్లలో చంద్రబాబు,పవన్,లోకేష్‌కు వాటాలు పంచుకోవాలనుకుంటున్నారు.
.. ప్రైవేటీకరణ చేయడం వల్ల ఒక్క ఏడాది అడ్మిషన్లలోనే రూ.400 కోట్లు సంపాదిస్తారు. చంద్రబాబుకు నాదొక సూటి ప్రశ్న..ధైర్యముంటే సమాధానం చెప్పాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు జరిగే విధానంలోనే పీపీపీలోనూ చేపడతారని చెప్పగలరా?. ప్రైవేటీకరణను అడ్డుకోకపోతే మన భావితరాలు తీవ్రంగా నష్టపోతాయి. మెడికల్ విద్యను ప్రైవేటీకరణ చేయనిస్తే మన భవిష్యత్ తరాలు మనల్ని క్షమించరు. కచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలి అని అన్నారాయన. ఈ క్రమంలో..
సీఎం చంద్రబాబు,హోంమంత్రి అనిత పై జడ శ్రవణ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. ‘‘అన్నీ నేనే కనిపెట్టానని చంద్రబాబు చెబుతారు. చంద్రబాబు వల్ల ఏడాదికి 2500 మంది పేద విద్యార్ధులకు విద్య అందకుండా చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత తన పని తాను చేయడం లేదు. శాంతిభద్రతలను గాలికొదిలేసి మెడికల్ కాలేజీల పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన వంగలపూడి అనితకు నాదొక ప్రశ్న. ప్రభుత్వ మెడికల్ కాలేజీల అడ్మిషన్ పద్ధతిలోనే ప్రైవేట్ మెడికల్ కాలేజీల అడ్మిషన్లు జరుగుతాయా?. పేద విద్యార్ధులకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయారు?’’ అని ప్రశ్నించారాయన.

అమ్ ఆద్మీ పార్టీ నేత నేతి మహేశ్వరరావు మాట్లాడుతూ.. పీపీపీ అంటే చంద్రబాబుకు తెలుసా?. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రజలకు ఇచ్చే అసలైన సంక్షేమం. కోవిడ్ నేర్పిన పాఠాలను మనం గుర్తు తెచ్చుకోవాలి. పేదలకు మెరుగైన వైద్యం,వైద్య విద్యను అందజేస్తేనే సమాజం బాగుపడుతుంది. రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఏడాదికి రూ.2 వేల కోట్లు ఖర్చు చేయలేకపోతున్నారా?.. మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా...ప్రజలతో వ్యాపారం చేస్తున్నారా? అని నిలదీశారు. జైభీమ్ రావ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని.. ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించారు.
ఇదీ చదవండి: టీడీపీలో వాళ్లు పనోళ్లేనా?