
పాలక పక్షం వర్గీయులకే హోదాలు
ఇతరులు కుల కార్పొరేషన్లకు పరిమితమా?
కూటమి వర్గీయుల్లోనూ ఆగ్రహం
సామాజిక న్యాయమేదంటూ నిలదీత
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: పదవుల పంపిణీలో ఒక సామాజికవర్గానికి ప్రాధాన్యం దక్కుతోంది తప్ప తక్కిన వారికి అన్యాయం కొనసాగుతోందనిఎన్టీఆర్ జిల్లాలోని టీడీపీ నేతలు, కూటమి పార్టీల నాయకులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ‘పదవులకు వాళ్లు, పనులకు మనమా’ అంటూ అంతర్గత చర్చల్లో పరస్పరం వాపోతున్నారు. ఆయా కుల కార్పొరేషన్లకు మాత్రమే మనం పరిమితమా అని మథనపడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటివరకు దక్కిన పదవులను బేరీజు వేసుకుంటున్నారు. తాజాగా దుర్గగుడి దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్‌గా బొర్రా రాధాకృష్ణ (గాందీ)ని ప్రకటించిన తరువాత టీడీపీలోని పాలకపక్ష సామాజికవర్గీయులు సైతం మండిపడుతున్నారు. పాలకమండలి సభ్యుల్లో ఏ వర్గం వారిది మెజారిటీనో కూడా పరిశీలించాలంటున్నారు.
ఇదీ వరుస..
తెలుగుదేశం పార్టీ నుంచి విజయవాడ లోక్‌సభ సభ్యుడిగా కేశినేని శివనాథ్ (చిన్ని), విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్, మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్, పశ్చిమ ఎమ్మెల్యేగా యలమంచిలి సుజనాచౌదరి (బీజేపీ) ప్రాతినిధ్యం వహిసున్న సంగతి తెలిసిందే. నందిగామ, తిరువూరు రిజర్వుడు స్థానాలు అయినందున ఆ వర్గీయులైన కొలికపూడి శ్రీనివాస్, తంగిరాల సౌమ్యలు కాగా విజయవాడ సెంట్రల్ నుంచి బొండా ఉమామహేశ్వరరావు, జగ్గయ్యపేట నుంచి శ్రీరాం తాతయ్య ఉన్నారు. కుల కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పదవులు కాకుండా తక్కిన ప్రాధాన్యతా పోస్టులు మాత్రం దాదాపు చంద్రబాబు సామాజికవర్గీయులకే దక్కడం పరిశీలనాంశం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్‌గా కొమ్మారెడ్డి పట్టాభిరాం, కేడీసీసీబీ చైర్మన్‌గా నెట్టెం రఘురాం పదవుల్లో కొనసాగుతున్నారు. చివరకు జిల్లా పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీల చైర్మన్లు సైతం ఆ వర్గీయులకే మెజారిటీ దక్కాయి.
దుర్గగుడి చైర్మన్ పదవి కూడా..
దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయ చైర్మన్‌గా బొర్రా రాధాకృష్ణ (గాందీ) నియామకం జిల్లాలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు వియ్యంకుడు, లోకేష్ మామ, హిందూపురం ఎమ్మెల్యే అయిన బాలకృష్ణకు సన్నిహితుడు కావడం మినహా రాజకీయంగా గాం«దీకి ఉన్న అర్హతలు ఏంటని టీడీపీ వర్గాలే నిలదీస్తున్నాయి. బాలకృష్ణను అనుసరించడం తప్ప పార్టీలో బాధ్యత, కార్యక్రమాలలో భాగస్వామ్యం ఏపాటిదని ప్రశి్నస్తున్నారు. ఫైనాన్స్ వ్యాపారిగా, ఎల్‌ఐసీలో పనిచేసిన గాంధీ మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ)కు అనుచరునిగా కొనసాగారని గుర్తుచేస్తున్నారు.
ఇదే విషయాన్ని జిల్లాలోని టీడీపీ ముఖ్య నేతలను ద్వితీయశ్రేణి నాయకులు ప్రశ్నించగా, ‘మాదేముంది అంతా అధిష్టానం నిర్ణయమేగా’ అని బదులిచ్చి మౌనం దాల్చారని సమాచారం. విజయవాడ పశి్చమ పరిధిలోని ముఖ్య పదవుల్లో సుజనాచౌదరి, గాంధీ, గొల్లపూడి మార్కెట్ యార్డు చైర్మన్ నర్రా వాసు, దుర్గ గుడి సభ్యురాలు గూడపాటి వెంకట సరోజనిదేవి ఒకే సామాజికవర్గానికి చెందినవారు. పశి్చమ పరిధిలోని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్‌గా కూటమి ప్రభుత్వం రాకముందు నుంచే టీడీపీకి చెందిన చలసాని ఆంజనేయులు కొనసాగుతున్నారు.
నందిగామను పరిశీలిస్తే చాలు..
టీడీపీలో పదవుల పంపకం ఎలా ఉన్నాయనేది నందిగామ నియోజకవర్గాన్ని ఉదాహరణగా పరిశీలిస్తే తేటతెల్లం అవుతుంది. పదవులన్నీ ఒక సామాజికవర్గానికేనా అనే చర్చ కూటమి పార్టీల వైపు నుంచి సోషల్‌మీడియాలో జోరుగానే కొనసాగుతోంది. కంచికచర్ల ఏఎంసీ చైర్మన్‌గా కోగంటి వెంకట సత్యనారాయణ (బాబు), నాగార్జున సాగర్ ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్ చైర్మన్, చందర్లపాడు, నందిగామ, కంచికచర్ల, వీరులపాడు డి్రస్టిబ్యూటరీ కమిటీ చైర్మన్‌లుగా పాలకపక్షం వర్గీయులే. తాజాగా దుర్గ గుడి సభ్యురాలిగా మన్నే కళావతికి అవకాశం దక్కింది.
మునిసిపల్ చైర్మన్, ఏరియా హాస్పిటల్ చైర్మన్ ఆ సామాజికవర్గం వారే. ఇక ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ (పీఏసీఎస్)ల చైర్మన్‌ల సంగతి సరేసరి. చందర్లపాడు, చింతలపాడు, గుత్తావారిపాలెం, కాసరబాద, కొడవటికల్లు, కోనాయపాలెం, ముప్పాళ్ల, చెవిటికల్లు, గండేపల్లి, కంచికచర్ల, గనిఆత్కూరు, గొట్టుముక్కల, మోగులూరు, పరిటాల, సక్కలంపేట, పెరకలపాడు, అడవిరావులపాడు, కంచెల, ఐతవరం, చౌటపల్లి, పొన్నవరం, వీరులపాడు, వెల్లంకి, జమ్మవరం సొసైటీల చైర్మన్లుగా ఆ సామాజికవర్గీయులే కొనసాగుతుండటం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా ఉంది. మరో ఎనిమిది పీఏసీఎస్‌ల చైర్మన్లుగా మాత్రమే ఇతరులున్నారు. రూరల్ నియోజకవర్గాల్లో నీటి సంఘాల కమిటీలు, వ్యవసాయ కమిటీలకు అధిక ప్రాధాన్యతనేది తెలిసిందే.
విజయవాడ పశ్చిమానికి చెందిన నాగుల్‌మీరాను రాష్ట్ర నూర్‌బాషా సంఘం కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించగా ఆయన అప్పట్లోనే అధిష్టానం వద్దే అయిష్టతను వ్యక్తం చేసినట్లు సమాచారం. శాసనసభా స్థానం నుంచి పోటీచేసిన, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేసిన తనను కుల సంఘానికి పరిమితం చేయడం ఇబ్బందికరమని అన్నట్లు తెలిసింది. నగరంలోని మరికొందరు నాయకులను కూడా కుల సంఘాల పోస్టులకు పరిమితం చేయడం గమనార్హం.
జగ్గయ్యపేట ఏఎంసీ చైర్మన్ పదవిని ఎస్‌సీ మహిళకు కేటాయించాలనే నిర్ణయం జరిగింది. జిల్లా కలెక్టర్ అయిదారు నెలల కిందట నోటిఫికేషన్ కూడా జారీచేశారు. ఎంపీ కేశినేని చిన్ని వర్గీయుడైన గండ్రాయి గ్రామానికి చెందిన కొటారి సత్యనారాయణ ప్రసాద్ అడ్డంకులు సృష్టించారు. తమ వర్గానికే ఇవ్వాలనడంపై ఎస్‌సీ సంఘాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. కోర్టు స్టే ఇచ్చింది.
జిల్లా పరిధిలోని పలు దేవాలయాల చైర్మన్ పదవుల నియామకాలు జరగలేదు. మరికొన్ని ఆలయాలకు పాత కమిటీలే కొనసాగుతున్నాయి. ఇతర సామాజికవర్గాల వారికి పాలకమండలి పదవులు దక్కడం ఇష్టంలేక భర్తీచేయలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.