
సాక్షి,తాడేపల్లి: తాడేపల్లి: రాష్ట్రంలో కల్తీ మద్యం తాగిన ఘటనలో పలువురు మరణించారు. అందుకే ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో ఆమె శనివారం(అక్టోబర్11)న మీడియాతో మాట్లాడారు.
‘కల్తీ మద్యం కేసును సీబీఐకి ఇవ్వాలి. కల్తీ మద్యం తయారీ దారుల వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారు. అందుకే కేసును నీరు గార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎందుకు బయటకు రావటం లేదు?.నకిలీ మద్యం గురించి చంద్రబాబు మాట్లాడాలి.
జయచంద్రారెడ్డి టీడీపీ పెద్దలకు కోట్ల రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకున్నారు. అలాంటి వ్యక్తిని వైఎస్సార్‌సీపీ కోవర్టు అని ముద్ర వేస్తున్నారు. మరి జయచంద్రారెడ్డి వైఎస్సార్‌సీపీ కోవర్టులయితే టికెట్ ఎందుకు ఇచ్చారు?. లావు శ్రీకృష్ణదేవరాయలు సహా ఇప్పుడు ఉన్న కొందరు మంత్రులు కూడా మా కోవర్టులే.
మరి వాళ్లపై చర్యలు తీసుకునే ధైర్యం ఉందా?.ఏపీలో కల్తీ మద్యం ఫ్యాక్టరీలను ఏర్పాటు చేశారు. రేపల్లె, ఏలూరు సహా అనేక చోట్ల టీడీపీ నేతలు నకిలీ మద్యం కింగ్ పిన్‌లా మారారు. మా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు అత్యంత పారదర్శకంగా జరిగాయి.
ఎక్కడా నకిలీ, కల్తీకి ఆస్కారం లేకుండా చేశారు.కానీ టీడీపీ నేతలు తమ జేబులు నింపు కోవటానికి నకిలీ మద్యం తయారు చేస్తున్నారు.ఈ మద్యంతో రాష్ట్రంలో మహిళల తాళి బొట్టు తెంచుతున్నారు. చంద్రబాబు హయాంలో నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు పెరిగి పోయాయి. ప్రతి నాలుగు సీసాల్లో ఒకటి నకిలీ మద్యమే. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం తనిఖీలు చేయటం లేదు. ప్రభుత్వ పెద్దల కుట్ర దీని వెనుక ఉంది. అయినప్పటికీ ఎల్లో మీడియాలో వార్తలు రావటం లేదు. నకిలీ మద్యం కావడం వల్లే తెలంగాణ వెళ్లి కొనుగోలు చేస్తున్నారు’అని అన్నారు.
